'గోతిలో పడ్డవాణ్ణి బయటకు తీయవచ్చు, మనచేతికి మట్టయినా పర్వాలేదనుకుంటే; నూతిలో పడ్డవాణ్ణి తీయవచ్చు – భారం తడిసి మోపెడైనా ఫర్వాలేదనుకుంటే; కానీ ప్రేమలో పడ్డవాణ్ణి మాత్రం బయటకు పడేయలేం.'
ఇటువంటి అమోఘమైన కొటేషన్లు, అదేమిటోగానీ నాకు భలేగా తట్టేస్తుంటాయి ఏ శ్రమా లేకుండానే. మజ్జిగ చిలుకుతూంటే వెన్న తేలినట్లు, నాలోని విజ్ఞాన సాగరాన్ని నిరంతరం మథించేస్తుండం వల్ల ఇలాంటి పసిడి పలుకులు అప్పుడప్పుడు తేలుతుంటాయన్నమాట. అయితే ఇవి ఓ కాగితమ్ముక్క మీద అలాగే రాసి పంపితే ఎవరూ ఖాతరు చేయరు. అదే దాని క్రింద 'థామస్ ఎమల్షన్' అనో 'టింబక్తూ జాతీయ సామెత' అనో రాసి పంపితే సంపాదకీయానికి ఆ పక్కగా చుట్టూ ముగ్గు వేసి మరీ వేస్తారు. పేరు తరవాత కలపవచ్చు. ఆలోచన రాగానే నోట్ చేయడం ముఖ్యం!
అయితే ఈ వెన్న తేలే కార్యక్రమం తరచుగా ఎవరైనా వాళ్ళ కష్టాలు చెప్పుకొనేటప్పుడు జరుగుతుంటుంది. అది కొన్ని అపార్థాలకు దారి తీస్తుంది కూడా. ఖగపతి ఆ వేళ వాడి సొద చెప్పుకుంటూంటే నేను కాగితం గురించి వెతకబోయినప్పుడు 'ఆ అమ్మాయి స్కూలు పేరు నోట్ చేసుకోవడం ఎందుకురా? నీ చాదస్తంగానీ. అయినా నా మీద నీకింత శ్రద్ధ ఉందని అనుకోలేదు సుమా' అనబోయేడు.
''ఉండరా, మంచి కొటేషన్ తట్టింది. నోట్ చేసుకోకపోతే వెన్న కరిగిపోతుంది. ఆ పెన్నిలా అందుకో'' అన్నా.
''వెన్నేమిటి? ఒరే, ఆ అమ్మాయి అక్కడ టీచర్రా; పాలమ్మదు..'' అని వాడి గోల.
''అబ్బ, నువ్వు చెప్పినవన్నీ గుర్తున్నాయి లేరా. ఆ అమ్మాయి పేరు బి.ఎచ్.ఎస్. స్కూలు. అదున్నది మైలాపూర్లో. బైదివే నువ్వా స్కూలు పేరు నాకు చెప్పిన ఇరవై రెండుసార్లు బి.హెచ్. అన్నావు అచ్చమైన తెలుగు వాడిలా. హెచ్ కాదు, ఎచ్…ఎ..చ్. 'హెచ్'లో 'హ' సైలెంటన్నమాట''.
''ఒరేయ్, అచలపతి కష్టపడి గరాటా పెట్టి నీ తలలో పోసిన నాలెడ్జంతా నువ్విలా మా ముందు ఒలకబోసేస్తే బుర్ర ఎప్పటిలాగా ఖాళీ అయిపోతుంది. నేను సలహా కోసం అచలపతి దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది''.
''ఒరేయొరోయ్… అదేమిట్రా బొత్తిగానూ… నేను సలహా చెప్తానంటున్నాను కదా. ఈ కథలు చదివిన వాళ్లెవరూ సలహా కోసం నా దగ్గరకు రావటం లేదు. పాత స్నేహితుడివి నువ్వేనా నా సలహా వినకపోతే ఎలాగరా!? ఉండు.. నీకు నాలో విశ్వాసం పునరుద్ధ్ధరించడానికి నీకూ, పద్మజకూ ప్రేమ ఎలా కుదిరిందో, మీ ప్రథమ సమాగమనం ఎలా జరిగిందో నువ్వు చెప్పకపోయినా తార్కికంగా ఆలోచించి చెబుతా చూడు..''
