లీగ్ దశలో దుమ్ము రేపిన శ్రీలంక, క్వార్టర్ ఫైనల్‌లో చేతులెత్తేసింది. అలా ఇలా కాదు. 150 పరుగులకు కూడా చేయలేక చతికిలపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. దాంతో శ్రీలంక కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లీగ్ దశలో నాలుగు వరుస సెంచరీలతో దూకుడు ప్రదర్శించిన సంగక్కర కాస్సేపు ప్రతిఘటించినా ఉపయోగం లేకుండా పోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, సింగిల్ డిజిట్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. అక్కడినుంచి ఏ దశలోనూ శ్రీలంక కోలుకోలేదు. సంగక్కర 45 పరుగులు, తిరమన్నె 41 పరుగులు, మాథ్యూస్ 19 పరుగులు మినహా ఇంకెవ్వరూ సింగిల్ డిజిట్ దాటలేదు. అందునా పై ముగ్గురు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు దాటి స్కోర్ చేయలేదంటే లంక బ్యాటింగ్ ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ మొత్తమ్మీద తొమ్మిది ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు. తొమ్మిది ఫోర్లలో ఒకటి మాథ్యూస్, మూడు సంగక్కర, ఐదు తిరమన్నె కొట్టినవి.
సౌతాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4 వికెట్లు, డుమిని 3 వికెట్లు తీయగా, స్టెయిన్, అబోట్, మోర్కెల్ చెరో వికెట్ సాధించారు. లంక ఇన్నింగ్స్‌లో 15 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం.