ఏపీలో టాలీవుడ్ కోసం బాబు ఏం చేయాలంటే..?

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్క రాజధాని విషయంలో మాత్రమే కాదు.. అన్ని విషయాల్లోనూ తిరుగులేని స్థాయికి తీసుకువెళ్తానని అంటున్నారు. పాజిటివ్ గా చూడదలచుకుంటే.. కనీసం నాయకుడికి ఆ మాత్రమైన హోప్ అవసరమే ఏమో అనిపిస్తుంది.…

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్క రాజధాని విషయంలో మాత్రమే కాదు.. అన్ని విషయాల్లోనూ తిరుగులేని స్థాయికి తీసుకువెళ్తానని అంటున్నారు. పాజిటివ్ గా చూడదలచుకుంటే.. కనీసం నాయకుడికి ఆ మాత్రమైన హోప్ అవసరమే ఏమో అనిపిస్తుంది. హోప్,పాజిటివ్ ఆలోచనను కూడా తప్పు పట్టకూడదు గానీ.. ప్రాక్టికల్ గా లేని ఆలోచనలు, తర్క బద్ధం కాని ప్రతిపాదనలు, సత్యదూరమైన హామీలు గుప్పిస్తున్నప్పుడే ఆయన చిత్తశుద్ధి మీద అనుమానం వస్తుంది. తాను ఆశిస్తున్న విషయానికి మార్గం ఒక వైపు ఉంటే.. మరొక దిశలో ప్రయాణం సాగిస్తే ఆయన ఎప్పటికి గమ్యం చేరుకుంటారా? అనే సందేహలు రేకెత్తుతాయి. అలాగని ఆయనకు అసలు మార్గం తెలియదని అనుకోవడానికి వీల్లేదు. కానీ.. తన ఎప్రోచ్ లో కొంత తేడా చూపిస్తూ ఉంటారంతే. 

ఇప్పుడు వివరాల్లోకి వెళితే.. సుదీర్ఘ కాలం ప్రయాస తరువాత హైదరాబాదులో స్థిరపడిన తెలుగు చలన చిత్ర పరిశ్రమను సాంతం విశాఖకు తీసుకువెళ్లిపోతా అని చంద్రబాబు అంటున్నారు. అక్కడ లొకేషన్లు బాగుంటాయని, కావలసినంత భూములు పంచేస్తానని ఇండస్ట్రీ ఇటు వచ్చేయాలని ఆయన అంటున్నారు. 

కానీ చంద్రబాబు గుర్తించవలసిన కీలకాంశం ఒకటుంది. చలనచిత్ర పరిశ్రమకు కావల్సింది ఒక్క ప్రకృతి అందాలు మాత్రమే కాదు… అంతకు మించి రాయితీలు లాంటివేమైనా ప్రకటిస్తే బాగుంటుందనే మాట బాబు గారు మరిచినట్టున్నారు. ప్రక్క రాష్ట్రాల్లో సినిమా టైటిల్ ప్రాంతీయ భాషలో వుంటే రాయితీలు ప్రకటిస్తున్నారు… ఇలాంటివి కాకుండా బాబుగారు ఒక్కొక్క పరిశ్రమకూ వందల ఎకరాలు ఇచ్చేస్తాను అంటూ పోతే చివరికి భూములు గాల్లోంచి పట్టుకొస్తారేమో చూడాల్సివుంది.  

పరిశ్రమ స్థిర పడాలంటే భూముల కొరత ఒక్కటే కారణం అన్నట్లుగా చంద్రబాబు ఎకరాలు ఇస్తా అనే పాట పాడుతున్నారు. కానీ ఎకరాలకు, సినీ పరిశ్రమ రావడానికి సంబంధం లేదు. పైగా ఎకరాల కొద్దీ భూములని అయిన వాళ్లకు దోచిపెట్టినంత మాత్రాన వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప మరో ప్రయోజనం ఉండదు. దానివల్ల సినీ పరిశ్రమ స్థిరపడడం జరగదు. నిజంగానే చంద్రబాబుకు ఏపీలో సినీ పరిశ్రమ విస్తరించాలనే ఆలోచన ఉన్నట్లయితే.. 100 శాతం ఏపీలో షూటింగ్ జరుపుకున్న చిత్రానికి ప్రభుత్వ పరంగా ఉండే పన్నులన్నీ మినహాయిస్తాం అని చెప్పాలి. అలా ఒక విధానం తీసుకురావాలి. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉండే అందమైన లొకేషన్లను వారే వెతుక్కుని మరీ సినిమాలు చేసుకుంటారు. అంతే తప్ప అయినవారికి దోచిపెట్టడానికి అన్నట్లుగా భూములు పంచేస్తాం.. అనే పాట ఒక్కటే పాడితే ఎలాగ?  అన్ని ప్రాంతాల్లోనూ షూటింగులు జరుగుతూ ఉంటే దాన్ని పరిశ్రమ విస్తరణ అంటారు. అలాకాకుండా చంద్రబాబు భూముల పాట పాడితే.. మళ్లీ ఆయన హైదరాబాదులో చేసిన తప్పిదమే చేసినట్లు విమర్శలు ఎదుర్కోవాల్సిందే. 

రాయితీలు పన్ను విధానాల్లో మార్పులు పరిశ్రమను తీసుకురాగలవు తప్ప.. భూముల పందేరం కాదని బాబుగారు గ్రహించాలి. ఆయన హామీల వెనుక మరేదైనా ఇతర ఉద్దేశ్యాలు ఉంటే మాత్రం గ్రహించకపోయినా పరవాలేదు.