''ఒరేయ్ అర్థం కాని తెలుగు పదాలు చాలా వాడుతున్నావు. అచలపతి నీకన్నీ నేర్పేసేడేంట్రా?'' ఆశగా అడిగాడు వాడు.
నాకు కోపం వచ్చింది. కళ్లు మూసుకుని సీరియస్ ఆలోచించేస్తున్నాను.
''ఒరేయ్, నిద్ర పోతున్నావేంట్రా? పొద్దున పది గంటల్లోపుల నిన్ను లేపడం తప్పై పోయింది. గుర్రు కూడా పెడతావు కాబోలు. ప్రధానమంత్రి కావడానికి రిహార్సలా?''
నాకు ఉక్రోషం వచ్చింది. పాడులోకం. మనుషుల మీద ఓ ముద్ర కొట్టేసి వదిలేస్తుంది. అచలపతి బద్ధకంతో ఆవులించినా కండరాలకు ఎక్సర్‌సైజు ఇస్తున్నాడంటుంది. నన్ను చూస్తే ఇలా…
కళ్లు తెరిచే ఉరమాల్సి వచ్చింది. ''డిటెక్ట్టివ్ నర్సన్ కళ్లు తెరుచుకొని ఆలోచించగా ఎప్పుడైనా చూసావా?''
డిటెక్టివ్ నవలల వలలో పడి పెరిగినవాడు కనక నా లాజిక్ వెంటనే అర్థం చేసుకుని శాంతించాడు. నేను మళ్లీ కళ్లు మూసుకుని సీను వివరించాను –
''ఓ రోజు స్కూటరు చెడిపోయింది. బస్సు ఎక్కేవు. నీ సీటుకి పక్కగా నుంచున్న అందమైన యువతి. చేతిలో బండెడు కాంపోజిషన్ పుస్తకాలు. నువ్వు జాలిపడ్డావు. 'పాపం నలభై గాడిదల బరువు మోస్తున్నారు. నా సీటులో కూర్చుంటారా?' అంటూ లేచి సీటు ఆఫర్ చేశావు. ఆమె తల వాల్చుకుంది. సిగ్గుతో ఆమె కనురెప్పలు టపటప కొట్టుకున్నాయి. గాలికి రెపరెపలాడిన పైట వంత పలికింది..''
''వర్ణన లెందుకురా; అసలు…''
'ఆగాగు.. స్క్రిప్టు దారి తప్పింది… బొత్తిగా అసహజంగా ఉంది. నీకు బస్సులో సీటు దొరకడం ఇంపాజిబుల్. నువ్వసలే బభ్రాజమానానివి. అందర్నీ తోసుకుని ఎక్కి సీటు పట్టుకోలేవు., పట్టుకున్నా అది లేడీస్ సీటవుతుంది., పోనీ స్టార్టింగ్ పాయింట్లో కిటికీ పక్కన సీటు చూసుకుని ఎక్కావనుకున్నా ఆ బస్సు డ్రైవర్ అంజనంలో కూడా కనబడడు. వేరే బస్సు వెళ్లిపోతోందంటారు. ఇక్కడ వేసిన రుమాలు కూడా త్యాగం చేసి అటు పరిగెడతావు. అది కదిలి వెళ్లిపోతుంది. ఎక్కలేవు. తిరిగి ఈ బస్సుకొచ్చే లోపుల బోనెట్లోంచి నరసింహస్వామిలా డ్రైవరు పుట్ట్టుకొచ్చి బస్సు స్టార్టు చేసేస్తాడు. సీట్లన్నీ నిండిపోతాయి. రుమాలు కూడా కనబడదు…''
''ఒరేయ్, వదిలిపెట్టరా బాబూ… అసలేం జరిగిందంటే..''
''ఉండు, రెండో వెర్షన్ వినిపిస్తానుండు. మళ్లీ స్కూటర్ చెడిపోయింది. బస్సు ఎక్కుదామకుని వచ్చావు. అందమైన అమ్మాయి. చేతిలో కాంపోజిషన్ పుస్తకాలు. పోనీ పరీక్ష పేపర్లు కట్ట.
''21సి బస్సెళ్లిపోయిందా?''అని తెలుగులో అడిగేవు.
