రాబిన్ హుడ్లు.. మనుషుల్లో మాణిక్యాలు..మనసున్న మనుషులు… మహానుభావులు…హీరోలు తెరపై కనిపించే పాత్రల స్వభావాలు ఇవి. ఏ భాష ఇండస్ట్రీలో అయినా.. హీరోలు సాధారణంగా ఇలాంటి పాత్రల్లోనే కనిపిస్తారు. సినిమాలో హీరో అంటేనే… మంచి వాడని వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఎటొచ్చీ ఆ హీరోలు స్టార్లు అయితే.. తెరపై ఆ పాత్రలో మంచితనం మరింత పెరుగుతుంది! పాత్రోచిత్యం ప్రకారం.. వీరు ఎక్కడికో ఎదిగిపోతారు. మరి తెరపై ఆకాశమెత్తున కనిపించే వీళ్లు.. తెర బయటకు వస్తేనే… మరీ విలన్లయిపోతున్నారు. వీళ్ల వ్యక్తిగత వ్యవహారాల సంగతి, వైవాహిక జీవితాల సంగతి మాట్లాడుకోవాల్సిన అవసరం లేవు. కనీసం పౌరులుగా.. ప్రాథమిక విధులను, ఆదేశిక సూత్రాలను పాటించడంలో కూడా వీళ్లు దారుణంగా విఫలం అవుతున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బు మాయలో కొట్టుకుపోతూ.. కనీసం ఇన్కమ్ టాక్సు చెల్లింపులో కూడా వీరు దొంగదారుల్లో నడుస్తున్నారని స్పష్టం అవుతోంది. వీళ్ల దగ్గర అక్రమ సంపాదన బయటపడుతోంది. నల్లధనం వీరి గుప్పిట్లో చిక్కుతోంది. ఇన్కమ్ టాక్సుల రైడ్లతో వీళ్ల అసలు స్వరూపం బయటపడుతోంది.
మరి తెరపై నీతులతో చించేస్తూ… విలన్లను దారిన పెడుతూ.. అందరినీ ఉద్ధరిస్తూ.. పేదవాళ్ల ప్రతినిధులుగా, నల్లధనాన్ని దాచుకునే విలన్ల పాలిట కలవరపాటుగా నటించే వీళ్లు నిజ జీవితంలో మాత్రం ఆ ఆదర్శాలను పాటించలేక పోతున్నారని స్పష్టం అవుతోంది. ఏదో అనామక హీరోలు.. ఇన్కమ్ టాక్స్ రైడ్స్‌లో బుక్ అయితే అదో లెక్క. అయితే ఏకంగా.. లెజెండరీ, స్టార్ స్టేటస్ ఉన్న వారు ఐటీ రైడ్స్‌లో బుక్ అవుతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. సౌతిండియన్ హీరోల్లో ఇలా ఇరుక్కుపోయిన వారిలో ప్రముఖులున్నారు. ఇటీవల హీరో విజయ్, సమంత, నయనతార వంటి తారాగణం ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఇలా వివాదాస్పద రీతిలో బుక్కైన కొంతమంది హీరోల చరిత్రను పరిశీలింవచ్చు.
ఈ జాబితాలో మోహన్ లాల్‌ను ముందుగా ప్రస్తావించుకోవాలి. ఈ హీరో సినిమాల్లో ఎంత సామాజిక సందేశం ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. జర్నలిస్ట్, పోలీసు, రాజకీయ నేత.. ఇలా ఎలాంటి పాత్రల్లో చేసినా మోహన్ లాల్ అంతిమంగా పీడిత ప్రజానీకానికి మద్దతుగా నిలుస్తాడు. ధనవంతుల పాలిట, అవినీతి పరుల పాలిట సింహస్వప్నం అవుతాడు. అయితే ఆ ముచ్చటంతా సినిమాలో నటన వరేక. కొంతకాలం కిందట లాలట్టన్ ఇంటిపై ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ సంపాదనను గుర్తించినట్టుగా వార్తలు వచ్చాయి. పన్నులు ఎగ్గొడుతూ ఆయన ఈ డబ్బును దాచి ఉంచాడనే అభియోగాలు నమోదయ్యాయి. తన సంపాదన వివరాలను లాల్ సరిగా చూపలేదనే విషయం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంఅయ్యింది. విశేషమూ.. విడ్డూరమూ.. ఏంటంటే.. అంతకన్నా ముందే లాలట్టన్ సైన్యంలో కూడా చేరాడు. సెలబ్రిటీ హోదాలో సైన్యంలో చేరి.. ఉత్తమమైన క్యాడర్లో మిలటరీలో పోస్టు పొందాడు. ఆ విధంగా దేశ సేవలో తను తరిస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని రోజులేక లాల్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం.. అక్రమాలు బయటపడటం జరిగింది. మరి మిలటరీలో చేరాను అంటూ షో చేసిన లాల్.. తన సంపాదనపై పన్నులు సరిగా కట్టి పౌరుడిగా తన బాధ్యతను మరిచినట్టుగా ఉన్నాడు.
