ఎమ్బీయస్‌: వినోద్‌ మెహతా – 22

ఇన్‌కమ్‌టాక్సు దాడిలో ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకుంటారు, డబ్బు ఎక్కడైనా దాచారేమో మూలమూలలా వెతుకుతారు, అక్కవుంట్స్‌ డిపార్టుమెంటులో సిబ్బందిని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తారు. కానీ ఔట్‌లుక్‌పై దాడిలో విచిత్రంగా ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులు ఎడిటోరియల్‌ ఆఫీసుపై దాడి…

ఇన్‌కమ్‌టాక్సు దాడిలో ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకుంటారు, డబ్బు ఎక్కడైనా దాచారేమో మూలమూలలా వెతుకుతారు, అక్కవుంట్స్‌ డిపార్టుమెంటులో సిబ్బందిని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తారు. కానీ ఔట్‌లుక్‌పై దాడిలో విచిత్రంగా ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులు ఎడిటోరియల్‌ ఆఫీసుపై దాడి చేశారు. కంప్యూటర్లు అన్నీ తెరిచి చూసి, ఆ టైములో వున్న ఏకైక జర్నలిస్టును ఔట్‌లుక్‌ కథనాల గురించిన ప్రశ్నలతో వేధించారు. పాత కథనాల, సమాచారాల ఫ్లాపీలు తీసేసుకున్నారు. మను జోసెఫ్‌ అనే జర్నలిస్టు బ్యాగ్‌ వెతికి, అతని డైరీ తీసేసుకున్నారు. ఇదేమిటని అడిగితే 'ఎడిటోరియల్‌ ఆఫీసుపై కూడా దాడి చేసే అధికారం మాకుంది. నల్లధనానికి సంబంధించిన ఏ సమాచారం ఎక్కడుందో ఎవరికి తెలుసు?' అని జవాబిచ్చారు యిన్వెస్టిగేషన్స్‌ నిర్వహించిన డైరక్టరు జనరల్‌. వాళ్లకు కావలసినది నల్లధనం కాదని, ఎన్‌డిఏ అకృత్యాలపై ఔట్‌లుక్‌ సేకరించిన సమాచారమనీ అందరికీ తేటతెల్లమైంది. వినోద్‌ మెహతా అడిగిన ప్రశ్నకు పబ్లిషరు ''నువ్వేం రాజీనామా చేయనవసరం లేదు. ఇద్దరం కలిసి దీన్లోంచి ఎలాగోలా బయటపడదాం'' అని సమాధాన మిచ్చాడు.

వినోద్‌ ''ఏన్‌ ఎస్సాల్ట్‌ ఆన్‌ ద ఇండియన్‌ ప్రెస్‌'' పేర ఎన్‌డిఏ చర్యను దునుమాడుతూ ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశాడు. దాని కాపీలను ప్రెస్‌ కౌన్సిల్‌కు ప్రతిపక్ష నాయకురాలైన సోనియా గాంధీకి పంపాడు. దానితో బాటు వాజపేయికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశాడు. ''మీరు నాకేదో ఉపకారం చేయాలని యీ లేఖ రాయటం లేదు. పత్రికా స్వేచ్ఛను హరించిన ఎమర్జన్సీ బాధితుల్లో మీరు కూడా ఒకడు. మీరంతే నాకెంతో గౌరవం. మీకు తెలియకుండా యీ దాడి జరిగి వుంటుందని భావిస్తున్నాను. అందుకే మీ దృష్టికి తెస్తున్నాను.'' అని. ఆ ఉత్తరానికి ఎక్నాలెజ్‌మెంట్‌ కూడా రాలేదు. ఈ దాడుల్లో ప్రభుత్వానికి ఏమీ దొరకకపోగా పత్రికారంగమంతా ఔట్‌లుక్‌ పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఔట్‌లుక్‌ ఆఫీసుల్లో ఆర్థికనేరాల పరంగా కూడా ఏమీ దొరకలేదు. ఇక ఇన్‌కమ్‌టాక్సు శాఖ బుకాయింపు మొదలుపెట్టింది. ఖాతాల్లో లేని డబ్బు రూ.51 లక్షలు దొరికిందని ప్రకటన యిచ్చింది. 51 లక్షలు కాదని, 51 వేలని అది కూడా  వ్యాధిగ్రస్తురాలైన తన బంధువు యింట్లో అనీ, అది కూడా వైద్యపు ఖర్చులకై అనామత్తుగా పెట్టినదనీ రాజన్‌ రహేజా వివరణ యిచ్చాడు. అయినా అధికారులు అతన్ని వేధించసాగారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేటు ఆఫీసుకు పొద్దున్నే 10 గం||లకు రమ్మనమని చెప్పి ఏ ప్రశ్నలూ అడక్కుండా సాయంత్రం 6 గం||ల దాకా కూర్చోపెట్టేవారు. మళ్లీ మర్నాడు రమ్మనేవారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు 20 ఏళ్ల క్రితం ఫైలేదో అడిగేవారు. వెతికివెతికి యిస్తే నాలుగు రోజులు వుంచుకుని వెనక్కి యిచ్చేసి మళ్లీ యింకోటి అడిగేవారు. అన్నీ ఓసారి అడక్కుండా యిలా సతాయించేవారు. రాజన్‌కు చికాకు వచ్చేసింది. ఈ వేధింపు ఆగే విధానమేదైనా వుందేమో చూడమని వినోద్‌ను కోరాడు.