''నేను తెలుగమ్మాయినని ఎలా కనుకున్నారు?'' అందామె ఆనందాశ్చర్యాలతో కళ్లు పెద్దవి చేసి, ''సింపుల్, మీ చేతిలో పరీక్ష పేపర్లు తెలుగులో రాసి వున్నాయి'' అన్నావు నువ్వు. ''ఎంత తెలివైన వారండీ'' అని మురిసిపోయిందామె…''.
''..ఆపరా బాబూ''.
''వెయిట్, ఇదీ తప్పేనంటావా? కావచ్చు. కథలో ఫ్లో ఉంది కానీ ఫ్లా కూడా ఉంది. నీవి సోడాబుడ్డి కళ్లద్దాలు. బస్సు నెంబరేమిటి, బస్సే కనబడదు. అలాటిది ఆమె పరీక్ష పేపర్ల మీద ఉన్నది ఎలా కనబడుతుంది? పైగా నువ్వు చొరవ చూపిి అమ్మాయిని పలకరించడం బొత్తిగా అతకలేదు. కాన్సిల్..''.
''ఒరే, నీ ఊహలు. వద్దు, అసలేం జరిగిందో నన్ను చెప్పనివ్వరా బాబూ''.
హిట్లరంతటి వాడు కూడా అప్పుడప్పుడు బట్లర్ మాట విని ఆ పూట మజ్జిగాన్నం తినేసి వుంటాడు…తన నోటితోనే చెబ్దామని గుర్రం సరదా పడుతోంది కదా, ఛాన్సిద్దామని-
''సరే , ఈసారికి నువ్వే చెప్పు, పై సారి ప్రేమలో పడ్డప్పుడు మాత్రం అదెలా జరిగిందో నేనే చెప్తాను''
''మళ్లీ ప్రేమలోనా!? ఒరేయ్, నువ్వు నా అమరప్రేమను శంకిస్తున్నావా?''
''అమరెవరు? ఉండు. ఆ అమ్మాయితో ప్రేమెలా స్టార్టయిందో ఊహించి చెప్తా పట్టు'' అంటూ కళ్లు మూసుకోబోయేను. వాడు నా మీదపడి నోరు కూడా మూసేసి కథనం సాగించాడు-
ఆ స్కూల్లో వీడి మేనల్లుడు ఏదో అల్లరి పని చేస్తే పెద్దాళ్లని పిలుచుకు రాకపోతే టీసీ ఇచ్చేస్తామన్నారట. 'నే చదివిన స్కూలేగా, నా కందరూ తెలుసు' అంటూ వీడెళ్లి మేష్టార్ని కలిసేడు. తెలుగు మేష్టారు వీణ్ణి చూడగానే 'నువ్వట్రా ఖగపతీ, వీడు నీ మేనల్లుడా? మరి వాణ్ణని తప్పేముంది? నీ పోలికే వచ్చి వుంటుంది. నువ్వింకా బడుద్ధాయిగానే ఉన్నావా? తెలివీ, అదీ ఏమైనా అబ్బిందా? అవునొరేయ్, అంత బుల్లి మెదడుతో ఇంత కాలం ఎలా గెంటుకొచ్చేవురా?' అంటూ అడిగేడట. అదీ – కామన్ రూమ్‌లో.
ఓ మూల నుంచి ముసిముసిగా ప్రారంభమైౖ, కిలకిలగా పెరిగి చివరికి గొల్లుమని నవ్వులు వినబడడంతో మనవాడు తల తిప్పి చూశాడు. సదరు శాల్తీ కొత్తగా చేరిన ఆడ ఇంగ్లీషుటీచరు. (టీచరు మాత్రమే ఆడ, ఇంగ్లీషు కాదు) 'ఇంగితం తెలీని వాళ్ళు ఇంగిలీషేం చెప్పగలరు?' అని ప్రాసతో చికాకు పడబోయేడట కానీ పడకుండా పట్టుకున్నది ఆమె అందమట! ఈమెను చూస్తే కుర్రాళ్లు పాఠం అప్పచెప్పడం మాట ఎలా ఉన్నా కళ్లప్పగించడం మాత్రం ఖాయం అనుకున్నాట్ట.
