కోపం వస్తే కొట్టడాలు, ఇంకా మితి మీరితే తుపాకీ గట్రా పట్టుకుని హీరోలే హంగామా చేస్తారని, నిజజీవితంలో కూడా తాము హీరోలుగా అనుకోవడమే దీనికి కారణమని పలువరు అంటుంటారు. అయితే కొందరు నటీమణులు కూడా ఈ విషయంలో హీరోలకు తామేం తీసిపోమని నిరూపిస్తున్నారు.
తాజాగా గత ఆదివారం రాత్రి న్యూఢిల్లీలో జరిగిన సంఘటన దీనికో ఉదాహరణ. మోడల్‌గా, టివి నటిగా, బిగ్‌బాస్ సీజన్ 5 లో పాల్గొనడం ద్వారా పాప్యులరైన నటి పూజా మిశ్రా కరోల్ భాగ్‌లోని ఒక లీడింగ్ స్టోర్‌కి షాపింగ్‌కి వెళ్లారు. అక్కడ అనుకోకుండా మరో షాపర్‌తో వాగ్వాదం చోటు చేసుకుందామెకి. ఆ గొడవ ముదిరి పాకాన పడింది.
ఈ సమయంలో షాపింగ్ మాల్ స్టాఫ్ సైతం అవతలి వ్యక్తికి మద్ధతుగా మాట్లాడడంతో కోపం నషాళానికి అంటిన పూజా… వాళ్లపై చేయి జేసుకుంది. అంతటితో ఊరుకోకుండా హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రివాల్వర్ తీసింది. ఒక్క మాట ఎక్కువ తక్కువ మాట్లాడితే కాల్చి పారేస్తానంటూ బెదిరించింది.
అలా హంగామా సృష్టించిన ఈ నటి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ… విషయం ఆ నోటా ఈ నోటా వినడంతో పాటు ఆయుధంతో బెదిరింపు అనేది పెద్ద విషయం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం మాల్‌లో ఉన్న సిసి ఫుటేజిని స్వాధీనం చేసుకున్నారు. అందులో నటి వీరంగం స్పష్టంగా నమోదైనట్టు పోలీసులు చెప్పారు. అయితే పూజామిశ్రాపై ఇంతవరకూ లిఖిత పూర్వక ఫిర్యాదు అందకపోవడంతో ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని సమాచారం.