ఎమ్బీయస్‌ : పాలస్తీనా సమస్య – 02

ప్రపంచ యుద్ధాలు రెండిటికి ప్రధాన రంగస్థలం యూరోప్‌. దానికి మూలం సైన్సు సాధించిన పారిశ్రామిక విప్లవం. నూతన ఆవిష్కరణ ఫలితంగా పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. అక్కణ్నుంచి ఫ్రాన్సు, పోర్చుగీస్‌, స్పెయిన్‌ వంటి పొరుగు…

ప్రపంచ యుద్ధాలు రెండిటికి ప్రధాన రంగస్థలం యూరోప్‌. దానికి మూలం సైన్సు సాధించిన పారిశ్రామిక విప్లవం. నూతన ఆవిష్కరణ ఫలితంగా పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. అక్కణ్నుంచి ఫ్రాన్సు, పోర్చుగీస్‌, స్పెయిన్‌ వంటి పొరుగు దేశాలకు ఆ తర్వాత అమెరికా, జపాన్‌ దేశాలకు విస్తరించింది. తాము  వస్తువులు తయారుచేయాలంటే ముడిసరుకు కావాలి. దాన్ని తమ దేశానికి పట్టుకుని వచ్చి ప్రాసెస్‌ చేశాక తయారు చేసిన సరుకులను మళ్లీ అమ్ముకునేందుకు మార్కెట్‌ కావాలి. అప్పుడే తమ వద్ద సంపద పోగుపడుతుంది. కానీ ముడిసరుకులు అచ్చుకుని, తర్వాత ప్రాసెస్‌డ్‌ గూడ్స్‌ను హెచ్చుధరతో కొనడానికి ఏ దేశమూ ఒప్పుకోదు. అందువలన దాన్ని ఎలాగోలా జయించి వలస రాజ్యంగా మార్చుకోవాలి. దోపిడీ దొంగల్లా కాకుండా పెట్టుబడిదారీ విధానంలో దోచుకోవాలి. అదీ డైరక్టుగా కాకుండా తమ దేశధనికులు పెట్టుబడి పెట్టిన కంపెనీల ద్వారా సాధించాలి. మరీ అవసరమైతే ప్రభుత్వమే రంగంలోకి దిగాలి. ఇంగ్లీష్‌ వాళ్లకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వున్నట్టే, ఫ్రెంచ్‌ వారికీ, డచ్‌ వారికీ అందరికీ యిలాటి కంపెనీలు వున్నాయి. 

ఇండియా, చుట్టుపక్కల దేశాలను ఇంగ్లీషువారు వలసరాజ్యాలుగా చేసుకున్నట్లే, ఆగ్నేయాసియా దేశాల్లో ఫ్రెంచ్‌వారు పాగా వేశారు. ఇండియాలో కూడా ఇంగ్లీషువారితో పోటీ పడి, యుద్ధాలు చేసి ఓడిపోయి తప్పుకున్నారు. ఆఫ్రికాలో కూడా ఇంగ్లండ్‌, ఫ్రాన్సులు వలస రాజ్యాలు స్థాపించారు. వీళ్లు తూర్పువైపు పడితే స్పెయిన్‌, పోర్చుగల్‌ వాళ్లు పశ్చిమంవైపు వెళ్లారు. దక్షిణ అమెరికాలోని దేశాలను వంచించి, వలస పాలన సాగించారు. అక్కడ నుండి వెండి, బంగారాలు కూడా కొల్లగొట్టారు. జపాన్‌ చైనాపై పెత్తనం చెలాయించింది. ఇవి యిలా బలమైన దేశాలుగా తయారయ్యాయి. ఇటలీ, జర్మనీ దేశాలు యీ విషయంలో వెనకబడ్డాయి. ఆ దేశాల్లో అంతర్గతంగా వున్న కుమ్ములాటలు సరిదిద్దుకుని జాతీయ సమైక్యత సాధించడంలో ఆలస్యమైంది. ఇక అప్పుడు అటూ యిటూ చూస్తే వలసకు గురి కాకుండా వున్న ప్రాంతాలు చెదురుమదురుగా కనబడ్డాయి. 
ఎక్కడికక్కడే అనుకుని ఇటలీ ఉత్తరాఫ్రికాలోని ట్రిపోలీని ఆక్రమించింది. జర్మనీ ఆఫ్రికాలోని టాంగన్యీకా, నమీబియా, చైనాలోని షాంటుంగ్‌, కియాచౌలను తన ప్రాబల్యంలోకి తెచ్చుకుంది. అవి చాలలేదనుకుని ఇటలీ, జర్మనీ తమకు మరిన్ని వలస ప్రాంతాలు కావాలని పట్టుబట్టాయి. కానీ అప్పటికే ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాలలో యించుమించు అన్ని ప్రాంతాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్యం సంపాదించిన ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, రష్యా, బెల్జియం, జపాన్‌, అమెరికా వంటి దేశాలు పోవోయ్‌ అన్నాయి. దాంతో జర్మనీని అప్పట్లో పాలిస్తున్న చక్రవర్తి రెండో విలియం యుద్ధానికి సిద్ధమయ్యాడు. అదే మొదటి ప్రపంచయుద్ధానికి (1915-19) దారి తీసింది. బీజం 1914 జులైలో పడింది. అంటే యిది వందేళ్ల క్రితం కథ. అది ఎలా జరిగిందో విపులంగా యింకెప్పుడైనా చెప్పుకోవచ్చు కానీ మన ప్రస్తుత కథకు అవసరమైనంతవరకు, అరబ్‌కు సంబంధించినంత వరకు మాత్రమే యిప్పుడు చెప్తాను. 

