లతా మంగేష్కర్ 1971లో ఆవిడ తండ్రి వర్ధంతిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినప్పుడు ఘంటసాల కచేరీ చేసారు. ఆ సందర్భంగా లతా ఘంటసాలను సత్కరించి తను పాడిన భగవద్గీత రికార్డులు బహుమతిగా యిచ్చారు. 1970లో రెండు రికార్డుల సెట్టుగా విడుదలైన దానిలో 9 వ అధ్యాయంలో నుంచి 34 శ్లోకాలు, 12 వ అధ్యాయం నుంచి 20 శ్లోకాలు పాడారు. 4-5 శ్లోకాలు వరుసగా పాడిన తరువాత మగకంఠంలో ఇంగ్లీషు కామెంటరీ వుంది. మొత్తం 80 ని||లు. సంగీతం హృదయనాథ్ మంగేష్కర్. ఆ రికార్డులు విన్న తరువాత అందరికీ అర్థమయ్యేలా సులభశైలిలో శ్లోకం కాగానే తెలుగు తాత్పర్యం చెపితే ఎలా వుంటుందన్న ఆలోచన ఘంటసాలకి వచ్చింది.
లతా మంగేష్కర్ హిందీలో భగవద్గీత పాడిన తరువాత ఎచ్.ఎం.వి. సంస్థ వారు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిచేత అదే తరహాలో పాడించి దక్షిణాదిన రిలీజ్ చేద్దామనుకున్నారు. హెచ్.ఎం.వి. సౌత్ మేనేజర్ మంగపతి గారు భగవద్గీత కృష్ణుడు చెప్పినది కాబట్టి మగవాళ్లు పాడితే బాగుంటుందని, దానికి ఘంటసాల గారే తగిన వారని మార్కెటింగ్ వారిని ఒప్పించి, ఘంటసాల వద్దకు వచ్చారు. '108 శ్లోకాలు సంస్కృతంలో మీరు పాడతారు, తెలుగులో వాటి తాత్పర్యం, మధ్యలో సంభాషణలు, వాటిలో నాటకీయత వుంటుంది కాబట్టి నటుల చేత చెప్పిస్తే బాగుంటుంది. నాగయ్యగారు చెప్తారు. మద్రాసు రామకృష్ణ స్కూలులో తెలుగు టీచరుగా పనిచేసి రిటైరైన కోట సత్యరంగయ్య శాస్త్రిగారి చేత తెలుగు వ్యాఖ్యానం రాయిస్తాను' అన్నారు మంగపతిగారు. కొన్ని రోజులకి నాగయ్యగారి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి జగ్గయ్యగారి చేత చెప్పించాలనుకున్నారు. ఘంటసాల 'నాకు నాటకాలలో నటించిన అనుభవం వుంది కాబట్టి శ్లోకాలతో బాటు తాత్పర్యం కూడా నేనే చెప్తాను, కంటిన్యుటీ వుంటుంది' అన్నారు. మంగపతి ఒప్పుకున్నారు.
ఈ భగవద్గీత కూడా రెండు రికార్డులుగా ప్లాన్ చేశారు. మొదటి దాంట్లో మొదటి తొమ్మిది అధ్యాయాలలో వున్న 372 శ్లోకాలలో 56 ఎంచుకున్నారు. రెండవ దాంట్లో 10 నుంచి 18 వ అధ్యాయం వరకు వున్న 328 శ్లోకాలలో 50 శ్లోకాలు ఎంచుకున్నారు. అన్నిటికన్న ముందు ధ్యానశ్లోకం 'పార్థాయ ప్రతిబోధితాం', చివరిలో ''గీతాశాస్త్రం మిదం పుణ్యం'' అనే భగవద్గీతా మహాత్మ్యం శ్లోకం పెడదామనుకున్నారు. మొత్తం 108. కోట సత్యరంగయ్య శాస్త్రి గారి తాత్పర్యం కొన్నిచోట్ల గ్రాంథికంగా వుండి సాధారణ శ్రోతలకు అర్థం చేసుకోవడం కష్టమని తోచింది. అప్పుడు ఘంటసాల, ఆయన శ్రీమతి సావిత్రిగారు నాలుగు రకాల భగవద్గీత వ్యాఖ్యానాలు తీసుకొని ఏ వచనం బాగున్నదో చూసుకుని, విడిగా రాసుకున్నారు. శ్లోకాలు ఏ రాగంలో పాడాలో పక్కన రాసుకున్నారు. దీనికంతా ఆరు నెలలు పట్టింది. అప్పట్లో ఘంటసాల ఆరోగ్యం బాగులేదు. డాక్టర్లు మేడ మీద నుంచి క్రిందకి రాకూడదు, మెట్లు దిగకూడదన్నారు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా వుంది, పాడటానికి వీల్లేదు అన్నారు. అందువలన తప్పులు రాకుండా సంస్కృత శ్లోకాలు బట్టీపట్టి భార్యకు అప్పచెపుతూ, ఉచ్చారణ సరి చూసుకోవడంలో ఆ సమయం గడిపారు.
