Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 11

సాహితీ సర్వస్వం ప్రతిపాదన :  నేను నవోదయా రామమోహనరావుగారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించేవాణ్ని. విశాలాంధ్రవారు కొడవటిగంటివి వేస్తున్నట్టుగా రమణగారి రచనలనన్నిటినీ పెద్ద పెద్ద వాల్యూమ్స్‌గా వేయవచ్చు కదా అని అడిగేవాణ్ని. ''రమణ పాఠకులు లైట్‌ రీడర్స్‌. వాళ్లు యింత పెద్దవి చదవరు.'' అని ఆయన సిద్ధాంతం. ఆయన ఎంత చెపితే అంత రమణగారికి. అసలు  తన పుస్తకాలన్నీ మార్కెట్‌లో వున్నాయా లేదా, ఎన్ని ఎడిషన్స్‌ వేశారు, వాటిపై ఎంత రాయల్టీ ఎంత వస్తోంది - యివేమీ ఆయన పట్టించుకోలేదు. సాహితీసర్వస్వం గురించి నేను పోరుపెడుతూండేవాణ్ని. నేను వెలికి తీసినవన్నీ చూశాక, వెరైటీ చూశాక అటువంటిది వేస్తే బాగానే వుంటుందాన్న సందేహాన్ని ఆయన మనస్సులో నాటగలిగాను. 8 సంపుటాల సాహితీసర్వస్వంలో ఏ సంపుటంలో ఏది పెట్టబోతున్నానో అన్నీ లెక్కలు వేసి చూపించాను. ఆయనకు నచ్చింది. కానీ పబ్లిషర్‌ ఎవరూ రెడీ కాలేదు. 'నవోదయా వారు వేయకపోతే పోనీ నేనే పబ్లిష్‌ చేసేస్తా' అని అనడానికి ఆయనది ఆ వ్యాపారమూ కాదు, ఆనాటి ఆయన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించేలానూ లేదు. 

''సరే వేద్దాం. కానీ మరి యీ వర్గీకరణ, సంపాదకత్వం అదీ ఎవరు చూస్తారు?'' అన్నారు. 

''నేను'' అన్నాను. సాహితీసర్వస్వం ఆఖరి సంపుటం ముందుమాటలో చివర్లో రాశా - ''...సాహితీ సర్వస్వం సంపాదక బాధ్యత నాకు అప్పగించడంలో రమణగారు, విశాలాంధ్రవారు సాహసం చేశారని చెప్పక తప్పదు. నేను రచయితను, వ్యాసకర్తనే తప్ప సాహిత్య అధ్యాపకుణ్ని/పరిశోధకుణ్ని/విమర్శకుడిని కాను. పోనీ పాత్రికేయుణ్నయినా కాను. కనీసం పుస్తక సమీక్షకుణ్నయినా (ఆ నాటికి) కాదు. ఐనా వారు నాపై నమ్మకముంచారు. రమణగారి అభిమానుల్లో అగ్రేసరులు బాపుగారు యిచ్చిన ప్రోత్సాహం మరువరానిది...'' అని. 

రమణగారు నాపై వుంచిన నమ్మకం వలన విశాలాంధ్రవారు పబ్లిష్‌ చేసి డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి సరే అనేశారు. రమణగారూ ఓకే అనేశారు.

ఓ పదిరోజులు పోయాక రాజేశ్వరరావుగారు ఫోన్‌ చేశారు. ''రమణగారి రచనల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత వుంటే మాత్రం వాటిని ఎడిట్‌ చేయాల్సి వుంటుందని చెప్పమన్నారండి.'' అని.

''అలాటిది ఏమీ లేదని నేను గట్టిగా చెప్తున్నాను. ఆయన రాజకీయాల్ని విమర్శించారు తప్ప కమ్యూనిస్టులను పనిగట్టుకుని ఏమీ అనలేదు. ఆయన రచనల్లో దేన్నయినా ఎడిట్‌ చేస్తానంటే ఆయన మాట ఎలా వున్నా ముందు నేనే ఒప్పుకోను.'' అన్నాను. రమణగారికి చెప్తే 'కరక్ట్‌, కరక్ట్‌. పుస్తకాలుగా రాకపోయినా ఫర్వాలేదు' అన్నారు. తర్వాత విశాలాంధ్ర వారే 'సరే అలా అయితే..' అన్నారు.