1871లో ఫ్రాన్స్‌కు జర్మనీకి యుద్ధం జరిగింది. ఖనిజసంపద, పరిశ్రమలు అపారంగా వున్న ప్రాంతాన్ని ఫ్రాన్సు జర్మనీకి సమర్పించుకోవలసి వచ్చింది. దాని కారణంగా జర్మనీ పారిశ్రామిక రంగంలో బాగా ముందుకు వెళ్లింది. జర్మనీతో ఎలాగైనా పేచీ పెట్టుకుని దానికి వ్యతిరేకంగా మిత్రకూటమి ఏర్పరచుకుని తన ప్రాంతాన్ని తను వెనక్కి తీసుకుందామని ఫ్రాన్సు అనుకుంది. అది అలా అనుకుంటుందని ముందే వూహించిన జర్మనీ ప్రధాని బిస్మార్క్‌ ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రియా, ఇటలీలతో కలిసి త్రిరాజ్య కూటమి ఏర్పరచాడు. వెంటనే దానికి ప్రతిగా ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, రష్యాలు మిత్రమండలి కూటమి ఏర్పరచాయి. రష్యాకు శత్రువైన టర్కీ దేశం (అరబ్బులు వారి పాలనలోనే వున్నారు) జర్మనీ కూటమిలో చేరింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటలీ త్రిరాజ్య కూటమి వదిలేసి మిత్రమండలి కూటమిలో చేరింది. ఇంగ్లండ్‌తో అప్పటికే స్నేహం నెరపుతున్న జపాన్‌ పొరుగున వున్న చైనాలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని మిత్రమండలిలో చేరింది. 

జపాన్‌ తనకు పసిఫిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థి కాబట్టి లెక్కప్రకారం అమెరికా శత్రుకూటమిలో చేరాలి. అది ముందే వూహించిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు అమెరికాను తమవైపు లాక్కోవడానికి దాన్నుంచి అప్పులు చేసేశాయి. అరువు మీద ఆయుధాలు దిగుమతి చేసుకున్నాయి. తమ డబ్బు కాపాడుకోవడానికి అమెరికా వీళ్ల వైపు నిలబడుతూనే యీ కూటమి వలన నాకేమిటి లాభం? అని అడిగింది. యుద్ధానంతరం చైనాలో, పసిఫిక్‌ ప్రాంతంలో నీకు ప్రాబల్యం కలిగేట్లా చూస్తాయని చెప్పాయి ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌. ఈ ప్రకారంగా యుద్ధంలోకి దిగినవి  పేరుకి యారప్‌ దేశాలు, జపాన్‌, అమెరికా మాత్రమే అయినా వాటి వలస రాజ్యాలుగా వున్న ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కూడా యుద్ధజ్వాలలు రగిలాయి. యుద్ధానంతరం జరిగిన ఒప్పందాల్లో జర్మనీని ఘోరంగా అవమానించి వాళ్లు 25 ఏళ్లు తిరక్కుండా మళ్లీ ప్రపంచయుద్ధానికి తలపడేట్లా చేశాయి. నిజం చెప్పాలంటే ఆ యుద్ధం కారణంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, జపాన్‌, పోలెండ్‌, సెర్బియాలకు తప్ప మరే దేశానికీ మేలు కలగలేదు. 

టర్కీ విషయానికి వస్తే యంగ్‌టర్క్‌ల ఆధ్వర్యంలో వున్న ఆ దేశం ఇంగ్లండ్‌పై శత్రుత్వంతో శత్రుకూటమిలో చేరి ఓటమిపాలైంది. యుద్ధకాలంలోనే బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జార్‌ చక్రవర్తుల పాలనలో వున్న రష్యా, ఇటలీలు టర్కీ సామ్రాజ్యభాగాలను పంచుకునేందుకు రహస్యంగా సంధులు చేసుకున్నాయి. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత రష్యాలో విప్లవం వచ్చి కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్లింది. వాళ్లు వీటిలో పాలు పంచుకోము అన్నారు.  ఇక తక్కిన మూడూ టర్కీపై పడ్డాయి. టర్కీలో కొన్ని భాగాలను ఇటలీ ఆక్రమిస్తే బ్రిటన్‌ ఇటలీని కట్టడి చేయడానికి దానికి వ్యతిరేకంగా గ్రీస్‌ను దింపింది. టర్కీ సుల్తాన్‌ బ్రిటన్‌కు కీలుబొమ్మగా మారి గ్రీకుల దాడి అరికట్టలేదు. అప్పుడు కొందరు దేశభక్తులు కెమాల్‌ పాషా నాయకత్వంలో గ్రీకులను తరిమేసి, సుల్తాన్‌ను గద్దె దింపి, 1923లో టర్కీ రిపబ్లిక్‌ నెలకొల్పారు. పాషా రష్యాతో స్నేహం చేస్తానన్నాడు. దానితో కంగారు పడిన మిత్రరాజ్యాలు టర్కీతో సంధి చేసుకున్నాయి. వాటి ప్రకారం టర్కీకి కొన్ని ప్రాంతాలు మళ్లీ దక్కాయి కానీ అరబ్‌ దేశాలను వదులుకోవలసి వచ్చింది. 
అరబ్‌ దేశాలు టర్కీ పాలన నుండి బయటకు రావడానికి యింత కథ జరిగింది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1