ఆరునెలల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. ఒంట్లో బాగైన తరువాత మొదటి పాట 'జీవనతరంగాలు' సినిమాలో 'ఈ అందానికి బంధం వేశా నీనాడు' పాడారు. అది అయిన తరువాత 'దొరబాబు' సినిమాలో కొన్ని పాటలు పాడారు. వాటి సాహిత్యం ఆయనకి నచ్చలేదు. ''సాహిత్యం మారిపోయింది. ఈ పిచ్చిపాటలు పాడకూడదు. కొత్త కుర్రవాళ్లు వస్తున్నారు. ఇక సినిమా పాటలు నాకొద్దు. భగవద్గీత, రామదాసు కీర్తనలు, అష్టపదులు – యివన్నీ రికార్డు చేస్తూ కాలక్షేపం చేస్తాను.'' అన్నారు. భగవద్గీత రికార్డు చేసేటప్పుడు కాషాయ వస్త్రాలు కట్టుకోవాలనుకున్నారు. భార్య యింట్లో వున్న పంచల జత తీసుకుని వెళ్లి కాషాయ రంగు వేయిస్తే అవి కట్టుకుని రికార్డింగుకి వెళ్లారు. మొదటి భాగంలో సమరభేరిలో కొన్ని వాయిద్యాలు అదనంగా వున్నాయి కానీ చాలా భాగంలో కీ బోర్డు, సితార, ఫ్లూట్, రిథమ్స్, తంబూరా తప్ప యితర వాయిద్యాలు లేవు. మొదటి భాగం రికార్డయిన తరువాత కొన్ని సినిమా పాటలు పాడారు. అప్పుడు మళ్లీ వైరాగ్యం – ''50 ఏళ్లు దాటాయి. భగవద్గీత పాడుకుంటూ కచ్చేరీలు చేసుకుంటే గడిచిపోతుంది'' అంటూ.