సాహితీ సర్వస్వం రూపకల్పన :  అయినా కొందరు విశాలాంధ్ర రెగ్యులర్‌ పాఠకులకు తమ అభిమాన సంస్థ ముళ్లపూడి వంటి 'రియాక్షనరీ' రచనలు ప్రచురించడం నచ్చలేదు. చెప్పానుగా, ఆయనకు కొందరు కొట్టిన ముద్ర అలాటిది. అలాటి వాళ్లల్లో ఒకాయన ''కథారమణీయం - 1'' మార్కెట్‌లోకి రాగానే విశాలాంధ్ర ట్రస్టు సభ్యులైన సురవరం సుధాకరరెడ్డిగారికి ఓ పెద్ద వుత్తరం రాశాడు - మీరు పోయి పోయి యీయన పుస్తకాలు వేయడమేమిటని. రాశాడే కానీ, పుస్తకం కొన్నాడు. చదివి, వారం రోజులు పోయాక యింకో ఉత్తరం రాశాడు - 'అసలిలాటి పుస్తకం వేయకపోతే విశాలాంధ్ర చాలా తప్పు చేసినట్టు అయ్యేది' అని. సురవరంవారు రెండు ఉత్తరాలూ కలిపి రాజేశ్వరరావుగారికి ఒకేసారి యిచ్చారు. 'రమణ రచనలు చదవనివారే ఆయనకు సామాజిక స్పృహ లేదంటారు' అనే నా వాదనకు మరింత పరిపుష్టి కలిగింది.

నేను సాహితీసర్వస్వం డిజైన్‌ చేసిన విధానం గురించి చెప్తాను. మొత్తం 8 సంపుటాలుగా విభజించాను. కథలు, పెద్దకథ (ఇద్దరమ్మాయిలు..) కథామాలికలు యివన్నీ కలిపి కథారమణీయం అని రెండు భాగాలు - వ్యాసాలు, గిరీశం లెక్చర్లు, నవ్వితే నవ్వండి, యివన్నీ కలిపి కదంబరమణీయం అని రెండు భాగాలు -  సినిమా సమీక్షలు, సినిమా వ్యక్తులపై వ్యాసాలు, దేశవిదేశ సినీరంగాలపై వ్యాసాలు కలిపి సినీరమణీయం అని రెండు భాగాలు -  అనువాద రమణీయం అని 80 రోజుల్లో భూప్రదక్షిణం, పిటి 109 (ఈ పుస్తకం దొరకడానికి చాలా కష్టపడ్డాం, నవోదయా రామ్మోహనరావు గారు సంపాదించి యిచ్చారు) అనువాదాలు కలిపి ఒక పుస్తకం -  బుడుగు రెండు భాగాలు కలిపి ఒక పుస్తకం. మొత్తం 8. కథలను రస రమణీయం, సరస రమణీయం, ఋణ రమణీయం, జన రమణీయం, బాల రమణీయం, లోకాభి రమణీయం, సరదా రమణీయం, కౌటిల్య రమణీయం అని విభాగాలుగా చేసి అందించాను. కథా రమణీయం రెండు భాగాలలో బడ్జెట్‌ పరిమితుల వలన ఏ ఒక్క భాగం కొన్నా రమణ వైవిధ్యాన్ని రుచి చూడవచ్చనే నా ఊహ. ఇలాటి విభాగాలే కదంబ, సినీ రమణీయాల్లో చేశాను. 

