ఇటీవల టాలీవుడ్ లో కొంతమంది రైటర్లు తమ క్రేజ్ ను కోట్లుగా మార్చేసుకుంటున్నారు. కలెక్ట్ రెస్పాన్స్ బిలిటీతో సినిమా హిట్ కొట్టినా, లేదా హాలీవుడ్ నుంచి, అంతకు ముందు వచ్చిన సినిమాల నుంచి తలా పాయింట్ ఎత్తుకొచ్చి, సినిమా హిట్ అయింది అనిపించుకున్నా, కాలర్ ఎగరేస్తున్నారు. కోట్లు తీసుకుంటున్నారు. కానీ అలా తీసుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢమేల్ అంటున్నాయి. జెంటిల్ మన్ లో పాయింట్ తీసుకొచ్చి, కొత్త కథ అల్లి కిక్ అంటూ హిట్ కొట్టిన వక్కతం వంశీ కిక్ 2 సినిమాకు కోటికిపైనే తీసుకున్నాడని వినికిడి. దానికి ఎలాంటి కథ ఇచ్చాడో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు బ్రూస్ లీ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ చెరో కోటి రూపాయిలు డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని వినికిడి. కానీ వారు శ్రీను వైట్ల కథకు చేసిన మార్పులు, ఇచ్చిన స్క్రిప్ట్ ఎలా వుందో, ఇప్పుడు సినిమా చూసిన అందరికీ తెలిసిపోయింది. రెండు కోట్లు తీసుకున్నారా అని టాలీవుడ్ లో జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తీరా చేసి సెకండాఫ్ లో సంపత్ రాజ్ ట్రాక్ అంతా ఓ హాలీవుడ్ సినిమా నుంచో, పరభాషా సినిమా నుంచో ఎత్తుకొచ్చారట. ది వాలెట్ అనో మరోటనో పేరు వినిపిస్తోంది. సంపత్ రాజ్ ట్రాక్ అంతా ఆ సినిమాలోనిదేనట. నిజానికి ఆ సినిమా ట్రాక్ తీసుకుని, ఓ సినిమాగా మారిస్తే ఎలా వుంటుందని ఇంతకు ముందే ఓ హీరో, ఓ డైరక్టర్ ను అడిగారట. ఇప్పుడు అదే ట్రాక్ ఈ సినిమాలో కనిపించే సరికి ఆశ్చర్యపోవడం ఆ డైరక్టర్ వంతయింది.
ఇలా ఎత్తుకొచ్చిన పాయింట్లకు కోట్లకు కోట్లు ఇస్తారు మన సినిమా జనం. అదే నిజమైన టాలెంట్ ఎక్కడ వుందో వెదకి పట్టుకోవడానికి మాత్రం బద్దకం. లయిజినింగ్, హడావుడి వున్నవారికే అవకాశాలు.
ఇదిలా వుంటే బ్రూస్ లీ సినిమాకు సినిమాటోగ్రఫీకి కూడా చాలా దారుణంగా ఖర్చయిందని వినికిడి. ఎనబై లక్షల వరకు డైలీ బేటా (బత్తా)లకే ఖర్చు చేసారని వినికిడి. అన్నీ కలిపి రెండు కోట్ల రూపాయిలు కేవలం సినిమాటోగ్రఫీకి ఖర్చు చేసారట. దీనికి తోడు సినిమాలో స్టార్ కాస్టింగ్ భయంకరంగా వుంది. ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువే. విదేశీ లోకేషన్లు, సముద్రంలో ఛేజింగ్ లు, పాటల కోసం భారీ సెట్లు ఒకటేమిటి? పాపం నిర్మాత చేత ఇదీ అదీ లేదు అనకుండా ఖర్చు చేయించారు..ఆయన చేసారు..పాపం.