Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 9

రమణ కథలను విభాగించవలసి వస్తే, శృంగార కథల్లో ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు, రాధా గోపాలం, సీత, తాంబూలాలిచ్చేశారు, ఏకలవ్యుడు, భగ్నవీణలు, బాష్పకణాలు, వరలక్ష్మీ వ్రతం లెక్కకు వస్తాయి.

'ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు' పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో నడిచిన కథ. ఒక డబ్బున్న హీరో, అతని చెలికాడు, ఇద్దరికీ చెరొక కథానాయిక, మధ్యలో మంచివాడుగా పేరు తెచ్చేసుకుంటున్న ఒక విలన్‌. హీరో మామయ్య రాజకీయాలు నడపడం, చివరికి దొంగరాముడు అండ్‌ కో వాళ్ల సాయంతో హీరోల విజయం. ఈ పెద్ద కథలో నల్లులపై రాసిన థీసిస్‌ ప్రసిద్ధమైనది కాబట్టి దాన్ని వదిలేసి పల్లెటూళ్ళో సూర్యోదయ వర్ణన గురించి గుర్తుకు తెచ్చుకోవచ్చు. - ''తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడి కూసింది. కాకులు మేలుకున్నాయి. ఈగలు డ్యూటీకి బయలు దేరాయి. దోమలు  విశ్రాంతికి ఉపక్రమించాయి. దాలిగుంటల్లో పిల్లులు బద్ధకంగా లేచి వళ్లు విరుచుకుని బయటకు నడిచాయి. ఆవులు అంబా అన్నాయి. పువ్వులు వికసించాయి. నవ్వడం అలవాటైన పిల్లలు చక్కగా నవ్వారు. ఉత్తి పుణ్యానికి యేడవడం వృత్తిగా గల పిల్లలు చక్కగా ఏడుపు మొదలెట్టారు... ఆలస్యంగా లేచినవాళ్లు హడావుడిగా పోతున్నారు. ఈసరయ్య హోటల్‌ నుంచి, ఎండు తామరాకుల వేడి వేడి ఇడ్లీ పొట్లాలని ఆఘ్రాణించి ఆనందిస్తూ కొందరు కుర్రాళ్లు తిరుగుతున్నారు. ఈ హడావుడంతా చూసి నిజంగా తెల్లవారిందనుకుని సూర్యుడు ఉదయించాడు.''

బ్రహ్మచారిగా ఉండగానే దాంపత్య జీవితంలోని సొగసుల గురించి రమణ రాసిన కథలు 'రాధాగోపాలం'. వారిది ఎంత అన్యోన్యమైన దాంపత్యమంటే- ''రాధతో రోజులు గోపాలానికి కవిత్వం నేర్పాయి. పెరుగు మీద తొరక కోసం రాధ పెట్టే రభస అతనికి హృదయమంతటితోనూ నవ్వడం నేర్పింది. కొనతేలిన రాధమ్మ నాసిక అతనికి దేముడి శిల్పచాతురిని బోధపరిచింది. రాధమ్మ నిద్రించినపుడు ఆమె నయనాలు అందానికి అర్థాలు చెప్పాయి. రాధమ్మ చూపులు అతనికి ఏం చెప్పేవో చెప్పడం అతనికి తరం కాదు. రాధమ్మ తరం కాదు.'' అయినా రాధ కట్టుకున్న చీర విషయంగా అలిగిన గోపాలం కథ - 'లహరి'! పెళ్లికి ముందు రాధను ప్రేమించడానికి తాను పెట్టిన ప్రీ-ఎస్టాబ్లిష్‌మెంట్‌ చార్జీలు డిమాండ్‌ చేసిన గోపాలానికి తనూ ఆ సందర్భంగా పెట్టిన ఖర్చులు చెప్పుకొచ్చి 'మీరే నాకు బాకీ' అని తేల్చిన కథ- 'రాధమ్మ బాకీ'.! వారి పుత్రోదయం కథ - 'కుమార సంభవమ్‌'! వాళ్లింటికి వచ్చిపడ్డ బోల్డుమంది బంధువుల కథ - 'చుట్టాలొచ్చేరు'! గోపాలం తన ఫ్రెండు తుకారాం (అప్పారావు మరో అవతారం)కి పెళ్లి సంబంధం చూడబోవడం 'తిమింగలగిలం 'కథ'.

'సీత' కథలో ఒక ప్రేమికుడు, ప్రేయసి బింకాలకు పోయి వ్యవహారం చెడగొట్టుకోబోవడం కనబడుతుంది. ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా దూకుడుగా పోయే మగవాడి సంగతి చెబుతుంది. 

''ఏమండీ... అసలు మీకు నా ఎడ్రసు ఎలా తెలిసింది?'' అంది సీత తటాలున.

