విజయం ఎప్పుడూ గొప్పింటి బిడ్డే..ప్రతి ఒక్కరు చంకనెత్తుకుంటారు. అపజయం ఎప్పుడూ అనాధే. ఏడుస్తుంటే చోద్యం చూస్తారు. రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా వైనం ఇప్పుడు అలాగే వుంది. శ్రీనువైట్లుకు కోనవెంకట్ అండ్ కో తో బలవంతపు పెళ్లిచేసి, సెట్ మీదకు తీసుకువచ్చాడు రామ్ చరణ్. వీరు వారు కలిస్తే సినిమాను చితక్కొట్టేస్తారని అనుకున్నాడు. కానీ ఉమ్మడి గొర్రె బక్కచిక్కి చచ్చిందన్నట్లు అయింది వ్యవహారం.
అసలు తన కథ ఇది కాదన, సెకండాఫ్ మొత్తం కోన వెంకట్ అండ్ కో కెలికికెలికి వదిలేసారని సన్నిహితులతో అంటున్నాడట శ్రీనువైట్ల. టైటిల్ కూడా తనకు ఇష్టంలేనిదే అని, మెరుపు అని పెట్టాలనుకున్నానని అంటున్నాడట.
తాము చెప్పిన సూచనలన్నీ గాలికి వదిలేసాడు శ్రీను వైట్ల అని అంటున్నారట కోన బృందం. తమకు సినిమా రష్ చూపించలేదని, ఆయన చిత్తం వచ్చినట్లు చేసుకున్నారని వారు అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా కథ ఇది కాదని, హీరో అక్క కలెక్టర్ కావడం చుట్టూనే కథ అంతా తిరుగుతుందని, ఆ దారిలోవచ్చే అడ్డంకులను హీరో ఎలా తొలగించుకుంటూ వస్తాడు అన్నదే కీలకం అని శ్రీనువైట్ల చెబుతున్నాడని వినికిడి. క్లయిమాక్స్ లో ఆమె ఇంటర్వూకి వెళ్లకుండా అడ్డంకులు రావడం, అక్కడ హీరో ప్రాణాలకు తెగించి కాపాడడంతో, తండ్రికి అసలు విషయం రివీల్ అవుతుందని, ఈ మధ్యలో హీరో లవ్ ట్రాక్ పారలల్ గా రన్ అవుతుందని చెబుతున్నాడట.
అయితే కోనవెంకట్ బృందం హాలీవుడ్ సినిమా నుంచి సంపత్ రాజ్ ఇద్దరు పెళ్లాల ట్రాక్ ను ఎత్తుకొచ్చి జోడించి, అసలు ట్రాక్ ను పక్కదారిలోకి మళ్లించారని శ్రీను వైట్ల ను అభిమానించేవారు అంటున్నారు.
మొత్తం మీద బ్రూస్ లీ సినిమా తరువాత మళ్లీ కోన వెంకట్ అండ్ కో, శ్రీనువైట్ల కలిసి పనిచేస్తారా? అంటే అనుమానంగానే వుంది.