రెండో భాగం కంపోజింగ్ మొదలు పెట్టారు. దీనిలో శ్లోకాలకు కష్టమైన రాగాలు ఎన్నుకున్నారు. విశ్వరూప దర్శనానికి సరైనవి కుదరలేదు. మళ్లీ అనారోగ్యం ప్రారంభమైంది. ఆసుపత్రి పాలయ్యారు. 'పూర్తి చేయగలనో లేదో, మొదటిభాగమైనా రిలీజు చేయండి, ప్రజలలో స్పందన ఎలా వుంటుందో తెలుస్తుంది' అంటే గ్రామఫోన్ కంపెనీవాళ్లు ఒప్పుకోలేదు. రెండూ ఒకేసారి చేద్దాం అన్నారు. హాస్పటల్‌లో బెడ్ మీద పడుక్కుని నిరంతరం విశ్వరూపదర్శనం శ్లోకాల బాణీలు గురించి ఆలోచించేవారు. ఒక రాత్రి 2 గంటలకు మెలకువ వచ్చి కూర్చున్నారు. ఎలాటి బాణీలు, ఆర్కెస్ట్రా వుండాలో స్పష్టత వచ్చింది. నొటేషన్స్ రాసుకున్నారు. చివరిలో భగవద్గీతతో సంబంధం లేకుండా ఉపసంహారం ఎలా చేయాలా అని ఆలోచించి 'అసతోమా సద్గమయ' అనే శ్లోకంతో ముగిద్దామనుకున్నారు. శ్లోకాల కంపోజింగ్ పూర్తయేసరికి 1973 డిసెంబరు అయింది. మొదటిభాగం పూర్తయిన ఆర్నెల్లకి రెండో భాగం రికార్డింగ్ ప్రారంభమైంది. 25 శ్లోకాలు, వాటికి తెలుగులో వచనాలు ఒకే టేక్‌లో పాడారు. తర్వాత తక్కిన 25 శ్లోకాలు, వచనం. చివరిలో వచ్చే ''అసతోమా సద్గమయ'' ను ఘంటసాల తన పిల్లలని, సంగీతరావుగారి పిల్లలని తీసుకువెళ్లి వారి చేత పాడించి రికార్డు చేయించారు. రికార్డింగు పూర్తయ్యాక టేపును గ్రామఫోన్లుగా అచ్చొత్తించడానికి కలకత్తా ఆఫీసుకు పంపబోతూ ఒకసారి విని ఫైనలైజ్ చేయండి అని ఘంటసాలను పిలిచారు. ఆయన తన భార్యను కూడా తీసుకుని వెళ్లారు. 18 వ అధ్యాయం 30 వ శ్లోకం వచనంలో 'సత్వగుణ సముద్భవమని ఎరుంగుము' అనడానికి బదులు 'సత్వగుణ సంభవమని ఎరుంగుము' అన్నారు ఘంటసాల. సావిత్రిగారు ఆ తప్పును ఎత్తిచూపితే వెంటనే సరిచేశారు.
రికార్డులు ఎంత త్వరగా వస్తాయా, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని ఆదుర్దాగా వుంటూండగానే ఘంటసాలకు దేవుడి దగ్గర నుండి పిలుపు వచ్చింది. 1974 జనవరిలో ''యశోదాకృష్ణ'' సినిమాకై రాజేశ్వరావుగారి సంగీతదర్శకత్వంలో ''చక్కనివాడె..'' పాట, వేణుగారి సంగీతదర్శకత్వంలో ''భద్రాచల రామదాసు'' సినిమాకు పాటలు పాడారు. ఒప్పందం ప్రకారం పూర్తి చేయాల్సిన పాటలు పూర్తి చేస్తున్నారు. ఇంతలో ఎవరో అనామకుడు యిచ్చిన నాటుమందు సేవించడం వలన ఆరోగ్యం క్షీణించి 1974 ఫిబ్రవరి 11 న విజయా ఆసుపత్రిలో స్వర్గస్తులయ్యారు. ఆయన పోయిన తర్వాత రెండు నెలలకు ఏప్రిల్ 21 న విజయవాడలో ఎచ్.ఎం.వి. వారు యన్.టి.రామారావు చేతుల మీదుగా రికార్డు విడుదల చేసారు. తొలి రికార్డును విశ్వనాథ సత్యనారాయణ గారికి అందచేసిన ఎన్టీయార్ 'అంత్యకాలంలో ఘంటసాల ఈ భగవద్గీతను ఆలపించి దానిని చిరస్థాయిగా జాతికి అంకితం చేసార'ని అన్నారు. ఆ మాట అక్షరాలా వాస్తవం. ఇదివరలో భగవద్గీత అంటే కొంతమందికే పరిమితం. ఘంటసాల ధర్మమాని తెలుగునాట గుడిసెలలో కూడా భగవద్గీత వినబడుతోంది. నిరక్షరాస్యుడికి కూడా ఆ శ్లోకాలు పరిచితం. దేశంలోని తక్కిన ప్రాంతాలకు యీ సౌలభ్యం లేదు. ''ఘంటసాల భగవద్గీత గాన నేపథ్యం'' పేర పుస్తకంలో శ్రీమతి ఘంటసాల సావిత్రి యీ విశేషాలను పాఠకులతో పంచుకున్నారు. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)