ఉద్విగ్నుడై కళ్లు మూసుకుని కారు ఎక్కుతున్న సత్యానికి సీత మాటల బరువు తెలియదు. పరిస్థితులు ఇలా వక్రించాక, తిరిగి అతన్ని ఈ ప్రశ్నతో నిలవేసి - బహుశా అతను చెప్పదలచుకున్నది అతనికి తెలియకుండానే చెప్పించి, సక్రమపరచాలనే ఉద్దేశాల, ఆశల ఛాయలు సీతలో ఉన్నవని అతను గ్రహించ లేదు.''

'తాంబూలాలిచ్చేశారు' - టపటపా ప్రేమలో పడిపోయి వాళ్ల నాన్న బెదిరించడంతో అదే స్పీడులో ప్రేమలోంచి బయటపడిపోయే ఉత్తుత్తి ప్రేమికుడి కథ.

ప్రేమించిన అమ్మాయి సరోజని మెప్పించడానికి విజ్ఞానం సముపార్జించడానికి ఓ కుర్రాడి దగ్గర ట్యూషన్‌ పెట్టించుకుంటాడు రాజు. అతని చెలికాడు అప్పారావు గంట, గంటకు బుల్లెటిన్‌లు పంపుతూ ఉంటాడు. ''రాజూ, సరోజ ఫస్టు పీరియడ్‌లో నీ రైవల్‌ సుబ్బారావు వంక మూడుసార్లు సూటిగా చూసింది. సారీ, అ. రావు.''

రెండవ గంట కాగానే ఇంకో బులెటిన్‌ వచ్చింది.

''రాజూ. ఇది నీకు తెలుసా? రైలుస్టేషనులో ఉత్త పుణ్యానికి ఇనప రేకుల తోరణాలలాటివి పట్టాల కడ్డంగా కట్టి ఉంటాయి. అవి ఎందుకో తెలుసా?''- ఇట్లు అప్పారావు. పి.యస్‌- సరోజకి తెలుసట!

'ఏకలవ్యుడు' - సీత అనే అమ్మాయి ఒక్కత్తినే ఏకైక లవ్‌గా నిలుపుకున్న ఏకలవ్యుడి కథ. కానీ వాళ్ల తల్లిదండ్రులు అభిప్రాయ భేదాల వల్ల కథ అడ్డదారి పట్టి తుకారాం అనే ఫ్రెండు వల్ల సుఖాంతమవుతుంది. వియ్యంకులిద్దరి మధ్య జరిగే మాటల పోటీలు కథకు హైలైట్‌. ఓ సందర్భంలో డంగై పోయినతని అవస్థ వర్ణన- 'రాగాలాపనలో పై షడ్జమం దాటిపోయి అక్కడేం చెయ్యాలో తోచక, దిగలేక నిలవలేక అవస్థపడే జూనియర్‌ గాయకుడిలా గింజుకోసాగాడు.'

''అవునయ్యా! అవునూ- ఎడం వేపుకి మార్చిందంటే హృదయం అన్నమాట- హృదయాన్ని సూచిస్తోందన్నమాట. పాపం! ఎంత బాధ పడిపోతోందో నాకోసం!'' అన్నాడు దిలీప్‌ త్రీ మూడో బజ్జీని పరీక్షగా చూస్తూ.

'వరలక్ష్మి వ్రతం' - ''ఇరుగు పొరుగులను ప్రేమించడం మధ్య ఇంట్లో కాపురం ఉన్న వారి విద్యుక్త ధర్మం'' అంటూ మొదలైన ఈ కథ అందమైన అమ్మాయి తల్లి అభిమానాన్ని చూరగొనడానికి ఓ ప్రేమికుడు పట్టిన వ్రతం గురించి చెబుతుంది.

'జనతా ఎక్స్‌ప్రెస్‌' - 'భారతి'లో వచ్చిన ఈ కథ మధ్య తరగతి జీవుల జీవితాలకు దర్పణం. దీనిలోని పాత్రలతోనే ''అందాల రాముడు'' సినిమా తీసారు. మధ్య తరగతి గురించి రాసేటప్పుడు రమణ ఆ వర్గాన్ని వెనకేసుకు రాలేదు. కిల్లాడీలు, భేషజాలకు పోయేవాళ్లు, డబ్బుంటే పేకాడేసి, పజిల్స్‌ కట్టేసి డబ్బు తగలేసేవాళ్లు - వీళ్లందరితో బాటు ఎదుటివాటిది తప్పని తెలిసీ జాలిపడేవాళ్లూ కనబడతారు.

