అయ్య బాబోయ్‌… అలియా కి కూడా రంగుప‌డుద్దేమో…

మ‌హారాష్ట్ర సాక్షిగా “శివ తాండ‌వం” చేస్తున్న వైనం చూస్తున్నాం.  సంగీత కార్యక్రమాల నుంచి పుస్తకావిష్కర‌ణ‌ల దాకా ప్రతీదీ మా ఇష్టప్రకార‌మే జ‌ర‌గాల‌నే అన‌ధికార చ‌ట్టాలను శాస‌నాల అమ‌లును నివ్వెర‌పోతూ తిల‌కిస్తున్నాం.  ఇలాంటి ప‌రిస్థితుల్లో బాలీవుడ్‌లో…

మ‌హారాష్ట్ర సాక్షిగా “శివ తాండ‌వం” చేస్తున్న వైనం చూస్తున్నాం.  సంగీత కార్యక్రమాల నుంచి పుస్తకావిష్కర‌ణ‌ల దాకా ప్రతీదీ మా ఇష్టప్రకార‌మే జ‌ర‌గాల‌నే అన‌ధికార చ‌ట్టాలను శాస‌నాల అమ‌లును నివ్వెర‌పోతూ తిల‌కిస్తున్నాం.  ఇలాంటి ప‌రిస్థితుల్లో బాలీవుడ్‌లో స్టార్  హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఉన్న మ‌హేష్‌భ‌ట్ చిన్న కూతురు అలియా భ‌ట్‌…ఓ కొత్త ఆకాంక్షను వెలిబుచ్చింది.  నిజానికి కొన్ని రోజుల క్రిత‌మైతే అదేమీ  పెద్ద వివాదాస్పద ఆకాంక్ష కాద‌నుకోండి. కాని ఇప్పుడు మాత్రం అలా అయ్యే ప్రమాదం కాచుక్కూచుంది మ‌రి.  

ఇంత‌కీ అలియా ఏమందంటే… ప్రస్తుతం బ‌యోపిక్‌ల శ‌కం న‌డుస్తోంది క‌దా.  మ‌ర‌ణించిన ప్రముఖుల కు సంబంధించిన ఏదైనా సినిమాలో న‌టించేందుకు అవ‌కాశం వ‌స్తే…  ఏ ప్రముఖుని జీవిత క‌ధ మీకు అవ‌కాశంగా రావాల‌ని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నకు స‌మాధానంగా ఈ చిన్నది… ఏ భార‌తీయ ప్రముఖురాలి క‌ధ‌నో ఎంచుకోలేదు. పోనీ ఏ అమెరికానో, ఆఫ్రికానో కూడా అనుకోలేదు. శుభ్రంగా పాకిస్తాన్ ప్రముఖురాలినే ఎంచుకుంది. “నాకు పాక్ పాప్ సింగ‌ర్ న‌జియా హ‌స‌న్ జీవిత‌కధ సినిమాగా తీస్తే న‌టించాల‌ని ఉందోచ్” అంటూ ప్రక‌టించేసింది.
    
వాస్తవంగా చూస్తే అలియాది అద్భుత‌మైన ఎంపిక అనాలి.  కేవ‌లం 15 ఏళ్ల పిన్న వ‌యస్సులోనే ఉత్తమ నేప‌ధ్య  గాయ‌నిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ద‌క్కించుకున్న న‌జియా, ఆ అవార్డ్ ద‌క్కించుకున్న తొలి పాకిస్తానీ గాయ‌కురాలు కూడా.  ఖుర్బాని హిందీ సినిమాలోని ఆప్ జైసా కోయీ మేరీ పాట‌తో సినీ ఆరంగేట్రం చేసి, డిస్కో దివానీ… వంటి పాట‌ల‌తో ఆమె పాకిస్తాన్ కంటే మిన్నగా భార‌తీయుల్ని ఒక ఊపు ఊపింది.  

గాయ‌నిగా, బాల‌ల హ‌క్కుల ఉద్యమ‌కారిణిగా, ఐక్యరాజ్యస‌మితికి సైతం సేవ‌లందించిన న‌జియా 35 ఏళ్ల వ‌య‌సులోనే క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆమె వ్యక్తిగత, వైవాహిక‌ జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. క్యాన్సర్‌కు స‌రైన మందులేని నాటి ప‌రిస్థితుల్లో కొన్నేళ్ల పాటు దానితో పోరాడుతూ మ‌రోవైపు ఎంచుకున్న రంగానికీ కూడా న్యాయం చేసింది. 

ఈ ర‌కంగా చూస్తే అలియా మంచి స్ఫూర్తి దాయ‌క‌మైన జీవిత క‌ధ‌నే ఎంచుకుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఇటీవ‌ల అయిన దానికీ కాని దానికీ పాక్ వంక చూపించి ఇక్కడ నానా ర‌భ‌స చేస్తున్న వాళ్లు…  అలియా ఆశ‌ల మీద కూడా నీళ్లు చ‌ల్లుతారో,  విన‌నంటే  అలియా కు కూడా రంగు పూసేస్తారో…  మ‌న భ‌యం నిజం కాకూడ‌ద‌ని ఆశిద్దాం.