వినోద్‌ బ్రజేష్‌ మిశ్రాకు ఫోన్‌ చేస్తే ఎపాయింట్‌మెంట్‌ యిచ్చాడు. వినోద్‌ చెప్పినది విని ''మీపై దాడి జరిగిందా, చ్చొచ్చొచ్చొ, నాకు తెలియదే!' అని ఆశ్చర్యం నటించి 'వాజపేయి గారికి, నాకూ పత్రికా స్వేచ్ఛ అంటే అమిత గౌరవం' అంటూ లెక్చరు దంచాడు. వినోద్‌కు గతి లేకపోయింది – 'ఔనౌను, నాకు ఆ విషయంలో  నాకు సందేహం లేదు. ఏదో అపార్థం చేతనో, మా పొరపాటు వలనో, గ్రహపాటు వలనో ఔట్‌లుక్‌పై దాడులు జరిగి వుంటాయి. ఆదాయపు పన్ను ఎగవేత గురించి మీరు విచారణ కొనసాగించండి, కానీ మా ప్రొప్రయిటరును రోజూ ఆఫీసుకు పిలిపించే వేధింపు తప్పించండి' అని అడిగాడు. 'తప్పకుండా' అంటూ బ్రజేష్‌ ఫోన్‌ తీసి ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హాతో వినోద్‌ మిమ్మల్ని కలుస్తాట్ట, ఓకేనా అని అడిగి, వెళ్లి కలవండి అని చెప్పాడు. యశ్వంత్‌ సిన్హాను కలిస్తే 'రాజన్‌ వ్యవహారం గురించి పేపర్లలో చదివాను. వేధింపులేమైనా వుంటే వద్దని చెప్తాను' అన్నాడు. మర్నాటికల్లా వేధింపులు ఆగిపోయాయి. వాజపేయి వంటి పెద్దమనిషి అధికారంలో వున్నా ప్రభుత్వం తనకు గిట్టని మీడియాను ఎలా వేధిస్తుందో వినోద్‌కు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ లోగా ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్టులు ఔట్‌లుక్‌పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతి కె ఆర్‌ నారాయణన్‌కు పంపారు. ఆయన వినోద్‌ను పిలిచి గొడవేమిటి అని అడిగాడు. ఇతను జరిగిన భాగోతమంతా చెప్పుకుని వచ్చాడు. ఆయన ఆ తీర్మానానికి తన కవరింగ్‌ లెటర్‌తో సహా వాజపేయికి పంపాడు. ఆ తర్వాత వినోద్‌, వాజపేయిల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. గతంలో వున్న సౌహార్ద్రత మాయమైంది. ఏది ఏమైనా వాజపేయి అంటే తనకు యిష్టమే అంటాడు వినోద్‌.