ప్రతీ సంపుటిలోనూ ఒక బాగా పాప్యులర్‌ అయిన రచన వుండేట్లు చూశాను. మొదటి సంపుటం (కథా రమణీయం - 1)లో ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు ప్లస్‌ రాజకీయబేతాళ పంచవింశతి, రెండవ సంపుటం (కథారమణీయం - 2)లో రాధాగోపాలం, మూడవ సంపుటంలో బుడుగు, నాల్గవ సంపుటం (కదంబరమణీయం -1)లో నవ్వితే నవ్వండి, ఐదవ సంపుటం (కదంబ రమణీయం - 2)లో గిరీశం లెక్చర్లు, ఆరవ సంపుటం (సినీరమణీయం - 1)లో విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు, ఏడవ సంపుటం (సినీరమణీయం - 2)లో కథానాయకుని కథ (ఎఎన్‌ఆర్‌ జీవితచరిత్ర), ఎనిమిదవ సంపుటం(అనువాద రమణీయం)-లో 80 రోజుల్లో భూప్రదక్షిణం. 1/8 డెమ్మీ సైజులో ఒక్కో సంపుటం రమారమి 300 పేజీలు. రూ.150/- వెల. ప్రూఫ్‌ రీడింగ్‌, బొమ్మలు సెటింగ్‌ అన్నీ నేనే చేస్తాను. విశాలాంధ్ర వారు సాధారణంగా కథాసంపుటాల్లో బొమ్మలు వేయరు. కానీ వీటిల్లో బాపుగారి బొమ్మలు వేయాలి. ఇదీ ప్లాను.

ఇవన్నీ చూసి రమణగారు ముచ్చటపడ్డారు. ఆమోదించారు. విశాలాంధ్రవారు 'సరే, ఒక్కోటీ వేసుకుంటూ రెస్పాన్సు చూద్దాం' అనుకున్నారు. విశాలాంధ్ర వారికి మొదటి సంపుటం తయారుచేసి యిస్తూంటే మరి ముందు మాటో? అన్నారు. 

ముందుమాట : రమణగారితో అప్పుడెప్పుడో ఓ సారి మీ కథల పుస్తకం వేసి ఆరుద్రగారి చేత ముందు మాట రాయిద్దాం అండి అంటే 'వద్దండీ, పొగుడుతారు' అన్నారాయన. ఎవరైనా ఎక్కువ పొగిడినా, ఎక్కువసేపు పొగిడినా ఆయనకు తలనొప్పి రావడం నేను గమనించాను. అన్యాయంగా విమర్శించినా పైకి ఏమీ అనకపోయినా ఆయనకు నచ్చదు. సద్విమర్శ ఎప్పుడూ ఆహ్వానిస్తారు. కొన్ని విషయాల్లో యివాళ రైటని తోచినవి చేసేసి, ఆనక నాలిక కరుచుకున్న సందర్భాల్లో నికార్సుగా ఒప్పేసుకుంటారు. దానికి ''కోతికొమ్మచ్చి''యే సాక్షి. 

ఇలాటాయన పుస్తకానికి ముందుమాట ఎవరిచేత రాయిస్తాం? ఆయనో నాలుగు మంచిమాటలు చెపితే 'ఈయన వద్దు తీసేయమంటే..?' అందుకని నేనే కలం పట్టాను. రమణగారి కథలు 50 ఏళ్ల క్రితం రాసినవి. కొన్ని గోదావరి యాసలో రాసినవి. వాటిని వివరిస్తూ ఫుట్‌నోట్‌లో రాస్తే 'అకడమిక్‌' వాసన వేస్తాయని రమణగారి భయం. అందువలన నేను ఏయే కథల నేపథ్యం ఏమిటో, కథాకాలం ఏమిటో, వాటిలో ఏయే విశేషాలున్నాయో చెపుతూ సందర్భవశంగా రమణ ఆ కథలు రాసేనాటికి ఎలా వుండేవారో జీవిత విశేషాలు కూడా చొప్పిస్తూ (బొమ్మా బొరుసూ టైములో రాయనివ్వలేదన్న కసి వుందిగా) పొగడ్తలూ అవీ లేకుండా, వట్టి పాఠకుడిలా ఓ పెద్ద వ్యాసంలా రాసి పుస్తకం చివర పెట్టమన్నాను. అది చూశాక రమణగారు కన్విన్స్‌ అయ్యారు. ''మీరు చెప్పినది నిజమే. ఈనాటి తరానికి రాజాజీ ఎవరో తెలియనప్పుడు రాజాజీ గురించి నేను వేసిన జోకులు ఎలా అర్థమవుతాయ్‌? అలాగే మాండలికపు సొగసులు కూడా అందరూ మర్చిపోతున్నారు. ఏబులం, పదలం వంటి తూనికలు మనమే వాడడం మానేశాం.''

