దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షుడయ్యారు. ఆయన మేధాశక్తి, విషయపరిజ్ఞానం, వచోపటిమ అప్పటికే అందరికీ విదితమే. అయితే ఆయన వ్యక్తిగత జీవనశైలిపై వివాదాలున్నాయి. అందుకని కొందరు ఛాందసులు అతన్ని వ్యతిరేకించారు. వారికి నాయకుడు బలరాజ్ మధోక్. 1967 ఎన్నికల తర్వాత యితర పార్టీలతో కలిసి సంయుక్త ప్రభుత్వాలు ఏర్పరచడాన్ని కూడా యీ బృందం వ్యతిరేకించింది. తమ పార్టీ ఆశయాలు యితరుల కంటె భిన్నమైనవి కాబట్టి వారితో కలిస్తే మైల పడినట్లే అని వాదించింది. 'మనం ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం యిప్పట్లో లేదు కాబట్టి పరిస్థితుల బట్టి పోవాలని, సోషలిస్టుల వంటి సహజశత్రువులతో కూడా చేయి కలపాలని వాజపేయి ఒప్పించబోయాడు. దీన్‌దయాళ్ వాజపేయికేసి మొగ్గడంతో అది సంభవమైంది. వాజపేయి ఆచరణవాది అని అప్పుడే అందరికీ అర్థమైంది.
వాజపేయికి ఉదారవాది అనే పేరుంది. ఆయన బిజెపి తరఫున ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు 'ఆయన్ని బలపరచవచ్చు కదా' అని ఆయన ప్రత్యర్థులను అడిగితే వాళ్లు 'రైట్ మ్యాన్ యిన్ రాంగ్ పార్టీ' అనేవారు. ఆయన సరైనవాడే కానీ, పార్టీ సరైనది కాదని భావం. పార్టీ ఆయన్ను ముందు పెట్టి ప్రజలకు, సహచరపక్షాలకు చూపించి ఆకర్షిస్తూ, వెనకనుండి తమ విధానాలను అమలు చేయడానికి ఆడ్వాణీ చేతిలోనే చక్రం పెట్టి తిప్పించిందని విమర్శకులు అంటారు. 'వాజపేయి మా ముఖోటా (మొహానికి వేసుకునే తొడుగు, మాస్క్)' అని గోవిందాచార్య ఒకసారి అన్నారు. వాజపేయి ఏ మేరకు ఉదారవాది అనేది ఆయన హృదయంలోకి తొంగిచూస్తే కానీ తెలియదు. ఆయన వ్యక్తం చేసిన ఆలోచనలు, చేపట్టిన చర్యలు యితరులంత తీవ్రంగా వుండవు. తను ప్రధాని అయినప్పుడు భాగస్వామ్యపక్షాలతోనే కాక, ప్రత్యర్థులతో కూడా సుహృద్భావంతోనే వున్నారు. ఆనాటి కఠిన చర్యలన్నిటికీ ఆడ్వాణీనే బాధ్యుడిగా పేర్కొంటారు. పార్టీకి అధ్యక్షుడు కావడానికి ముందునుంచీ ప్రముఖనాయకుడిగా వున్న వాజపేయి ఉదారవాది అయితే జనసంఘ్ పార్టీ విధానాల్లో కూడా అది కొంత మేరకేనా ప్రతిఫలించి వుండాలి. అలా వుందా లేదా అన్నది పరిశీలిద్దాం.
జనసంఘ్ పార్టీ విధానాల్లో గాఢాభిమానులు మెచ్చేది, తటస్థులు భయపడేది, వ్యతిరేకులు ఖండించేది – మైనారిటీల పట్ల వారి ఆలోచనాధోరణి! మొదట శిఖ్కుల గురించి చెప్పాలి. భాష ప్రాతిపదికపై 1953లో తెలుగువారికి రాష్ట్రం యిచ్చాక, పంజాబీ భాష మాట్లాడేవారి కోసం భాషాప్రయుక్త రాష్ట్రం కావాలని, దాన్ని 'సుబా'గా పిలవాలనీ ప్రతిపక్షంలో వున్న అకాలీలు ఆందోళన చేసేవారు. ముస్లిములు ఇస్లాం పేరుతో పాకిస్తాన్ కోరి సాధించినట్లే, అకాలీలు కూడా శిఖ్కు మతం పేరుతో ప్రత్యేక దేశంగా విడిపోతామని అడుగుతారని, దానికి యీ పంజాబీ సుబా మొదటిమెట్టనీ జనసంఘ్ అనుమానించింది. (శిఖ్కులు ఖలిస్తాన్ కోరడమనేది చాలా ఏళ్ల తర్వాత జరిగింది. కానీ దానికి కారణం – అకాలీ దళ్‌ను బలహీనపరచడానికి ఇందిరా గాంధీ పంజాబ్‌లో రగిల్చిన చిచ్చు. ఆ చిచ్చులో ఆమె స్వయంగా ఆహుతై పోయింది. కొన్నేళ్లకు ఖలిస్తాన్ డిమాండ్ కూడా చల్లారిపోయింది). జనసంఘ్ పంజాబీ భాషారాష్ట్రం ఏర్పడడాన్ని అడ్డుకోవడానికి పంజాబీ భాషీయుల సంఖ్య పెద్దగా లేదని నిరూపించడానికి ప్రయత్నించింది. తన అనుయాయులైన పంజాబీ హిందువులను హిందీ తమ మాతృభాషగా ప్రకటించాలని ఆదేశించింది. 1955 ఆగస్టులో కలకత్తాలో జరిగిన సమావేశంలో 'అకాలీ దళ్ వంటి మతతత్వవాదులు జాతీయ సమగ్రతను పట్టించుకోకుండా తమకోసం ప్రత్యేక ప్రాంతాలను సృష్టించాలని కోరడం ఆందోళనకరంగా వుంది. పంజాబీ భాషాప్రయుక్త రాష్ట్రం ముసుగులో మతపరమైన మరో దేశాన్ని తయారుచేయడానికే అకాలీ దళ్ సమకట్టింది.' అని తీర్మానం చేసింది.