ఇక చెప్పుకొంటే… చిరంజీవి వియ్యంకుల ఇళ్లలో బయటపడిన అక్రమ డబ్బును కూడా ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. చెన్నైలో ఉండేే.. చిరంజీవి పెద్ద కూతురు మామగారి ఇంట్లో భారీ స్థాయిలో డబ్బు బయటపడింది. కాంగ్రెస్ గవర్నమెంటు హయాంలో.. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉండగా ఆ సొమ్ము వెలుగు చూసింది. తొలి రోజులు అయితే.. అది పెద్ద సంచలనమే అయ్యింది. అయితే ఆ తర్వాత ఆ వ్యవహారం డైల్యూట్ అయ్యింది. ఆ కోట్ల రూపాయలకు లెక్కలు లేవని మీడియా కోడై కూసింది. ప్రభుత్వాధికారులు దాడుల్లోనే ఆ డబ్బు కూడా బయల్పడింది. కానీ.. దానిపై సామాన్యుల్లో నెలకొన్న ప్రశ్నలకు ఇంత వరకూ సమాధానం లేదు. చిరంజీవి కాంగ్రెస్ వ్యేక్త కాబట్టి.. ఆ డబ్బుకు సంబంధించిన గుట్టు దాచేయబడిందనే ఆరోపణలున్నాయి. సాధారణంగా ఐటీ దాడులు జరిగితే సదరు సెలబ్రిటీ ఇంటిమీదే కాకుండా.. బంధువుల, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా చూస్తే…ఆ సొమ్ముపై చిరంజీవి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. కానీ.. అది జరగలేదు!
ఇక విజయ్… ప్రస్తుతం తమిళంలో టాప్ రేంజ్ హీరోల్లో.. నంబర్ వన్‌గా వెలుగొందుతున్న యూత్ ఐకాన్. అంతేకాదు.. విజయ్ పొలిటికల్‌గా కూడా యాక్టివే. ఇతడి తరపున తండ్రి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్, ఆయన తండ్రి అన్నాడీఎంకే మద్దతుదారులుగా నిలిచారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో విజయ్ తండ్రి పాల్గొని.. అభిమానులంతా అమ్మకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మరి ఈ పోకడ చూస్తే.. విజయ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. మరి సినిమాల్లో నీతులు చెప్పడమే కాకుండా… విజయ్ భవిష్యత్తులో రాజకీయ వేదికలపై కూడా ఉపన్యాసాలు దంచే అవకాశం ఉంది. మరి ఇన్ని లెక్కలున్న ఈయన.. ఐటీకి మాత్రం సరైన లెక్కలు చెప్పలేదు. ఐదేళ్లు విజయ్ ఐటీ రిటర్న్స్ సరిగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇదీ ఈ కళాకారుల తీరు. సినిమాల్లో నీతులు చెప్పడంలో సత్తా చాటే వీళ్లు.. నిజ జీవితంలో మాత్రం దొంగదారుల్లో బండి లాగిస్తున్నారు. దొంగలనిపించుకుంటున్నారు.
ఆ మధ్య శంకర్ దర్శకత్వంలో ‘‘శివాజీ- దబాస్’’ సినిమా వచ్చింది కదా.. ఆ సినిమా నిండా బ్లాక్ మనీ గురించి, అక్రమ సంపాదన గురించి చర్చే. రాజకీయ నేతల వద్ద.. దాగి ఉన్న నల్లధనాన్ని చాలా తెలివిగా బయటకు తీస్తూ ఉంటాడు బాస్. ఆ సినిమా ఒక సోషల్ కాజ్ విషయంలో సందేశాత్మకమైన సినిమా నిలిచింది. అయితే మ్యాటరేంటంటే.. ఆ సినిమాకు సంబంధించి హీరో, దర్శకుల రెమ్యూనరేషన్ గురించి, ఆ సినిమా వసూళ్ల గురించి పారదర్శకమైన వివరాలను వెల్లడించలేదు! సినిమా అంతా నీతులు చెప్పాం.. తాము ఎందుకు నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలనుకున్నారో ఏమో కానీ… ఆ విషయాలపై రజనీకాంత్ కానీ, శంకర్ కానీ, ఏవీఎం ప్రొడక్షన్స్ వాళ్లు కానీ… స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు.
మరి అందరూ ఇలాగేనా అంటే… ఔను అనడానికి లేదు. ఐటీ దాడుల తర్వాత మాణిక్యాల్లా బయటపడ్డ వాళ్లూ ఉన్నారు. హీరో విక్రమ్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగాయి. ఆయన పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జరిగిన దాడుల్లో అక్రమ సంపాదనలేమీ బయటపడలేదు. అలా ఐటీ సోదాలు జరగడం తనకు గర్వకారణం అని చెప్పుకున్నాడు విక్రమ్. ఏ రోజుకైనా తన ఇంటిలో ఐటీ సోదాలు జరిగేంత స్థాయికి ఎదగలేదని తను కలలు గనేవాడినని విక్రమ్ అప్పుడుచెప్పుకున్నాడు. ఆ సోదాల్లో కూడా ముత్యంలా బయటపడి.. ప్రశంసలు అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు సుమా!