వీడిలో ఏ గొప్పతనం చూసిందో కానీ మర్నాడు ఈ అమ్మాయి వీడి గురించి మేనల్లుణ్ని వాకబు చేసిందట. ఇక్కడ ''నీ కేం తక్కువరా'' అనే డైలాగు అంటాననుకొని వాడు నా నోటి మీద పట్టు కాస్త సడలించాడు. కానీ ''నాకూ అదే ఆశ్చర్యంగా ఉందిరా'' అని నేనడంతో నోరు మళ్లీ గట్టిగా మూసేశాడు.
ప్రేమికులు చెప్పుకునే స్వీట్ నథింగ్స్, చేసుకునే స్వీట్ సమ్‌థింగ్స్ వాళ్లకు ముచ్చటగా ఉంటాయి కానీ మనకే మాత్రం నచ్చుబాటుగా వుండవు. అవన్నీ వినడం బోరు కాబట్టి వాడి చేయి లాగేసి ''ఇంతకీ ఏమిటంటావు? కడుపొచ్చిందా?'' అని అడిగేను.
వాడు దెబ్బ తిన్నట్టు చూశాడు. 'నేనింకా ఎ.బి. సిల్లో ఉన్నాను.నువ్వప్పుడే 'ఓ' దాకా వెళ్లిపోయావు. అయినా నేనలాటి..''
''ఓ ఫర్ ఆపరేషన్ అనా నీ ఉద్దేశ్యం?''
''అది కాదురా, ఇంటర్వెల్ తర్వాతి కథలోకి వెళ్ళిపోయేవు. మన కథ మూడో రీల్లో ఆగింది. సింగిల్ ప్రొజెక్టర్ వ్యహారం. కాస్సేపు ఆట, కాస్సేపు విరామం. నేను బొత్తిగా చవటననీ, చొరవలేని వాడిననీ పద్మజ అభిప్రాయం.. ఆగు, అలాగే, అక్కడే ఆగు.. నువ్వు ఏకీభవించ నక్కర్లేదు. ఆ అమ్మాయి ముందు నా ఇమేజి పెంచే ఉపాయం చూడమనే ఇందాకట్నుంచి పోరుతున్నది''.
''ఎకానమీ సైజుకి పెంచుతున్నాననుకో కానీ తర్వాత మెడ నొప్పెట్టిందని ఆ అమ్మాయి ఫిర్యాదు చేస్తే లాభం లేదు. ఇదివరకోసారి కృష్ణుడు ఇలాగే ఆల్ ఇన్ వన్ విశ్వరూపం చూపించే సరికి అర్జునుడు మొరపెట్టుకున్నాడు – 'నిన్ను పుల్ సైజులో చూడడానికి మెడ నెప్పెడుతోంది. శాంపుల్ సైజుకి మారిపో' అని''.
''పోనీ నన్ను జెయింటు సైజుకి పెంచు. సరిపెట్టుకుంటానులే''.
''జయలలిత కటవుట్ సైజుకి పెంచుతాను, సరేనా, వెళ్లు'' అని పంపించేశా.
xxxxxxxxxxxxxxx
ముత్యాలముగ్గు కాంట్రాక్టరులా ఓ పని ఒప్పుకున్నాక ఓళ్లూ ముంచాలి, బళ్లూ తెరిపించాలి. సమ్మర్ హాలిడేసయినా ఫర్వాలేదని బడి తెరిపించా, ఏన్యువల్ ఎగ్జామ్‌లో బాగా మార్కులొచ్చిన వాళ్లకి బహుమతిప్రదానం. పిల్లలకే కాదు, వాళ్ల తల్లిదండ్రుల క్కూడా- అసలు కష్టమంతా వాళ్లదేగా – (చూడుడు, చదువుడు, చదివించుడు రాబోయే నా 'అచలపతీ – ఆధునిక మాతా' కథ. సత్యనారాయణస్వామి వ్రతకల్పంలా కథల్లోనే సెల్ఫ్‌్ ప్రాపగాండా ఇరికించకపోతే పుస్తకాలు అమ్ముడు పోవంటున్నాడు పబ్లిషరు) బహుమతి ప్రదాత – మన ఖగపతిగాడు. ఈ 'గాడు' అనేది వాడి గురించి ఇచ్చిన రైటప్‌లో కనబడదు. వాడు ఇంతటి వాడు కాదు, అంతటి వాడు సుమా అని నొక్కి వక్కాణించడం జరిగింది.