ఎలాగైతేనేం మొదటి ఎస్సార్సీ పంజాబ్‌ని చీల్చనక్కరలేదని అంది. 1965లో ఇండో-పాక్ యుద్ధం జరిగాక ఆ యుద్ధవిజయానికి దోహదపడిన శిఖ్కు సైనికులకు కానుకగా పంజాబ్‌ని విడగొట్టాలన్న కోరిక మళ్లీ బలంగా వినిపించింది. 1966 జనవరిలో కాన్పూరులో జరిగిన సమావేశంలో జనసంఘ్ 'కేంద్రప్రభుత్వం పంజాబీ సుబా అంశాన్ని మళ్లీ పైకి తేవడం దురదృష్టకరం. పంజాబ్ ఐక్యత కాపాడాలన్నా, పొరుగుదేశం కుట్రల నుండి కాపాడుకోవాలనుకున్నా పంజాబ్‌ను విడగొట్టకూడదు' అని తీర్మానం చేసింది. కానీ మార్చి కల్లా పంజాబ్‌ను విడగొట్టడానికి కేంద్రం నిర్ణయించింది. యిది ప్రజాభీష్టానికి వ్యతిరేకమైన చర్య అని మేలో జలంధర్‌లో జరిగిన సమావేశంలో జనసంఘ్ తీర్మానం చేసింది. ఏదిఏమైనా పంజాబ్ రాష్ట్రం పంజాబ్, హరియాణాలుగా విడిపోయింది. కాలక్రమంలో జనసంఘ్ ఉత్తరరూపమైన బిజెపి కాంగ్రెసును ఓడించడానికి అకాలీదళ్‌తో చేతులు కలిపింది. రాజకీయకారణాలతో పంజాబీ భాషను యిలా వ్యతిరేకించిన జనసంఘ్ ఉర్దూ పట్ల ఎటువంటి ధోరణి ప్రదర్శించి వుంటుందో వూహించుకోవచ్చు. ఢిల్లీ, యుపి, బిహార్ రాష్ట్రాలలో ఉర్దూని అధికారభాషగా గుర్తించాలని 1952 డిసెంబర్లో డిమాండ్ వచ్చినపుడు పార్టీ తన జాతీయ సమావేశంలో దాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానం యిలా సాగింది – 'ఉర్దూ ఒక కృతకమైన భాష (ట్రంప్‌డ్ అప్ లాంగ్వేజ్). దేశ ఐక్యతను బలహీనపరచడానికి విదేశీ పాలకులు హిందీని విదేశీ పదాలతో, విదేశీ ఆలోచనలతో కలుషితపరచి తయారుచేసిన భాష. దాన్ని అధికారభాషగా గుర్తించాలనే ఉద్యమానికి వెనక్కాల జాతివ్యతిరేక, విచ్ఛిన్నకరశక్తులున్నాయి.'
ఇక ఆలీగఢ్ ముస్లిము యూనివర్శిటీకి వ్యతిరేకంగా చాలా ప్రచారమే చేసింది. దానిలో ఉపాధ్యాయులను, అధికారులను క్షుణ్ణంగా పరిశీలించి (స్కాన్ చేసి) వారి మనోభావాలు గ్రహించి జాతివ్యతిరేక శక్తులను తొలగించివేసేయాలంది. జాతివ్యతిరేక శక్తులు అనే పదాన్ని వారు ఏ మతస్తులను దృష్టిలో పెట్టుకుని అన్నారో అందరికీ తెలుసు. ఎటొచ్చీ లిఖితపూర్వకంగా ప్రకటనలు యిచ్చేటప్పుడు ముస్లిములందరినీ అనలేక, 'ముస్లిములలో ఒక వర్గం..' అని క్వాలిఫై చేసేవారు. 1969 డిసెంబరులో జాతీయ సమావేశంలో చేసిన తీర్మానంలో 'దేశవిభజనకు దారి తీసిన భావజాలానికి కట్టుబడిన ముస్లిములలో ఒక వర్గంవారు మతకలహాలకు కారణం. విదేశీ శక్తి సహాయంతో వారు యితర ముస్లిములు జాతీయస్రవంతిలో కలవకుండా వారు అడ్డుపడుతూ వుంటారు. వారికి కమ్యూనిస్టులు, కాంగ్రెసులో ఒక వర్గం సహాయపడుతూ వుంటారు' అన్నారు. ఇక ౖకైస్తవుల విషయానికి వస్తే మతమార్పిడుల విషయంలో పార్టీ మాటిమాటికి ఆందోళన వ్యక్తం చేసింది. 'ఆసాం, అరుణాచలప్రదేశ్ (అప్పట్లో నేఫా అనేవారు)లలోని క్రైస్తవ మిషనరీలు చైనా, పాకిస్తాన్‌లతో చేతులు కలిపి ఆ రాష్ట్రాలను కైవసం చేసుకుందామని చూస్తున్నాయి కాబట్టి మిషనరీలను అక్కణ్నుంచి బహిష్కరించాలి' అని 1968 జూన్‌లో తీర్మానం చేసింది. (సశేషం) (ఫోటో – వాజపేయి)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)