ధోనీ ప్లేస్‌లోకొచ్చేదెవరబ్బా.!

ఇంగ్లాండ్‌ టూర్‌లో టెస్ట్‌ సిరీస్‌ని కోల్పోయిన టీమిండియాకి కొత్త కష్టమొచ్చిపడబోతోంది. కెప్టెన్‌ ధోనీ, తనంతట తానుగా కెప్టెన్సీని వదులుకోవడానికి సిద్ధమయ్యాడన్న ప్రచారం నేపథ్యంలో, ధోనీ ప్లేస్‌లోకి వచ్చేదెవరు.? అన్న చర్చ షురూ అయ్యింది. ఇప్పుడున్న…

ఇంగ్లాండ్‌ టూర్‌లో టెస్ట్‌ సిరీస్‌ని కోల్పోయిన టీమిండియాకి కొత్త కష్టమొచ్చిపడబోతోంది. కెప్టెన్‌ ధోనీ, తనంతట తానుగా కెప్టెన్సీని వదులుకోవడానికి సిద్ధమయ్యాడన్న ప్రచారం నేపథ్యంలో, ధోనీ ప్లేస్‌లోకి వచ్చేదెవరు.? అన్న చర్చ షురూ అయ్యింది. ఇప్పుడున్న టీమ్‌లో ధోనీకి ధీటుగా జట్టుని నడిపించగల వ్యక్తి ఇంకొకరు లేరనే చెప్పాలి. కోహ్లీకి జట్టుని నడిపించే సత్తా వున్నా.. ఊరికే ఆవేశపడే వ్యక్తిగా కోహ్లీకి పేరుంది. దాంతో, అతన్ని పార్ట్‌ టైమ్‌ కెప్టెన్‌గా అనుకోవచ్చేమోగానీ, కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలను అతనిపై పెట్టలేమన్న వాదన బలంగా విన్పిస్తోంది.

మరోపక్క రోహిత్‌ శర్మ అయితే బావుంటుందన్న వాదన తెరపైకొస్తోంది. కానీ, రోహిత్‌ శర్మ ఏ మ్యాచ్‌లో ఆడతాడో, ఏ మ్యాచ్‌లో అతనికి చోటు దక్కుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి వుంది. దాంతో, రోహిత్‌ శర్మనీ కెప్టెన్సీకి కన్సిడర్‌ చేయలేని గందరగోళం బీసీసీఐకి తలెత్తుతుంది కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకుంటే. ఈ నేపథ్యంలోనే ధోనీని బీసీసీఐ వెనకేసుకొస్తోందట.

మాజీ క్రికెటర్‌ వెంగ్‌సర్కార్‌ అయితే, చెత్త టీమ్‌ని చేతుల్లో పెడితే ధోనీ అయినా ఏం చేస్తాడు.? అని ఘాటుగానే వ్యాఖ్యానించేస్తుండడం గమనార్హం. వెంగ్‌ సర్కార్‌ మాటల్లోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే, సరైన బౌలర్‌ లేకుండా విదేశీ టూర్‌.. అంటే అంతకన్నా దౌర్భాగ్యమింకొకటి వుండదు. జహీర్‌ఖాన్‌ లాంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్‌ బౌలర్‌ లేని లోటు సిరీస్‌లో స్పష్టంగా కన్పించింది.

బ్యాట్స్‌మన్‌ విషయంలోనూ అంతే. జట్టుని కష్టకాలంలో ఆదుకునే బ్యాట్స్‌మన్‌ లేకపోవడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ని దారుణంగా చేజార్చుకుంది టీమిండియా. ఇందులో ధోనీ తప్పు కూడా వుంది. బ్యాట్స్‌మన్‌గా ఓడిపోయిన మ్యాచ్‌లలో సత్తా చాటుకున్నాడే తప్ప, జట్టుని విజయపథంలో నడిపించలేకపోయాడు ధోనీ. ధోనీ ఒక్కడినే మార్చాలన్న నిర్ణయమూ సరికాదు.. జట్టు కూర్పు మొత్తం మార్చితే తప్ప ఫలితాలు సరిగ్గా వుండవని ఇంగ్లాండ్‌ టూర్‌ బీసీసీఐకి గొప్ప పాఠమే చెప్పింది.

ఈ నేపథ్యంలో ధోనీని మార్చాలా? వద్దా.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, తాము తీసుకుంటున్న నిర్ణయాలు.. మరీ ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో చిత్తశుద్ధి లోపించిందా.? అన్నదానిపై బీసీసీఐ ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సి వుంది.