ఫంక్షన్ రోజున బహుమతి ప్రదానానికి ముందు జరుగుతున్న ప్రోగ్రాం టైములో హాలు కిటకిటలాడటం చూసి అచలపతిని కదిలేశా- ''వెకేషన్‌కి అందరూ వెళ్లిపోయుంటారు, మనవాడు ఎదుర్కొనవలసిన జనాలు ఎక్కువమంది ఉండరనుకున్నాను. ఇంతమంది జనమా?''
''సర్, మనం వేసవిలో చల్లగాలి కోసం చూస్తాం, శీతాకాలంలో సూర్యుడి కోసం కాచుకుంటాం. స్కూలు లేదా ఆఫీసున్నప్పుడు సెలవులకోసం, సెలవు లిచ్చినప్పుడు స్కూలు లేదా ఆఫీసు కోసం అర్రులు చాస్తాం. అందుకే ఈ కిటకిట…''
''ఇంతమందిని చూస్తే మన భజగోవిందంగాడి పని గోవిందా..''
''…. భయమేస్తోందిరా.. నాకీ ఫంక్షన్ వద్దురా'' అన్న గొంతు వినబడింది.
అటు తిరిగాను. ''ఒరే, నేనేం చెప్పానో గుర్తుంచుకో, నువ్వు ఒక పెద్దమనిషిగా, హుందాగా అందరికీ బహుమతులిచ్చే ఆ ఇమేజ్ – సముద్రంపైకి లంఘించబోతున్న హనుమంతుడి సైజులో పద్మజ మైండులో ప్రింటయిపోతుంది. ఆ పైన నీ ప్రేమ గతజల సేతుబంధనం. అంటే వంతెన కట్టక్కర్లేదన్నమాట. సీతే వచ్చి నీ ఒళ్లో వాలుతుంది. ప్రస్తుతానికి ధైర్యం తెచ్చుకోరా''.
''లాభం లేదురా, కాళ్లూ, చేతులూ తెగ వణుకుతున్నాయి. ఆ ప్రైజులు కింద పడేస్తానేమో.. పుచ్చుకునే వాళ్ల కాళ్లవేళ్లు ఏమవుతాయో..''.
''సరే నీకు కావలసినది ధైర్యమేగా, ఇప్పిస్తాను, రా'' అన్నాను. మనవాడు మందు కొట్టడు. ఆ పేరు చెప్తే తాగడని ఓ క్లాసు రూములో మూల కూర్చోబెట్టి షాపుకెళ్లి వచ్చా.
ఇచ్చిన అరబాటిలూ నోరెత్తకుండా ఒక్క గుక్కలో తాగేసాడు. తాగేక చెప్పాడు – ''భయమేస్తోందని చెబితే మధ్యాహ్నం వెంకట్రావు ఇచ్చినదీ ఇలాగే వుంది, ఇందాక అచలపతి ఇచ్చినదీ ఇలాగే ఉందిరా'' అని.
''వాళ్లూ ధైర్యానికే మందు ఇచ్చారా?'' అన్నాను తెల్లబోయి…
''అవును, కానీ మందు రుచుల్లో, రంగుల్లో తేడాలున్నాయి సుమా''.
అంటే ఒకటిన్నర సీసాల కాక్‌టెయిల్ కడుపులో తయారవుతోందన్నమాట. కొంప మునగకుండా ఉంటుందా?
xxxxxxxxxxxxxxxx
మనవాడు స్టేజీ మీదకు ఎక్కిన దగ్గర్నుంచీ మునగడం ప్రారంభించింది.
మనవాళ్లకు మనమీదకంటె అరవ్వాళ్ల మీదా, సివిలియన్స్ కంటె మిలటరీ వాళ్లమీదా గురి ఎక్కువ కాబట్టి తెలుగువాళ్ల స్కూలైనా ఒక అరవ మిలటరీ ఆయన్ని ప్రిన్సిపాల్‌గా పెట్టారు. ఆయన టూ ఇన్ వన్ చండామార్కుళ్లా పెద్దాళ్లనే హడలగొట్టేట్లా ఉన్నాడు. మామూలప్పుడయితే మనవాడు ఆయన్ని చూడగానే పారిపోయి ఉండేవాడు. కానీ ఆ రోజు సంగతే వేరు.