'కన్నీటి పాట' - ఆంధ్రజ్యోతి వీక్లీలో జూలై '90 నాటి కథ. ఏడవడానికి టైము దొరక్క ఏడుపు వాయిదా వేసుకున్న ముసలి ఆనందరావు తీరిక దొరికి ఏడవబోతే అది ఏడవవలసినంత పెద్ద విషయంగా అనిపించదు. అందులోనూ ఆకలీ, ఆనందరావూ సంభాషించుకుంటారు. ''ఓ నువ్వా ఆకలివా?... సోదరా! యాభై ఏళ్ల నించి ఇల సాటిలేని జంటలా వుంటున్నాం. లోగడ నువ్వు నా నీడవి. ఇప్పుడు నేనే నీ నీడలా వెన్నంటి వస్తున్నాను....'' అంటాడు పాపం ఆనందరావు.

'మహరాజూ యువరాజూ'- ఒక చిరుద్యోగి, ఒక నిరుద్యోగి తమ సొమ్ములు తాకట్టు పెట్టి చెరో రూపాయి సంపాందించుకుంటారు. అది అవసరాలకు కాకుండా ఇతరత్రా ఖర్చు చేసేస్తారు కానీ ఇద్దరూ అవతలివాడి గురించి అసూయపడతారు. గొప్ప కథ చిరుద్యోగి గురించి రమణ అంటాడు - 'ఎన్‌.జి.వో. మహారాజు ధోరణి వేరు. గుట్టుగా వేదాంతం సాధన చేస్తూ ఉంటాడు - గిట్టేనాటికి ముమ్మూరల నేల కోసం. ఈ యాతనలు ఎలాగా తప్పవు. చేతికి నూనె రాసుకోకుండా అప్పడాల పిండితో ఆటలాడబోతే సంసారం ఇలా అంటుకుంది. అంచేత ఆ పిండి వదలదు కాబట్టి ఇహ దానికోసం పబ్లీకున దుఃఖపడక తప్పకపోయినా. చాటున మటుకు అసలు పిండే కాదు చేతులే లేవనుకుని విరగబడి నవ్వుకుని తృప్తిపడడానికి తిప్పలు పడతాడు.' ఇంత అద్భుతంగా మిడిల్‌ క్లాసును విశ్లేషించడం ఎవరికి సాధ్యం?

'అర్థాన్వేషణ' - ఏభై రూపాయిల అప్పు దొరకలేదు కాబట్టి పీకెల మీదికి వచ్చిందనుకునే నరసన్నగారికి అప్పన్న హితోపదేశం చేస్తాడు. ''మనవంటి వాళ్లకి అసలు పీకెల మీదకి రానిదెప్పుడు? మీకివాళ యాభై రాళ్ల అప్పు పీకెల మీద కూర్చుంది. నేనిచ్చానే, మీరు తీర్చారే, పీకెల మీది ముప్పు తప్పించుకున్నారే - అనుకోండి. మళ్లా రేపు సాయంత్రానికే ఇంకో ఉప్పెన వచ్చి పడుతుంది. అది గడిస్తే ఇవాళ డబ్బు సర్దిన నేనే ఎల్లుండి సాయంత్రం పీకెల మీద కత్తి నౌతాను, గండాలూ మన్నేం చెయ్యవు. మీకివాళ డబ్బు దొరకదనుకోండి. అప్పులాడికేదో చెప్పుకుంటారు. వాడు ధాంధూం అంటాడు. అని?.. ఏముంది సరే మళ్లీ వస్తానంటాడు...''

'ఆకలి-ఆనందరావు' ఆనందరావునే నిరుద్యోగికి ఆత్మా రాముడితో జరిగే పోట్లాట. కథాశిల్పం పరమాద్భుతం.

'సెరిౖబ్రల్‌ సినేమియా' - ఆనందరావు సినిమా స్టూడియోల చుట్టూ తిరుగుతూంటాడు. అతని మెడకు రౌడీ వేషాలు వేద్దామని ఉబలాటపడే వరహాలనే డోలు ఒకటి. '...నిజానికి ఆనందరావు కొత్తలో వేషాలు సంపాదించడానికి ప్రయత్నించాడు. అది కలిసి రాక, అసిస్టెంటు డైరెక్టరు అవుదామని ఆశ పడ్డాడు. రద్దీ ఎక్కువ. టెక్నికల్‌ సైడు ట్రే చేశాడు. అంబ పలకలేదు. అదీ ఇదీ అన్నాడు. ఏదీ సాగి రాలేదు. చివరికి సినిమా కథలు రాయటానికి సిద్ధ పడ్డాడు.' అంటూ సినీజాలంలో పడి కొట్టుకునే జీవులను మన ఎదుట సాక్షాత్కరింపజేస్తుందీ కథ. 

(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?