xxxxxxxxxxxxxxxxx

బిజెపి ఢిల్లీ ఆఫీసులో పనిచేసే రోజుల్లో నరేంద్ర మోదీ ఔట్‌లుక్‌ ఆఫీసుకి వచ్చి అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌కు వ్యతిరేకంగా వున్న కొన్ని డాక్యుమెంట్లు తెచ్చి పత్రికలో ప్రచురించమని కోరాడు. కానీ వాటిల్లో పస లేదని భావించిన వినోద్‌ వాటిని అచ్చు వేయలేదు. కొన్నాళ్లకు కేశూభాయ్‌ స్థానంలో మోదీయే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన కొన్ని నెలలకే 2002 ఫిబ్రవరిలో గోధ్రా అల్లర్లు జరిగాయి. గోధ్రా స్టేషన్‌లో 51 మంది కరసేవకులున్న రైలు పెట్టె దహనాన్ని ఖండించడమే కాకుండా  దానికి ప్రతీకారంగా ప్రభుత్వం మద్దతుతో గోధ్రాలో చెలరేగిన అల్లర్లను కూడా ఖండించింది. మోదీ ప్రభుత్వం ఔట్‌లుక్‌పై మూడు కేసులు మోపింది. అవి యింకా నడుస్తూనే వున్నాయి. 
ఔట్‌లుక్‌ బొంబాయి కరస్పాండెంట్‌ మను జోసెఫ్‌ అహ్మదాబాదు వెళ్లి ఫిబ్రవరి 27 రాత్రి నాటి సమావేశం గురించి వివరాలు సేకరించి కథనం ప్రచురించాడు. మోదీ యింట్లో జరిగిన ఆ సమావేశానికి ముఖ్యమంత్రి సహాయకులు, పోలీసు అధికారులు అందరూ హాజరయ్యారు. హిందువుల కసి తీరేందుకు దోహదపడాలని, గొడవలు జరుగుతూంటే పట్టించుకోకూడదని మోదీ పోలీసు అధికారులను ఆదేశించాడని సమాచారం. ఆ సమావేశం రికార్డు మాయమై పోయింది. సమావేశంలో జరిగినది బయటకు రావడానికి కారకుడు ఒక మంత్రి. గోధ్రా అల్లర్ల తర్వాత జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ చైర్మన్‌గా ఏర్పడిన కన్సర్న్‌డ్‌ సిటిజెన్స్‌ ట్రైబ్యునల్‌ ముందు  జరిగినది చెప్పేడు. ట్రైబ్యునల్‌లో సభ్యుడైన జస్టిస్‌ సురేష్‌ను మను జోసెఫ్‌ సంప్రదించగా 'ఆ మాట నిజమే అయితే రిపోర్టులో తన పేరు ఎక్కడా రాకూడదని అతను షరతు విధించాడు' అని చెప్పాడు. ఆ మంత్రి రెవెన్యూ మంత్రి హరేన్‌ పాండ్యా అయి వుంటాడని మను జోసెఫ్‌ వూహించాడు. ఆ సమావేశంలో అతను గోధ్రా రైలు మృతులు శరీరాలను అహ్మదాబాద్‌ తీసుకుని వస్తే ప్రజలు ఆవేశకావేషాలకు లోనవుతారని, అందువలన తీసుకుని రాకూడదని వాదించాడట. కానీ తక్కిన మంత్రులు అతని గదమాయించారట. శాంతి కమిటీలను పెట్టి ముస్లిములకు, హిందువులకు మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మంత్రుల ఆగ్రహానికి గురయ్యాడు.

2002 నవంబరులో గుజరాత్‌ ఎన్నికలు జరిగినపుడు తనకు టిక్కెట్టు యివ్వరని గ్రహించిన హరేన్‌ ఎన్నికలలో పోటీ చేయనని చెప్పి జాతీయ కమిటీలో చేరాడు. నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నికైన తర్వాత హరేన్‌ 2003 మార్చిలో అనుమానాస్పద పరిస్థితుల్లో అహ్మదాబాదులో హత్యకు గురయ్యాడు. అతని భార్య నరేంద్ర మోదీయే హత్య చేయించాడని ఆరోపిస్తూ కోర్టులో కేసు పెట్టింది. విచారణ జరిపిన స్పెషల్‌ కోర్టు 2007లో హైదరాబాదు వాసి ఐన అస్గర్‌ ఆలీయే దోషి అని నిర్ణయించి యావజ్జీవ శిక్ష వేసింది. తక్కిన 7గురికి పదేళ్ల సాధారణ శిక్ష వేసింది. వాళ్లు అప్పీలుకి వెళితే గుజరాత్‌ హైకోర్టు 2011లో అందర్నీ నిర్దోషులుగా వదిలేసింది. దీనిపై హరేన్‌ పాండ్యా భార్య మండిపడి 2012 ఎన్నికలలో గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ టిక్కెట్టుపై నిలబడి మోదీ సర్కారే తన భర్తను చంపివేసిందని ఆరోపించింది. – (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)  

[email protected]

Click Here For Archives