ప్రిన్సిపాల్ స్వాగతోపన్యాసం ఇస్తూ వేదిక మీదున్న తెలుగు వాళ్ల పేర్లన్నింటినీ ఖూనీ చేసేసినా అందరూ నోర్మూసు క్కూర్చున్నారు. 'హరి హరరావుని','అరిగరరావ'న్నా , 'శఠగోపాచారి'ని ,'సడగోబాసారి' అన్నా చెల్లిపోయింది కానీ 'ఐ వెల్‌కమ్ మిస్టర్ కగపతి' అన్నప్పుడు మాత్రం మనవాడు వేలాడేసిన తలకాయ పైకెత్తి 'ఖగపతయ్యా బాబూ, సరిగ్గా చదువు' అన్నాడు తెలుగులోనే.
ఒక్క క్షణం నిర్ఘాంతపు నిశ్శబ్దం. ఆయన్ను అంతలా అదిలించిన వాళ్లని ఆ పరగణాలో చూసే అలవాటు లేక ఆయనా తెల్లబోయేడు. భస్మంచేసే చూపొకటి వాడి మీద పడేసాడు. మన వాడేం మన్మథుడా? ఆయనకేసి చూడటమే లేదు. జేబులోంచి రుమాలు తీసి బ్రాసరీ తయారు చేసుకుంటూన్నాడు.
ఆయన ఏమీ జరగనట్టు పైకి నటించినా, కాస్త నెర్వస్‌గా ఉన్నాడు. ఉపన్యాసంలో మనవాడి గురించి నాలుగు వాక్యాలు చెప్పవలసి వచ్చింది. మొదటి వాక్యంలో 'క్… ఖ..గ..పది' అని అంటూనే మా వాడికేసి ఓ చూపు విసిరేడు. వీడప్పటికే కాళ్లు చాచేసి తలకాయ కుర్చీ అంచుకి వాల్చి కళ్లు తేలేసి ఉన్నాడు. ఆయన కేసి చూడకుండానే ఎడం చెయ్యి పైకెత్తి చూపుడువేలు గాలిలో ఊపుతూ ''నో.నో.. ఖగపతి..ఖగపతి'' అన్నాడు.
ఆయన గుటకేసి రెండో వాక్యంలో 'గగపతి' అన్నాడు. ఈసారి వాడికేసి చూడకుండా ముందుకు దూసుకుపోబోయేడు. కానీ మనవాడు వదిలితేనా? ''నా పేరే సరిగ్గా పలకలేనివాడివి పాఠాలేం చెప్తావయ్యా బాబూ, ఏదీ విష్వక్సేనుడు అను.'' అన్నాడు. హాలులో పిల్లలంతా కిసుక్కున నవ్వారు కానీ ప్రిన్సిపాల్ ఉరిమినట్టు చూడడంతో ఆగిపోయేరు.
మూడో వాక్యానికి వచ్చేసరికి అతి నెర్వస్‌గా 'ఖ…ఖ….గ…బ..తి' అని స్పష్టంగా ఉచ్చరించాడు. పిల్లలంతా తలకాయ తిప్పి మనవాడికేసి చూసారు – ఈసారి ఏమంటాడో అని. మనవాడు లేచి ముందుకు వచ్చాడు. వచ్చి ప్రిన్సిపాల్ చెవి పట్టుకున్నాడు. ''ఏదీ, చెప్పు, 'ఖకార అకారములు ఖ..' అని మొదలు పెట్టాడు. అందరూ గొల్లున నవ్వారు. వింగ్స్‌లో నుంచొన్న టీచర్లు కొయ్యబారిపోయేరు.
ప్రిన్సిపాల్ వీడి చేయి విదిలించి తోసేసి ఉపన్యాసం కొనసాగించేడు. మళ్ళీ వాడి పేరు ఎత్తే ప్రయత్నం చేయలేదు. ''హి' అని మాత్రమే ప్రస్తావించాడు. అంతేకాదు, చెయ్యి అదలింపుతో టీచర్లను పురమాయించాడు. వాళ్లు వెళ్లి హాల్లో నాలుగుచోట్లా సర్దుకున్నారు. పిల్లలు నవ్వులు కట్టిపెట్టారు.