అచ్చులో 18 పేజీలు వచ్చేసరికి విశాలాంధ్ర రాజేశ్వరరావుగారు కంగు తిన్నారు. 'పుస్తకం కొనేవాడు మండిపడతాడండి. రమణగారి రచనలకోసం డబ్బు ఖర్చు పెడతాను కానీ, ఆయన రచనలమీద ఎవరో రాసినదానికి  ఖర్చెందుకు పెట్టాలండి? ఇది తగ్గిస్తే పుస్తకం 5 రూ.లు తగ్గేది కదా అంటాడు.'' అన్నారు. నేను బిక్కమొహం వేశాను. ''నేను ఆ కోణంలో ఆలోచించలేదండి. మీరూ, ఏటుకూరి ప్రసాద్‌ గారూ ఎలా ఎడిట్‌ చేసినా నాకు అభ్యంతరం లేదు.'' అని వచ్చేశాను. 

పుస్తకం చేతికి వచ్చేసరికి అంతా అలాగే వుంది, పైగా ముందుమాట అని వేశారు. రాజేశ్వరరావు గారి కేసి  తెల్లబోయి చూశాను - ''మీరు పూలదండలా కట్టారు. ఏ మాట తీద్దామని చూసినా పూలదండ విచ్చిపోయేట్లుంది. ఎడిటింగ్‌కు లొంగలేదు. సరేలే అని అలాగే వుంచేశాం.'' అన్నారు. ''మరి ముందుమాటగా వేశారేం? పుస్తకం చివర్లో వుంటుందనుకున్నాను..'' అన్నాను. 

''అది ముందుమాటే! అందుకే ముందే వుంచాం.'' అన్నారాయన. 

ఇక ఆ తర్వాత ఏ ముందుమాటకు అభ్యంతరం రాలేదు. పోనుపోను ఓ సంపుటికి 30 పేజీలైంది. రమణగారు జోకులేయడం మొదలెట్టారు - బ్లర్బ్‌ మీద 'ఎమ్బీయస్‌ ముందుమాటతో..' అని వేసే రోజులొస్తాయేమో చూసుకోండి... అంటూ. నా ముందుమాటల్లో ఆయన గురించి పొగడ్తలుండేవి కావు. కొన్ని చోట్ల విమర్శించాను కూడా. అందుకే ఆయనకు నచ్చింది. 'మీరు చాలా బాలన్స్‌డ్‌గా రాశారు.'' అనేవారు. 

''నాకు భావాన్ని స్పష్టంగా విశదీకరించే నేర్పు వుంది కానీ, అందమైన భాషలో రాయలేను. అది కూడా వుంటే యింకా బాగుండేది.'' అంటే ''అది లేకపోవడమే మంచిదైంది. అలా రాస్తే పొగడబడిన వ్యక్తిపై వెగటు పుడుతుంది. ఏమిటి వీడి గొప్ప అనే నెగటివ్‌ ఫీలింగ్‌తో చదువుతారు. మీరు వృత్తిరీత్యా జర్నలిస్టు కాదు కానీ జర్నలిస్టు ఎప్రోచ్‌తోనే డీల్‌ చేస్తున్నారు. అదే మేన్‌టేన్‌ చేయండి.'' అన్నారు.(సశేషం) 

(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

Click Here For Part-9

Click Here For Part-10

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?