ఆయన ఉపన్యాసం ముగించి మన వాడిని చీదరించుకుంటూ వెళ్లి దూరంగా కూర్చున్నాడు. అయినా వీడు లేచి ఆయన పక్క కుర్చీలో కూర్చుని 'ఖకార అకారములు..' అంటూ చెప్తున్నాడు. పిల్లలు నవ్వు దాచుకోలేక ఉబ్బిపోతున్నారు. వాళ్ల కంటికి మనవాడు పెద్ద హీరో అయిపోయినట్టున్నాడు. అందుకునేలాగుంది వీడు ప్రౖౖెజు లివ్వడానికి లేచి నిల్చోగానే ఒకటే చప్పట్లు. ప్రిన్సిపాల్ ఎంత ఉరిమి చూసినా లాభం లేకపోయింది.
ప్రతీ ప్రైజూ వాళ్ల చేతిలో పెట్టడానికి ముందు వీడి చేతిలోంచి కిందకు జారిపడుతూ ఉండేది. కానీ పిల్లలు ఏమీ అనుకోలేదు. వాడి కాళ్లకు దణ్ణం పెట్టేరు కూడా. ఇది పిల్లల ఆరాధన! పెద్దవాళ్లు మాత్రం విసుక్కున్నారు- వాడు మగవాళ్లకు నమస్కారాలూ, ఆడవాళ్లకు షేక్‌హేండ్‌లు ఇచ్చినప్పుడు. ఒక లావుపాటావిడను కౌగలించుకో బోయినప్పుడు మాత్రం 'వద్దులెండి' అంది. ''పిల్లాడిని బాగా చదివించినందుకు నా రుణం ఇంకెలా తీర్చుకోను?' అన్నాడు వీడు. ఆవిడ ఓ వెర్రి చూపు చూసి వెళ్లిపోయింది.
వీడు ఒకావిడ మీద పగబట్టాడు. వాళ్లబ్బాయికే చాలా ప్రైజులు వచ్చాయి. వాడు ఊళ్లోలేడుట. వాడి తరపునా, పేరెంటుగానూ ప్రైజులు తీసుకోవడాని కావిడేే చాలాసార్లు వచ్చింది. నాలుగోసారీ, అయిదో సారీ 'అన్ని ప్రైజులూ నీకే ఇస్తున్నాను. నీ కెంతమంది పిల్లలు?'అని అడిగాడు. ఎనిమిదోసారి 'నీ వ్యవహారం చూస్తూంటే నాకేదో అనుమానంగా ఉంది' అన్నాడు. తొమ్మిదోసారికి ఆ అనుమానం బయట పెట్టేసాడు- 'ఆ బొజ్జింక మీసాల ప్రిన్సిపాల్‌కూ నీకూ సంబంధం ఉన్నట్టుంది. అవునూ, నీ పేరెలా పలుకుతాడు వాడు?' అని అతి సిన్సియర్ గా వాకబు చేసాడు.
సభంతా నిశ్శబ్దం. ఇంత దారుణమైన పరిస్థితికి ఎలా రియాక్టు కావాలో ఎవరికీ తెలియలేదు. నాకు హఠాత్తుగా ఉడ్‌హవుస్ 'బ్రింక్‌లీ మేనర్'లో ఫింక్‌నాటిల్ స్పీచ్ గుర్తొచ్చింది. ఫక్కుమని నవ్వొచ్చింది. అంతే! క్లూ ఇచ్చినట్టు, అంటురోగం వ్యాపించినట్టు అందరూ ఒకటే నవ్వులు. పిల్లలు ఈల వేశారు, కొందరు బల్లలు చరిచేరు. పెద్దలు కూడా చప్పట్లు చరిచేరు. హాలంతా మార్మ్రోగి పోయింది – నవ్వులతో, గోలతో.
xxxxxxxxxxxxxxxxxxx
ఖగపతి కూడా గోల పెట్టాడు మర్నాడు, మత్తు దిగేక. 'ఇంత అల్లరి పాలయ్యేక పద్మజకు నా మొఖం ఎలా చూపించను?' అని వాపోయాడు. సలహా ఇవ్వక తప్పుతుందా?
''నువ్వు ఇలా గిల్ట్ కాంప్లెక్సుతో ఆమె జీవితం నుండి తప్పుకున్నావంటే అసహ్యంగా ఉంటుంది. కాస్త గ్రేస్‌ఫుల్‌గా నిష్క్రమించాలంటే సినిమా స్టయిల్లో ఓ పనిచేయి. 'మా కుటుంబ మర్యాద కాపాడటానికి వేరే అమ్మాయిని పెళ్లాడుతున్నాననీ, నన్ను మరిచిపోమనీ' ఉత్తరం రాసి అచలపతి ద్వారా పంపేయి'' అన్నా! మారుమాటకుండా నా సలహా అమలు పరిచేడు; కాఫీ తాగి మళ్లీ మంచం ఎక్కేడు.
మధ్యాహ్నం పద్మజ నుండి ఫోన్ వచ్చింది. ఖగపతి ఇంట్లో దొరక్కపోతే మా ఇంటికి ఫోన్ చేసింది. వాడు లేనని చెప్పమన్నాడు. సంగతేమిటని అడిగానామెను. సిగ్గుపడుతూనే చెప్పింది –
మనవాడి గురించి ఆమెకు అంత పెద్ద అభిప్రాయం లేదుట, నిన్నటిదాకా! కానీ వాళ్ల ప్రిన్సిపాల్‌ని మావాడు టేకిల్ చేసిన విధానం చూశాక వీడెంత గొప్పవాడో ఆమెకు తెలిసి వచ్చిందట. అసలటువంటి చండశాసనుడితో గట్టిగా మాట్లాడినవాడే లేడట. అటువంటిది వీడు రింగ్ మాస్టార్లా ఆయన్ని ఆడించడం చూసి వాళ్ల టీచర్లందరూ ముగ్ధులయి పోయారట. ఒక్క పళంగా అందరూ వీడితో ప్రేమలో పడి పోయేరట. కానీ తను అందరి కంటే లోతుగా పడిందట. ఆ విషయం చెప్పి వాడిని సాయంత్రం బీచ్‌లో కలవమంది.
విషయం విని ఖగపతి కాస్సేపు పొంగిపోయి, అచలపతి చేత ఉత్తరం పంపిన విషయం గుర్తొచ్చి భోరున ఏడ్చాడు.
అచలపతిని పిలిచి ఉత్తరం ఎప్పుడిచ్చాడో కనుక్కోబోయేను.
అతను నాలిక్కరుచుకుని, ''మన్నించాలి సర్. ఉత్తరం మాట మరిచిపోయాను. ఇప్పుడు వెళ్లి ఇచ్చి పొరపాటును దిద్దుకోమంటారా?'' అన్నాడు ఆడిటరు చేతబడ్డ అకౌంట్స్ ఆఫీసర్లా.
ఆడిటర్లాగే నేనూ ఆ అవకాశం ఇవ్వలేదు.
''సరేలే, జరిగిందేదో జరిగింది. ఆ ఉత్తరం ఇలా ఇచ్చెయి'' అన్నా గుంభనగా.
కానీ ఖగపతి మాత్రం ఆవేశం పట్టలేక పోయేడు. వెళ్లి అతన్ని కౌగలించుకుని డాన్సు ప్రోగ్రాం మొదలెట్టబోయాడు. ''ఎంత అదృష్టం''అంటూ.
అచలపతి చలించలేదు. ''ఇందులో అదృష్టానికే ముంది సర్! సింపుల్ లాజిక్. ఎంతటివారికైనా తన పైవాడంటే పడదు. వాళ్లు అవమానాల పాలయినప్పుడు సంతోషించి, ఆ అవమానం చేసిన వారిని ఆరాధిస్తారు. పద్మజగారు ఆటోగ్రాఫ్ పుస్తకం తీసుకునివస్తారనీ, అప్పుడే మిమ్మల్నడిగి ఆ ఉత్తరం ఇద్దామనీ అనుకున్నాను. అవిడ ఫోన్ చేసి, ఇద్దరికీ శ్రమ తప్పించారు'' అంటూ నాకేసి తిరిగి క్షమాభిక్ష అడుగుతున్న ధోరణి ఏమీ కనబరచకుండా –
''ఏది ఏమైనా మీరు చెప్పిన పని వెంటనే చేయనందుకు క్షంతవ్యుణ్ణి. మీరు ఏ శిక్ష విధించినా..''
తన టక్కరితనం చూడండి. శిక్షేమీ వేయమని తెలిసికూడా గడుసుగా ఆ అడగడం చూడండి… హమ్మో! అచలపతా? మరోడా!? (''రచన'' మాసపత్రిక 1995)
– ఎమ్బీయస్ ప్రసాద్