''ఎమ్బీయస్ కథలు'' శీర్షికలో యిటీవల అన్నీ అనువాద కథలు యిస్తున్నాను. ''ఆఖరి కోరిక'' కథ కింద వ్యాఖ్య రాస్తూ ఒక పాఠకుడు ఆ కథకు మూలమైన ''మంకీస్ పా'' కథ 1997లో (నేను అనువాదం చేసిన సంవత్సరం) అరుదైనదేమో కానీ యిప్పుడు ఇంటర్నెట్‌లో విరివిగా దొరుకుతోందని, మూలకథే చదువుకోగల స్థితిలో పాఠకులు వున్నారనీ రాశారు. మొదటగా చెప్పవలసినది – 1997లో కూడా అది అరుదైన, అలభ్యమైన కథ కాదు. హైస్కూలు స్థాయి పాఠ్యపుస్తకాల్లో కొన్నేళ్లపాటు పాఠ్యాంశంగా వుంది. అంతమాత్రం చేత అందరూ ఆ కథ చదివేశారని కాదు. ఆ మాట కొస్తే యిప్పటికీ అందరూ చదివేశారని కాదు.
నిజమే యింటర్నెట్‌లో యిదే కాదు, అనేక కథలు విరివిగా, అతి సులభంగా దొరుకుతున్నాయి. అయితే డబ్ల్యు. డబ్ల్యు. జాకబ్ అనే ఒక మంచి రచయిత వున్నాడని అతను ''మంకీస్ పా'' అనే గొప్ప కథ రాశాడని ఎవరైనా మనకు చెప్పాలి కదా. అప్పుడే వెతుకుతాం. ఎవరైనా గొప్ప కథ అని రికమెండ్ చేస్తే మనకు అనుమానం – అతనికి గొప్ప అనిపించినది మనకు చెత్త అనిపిస్తుందేమోనని. అందుకే అనువాదం చేసి ముందు పెడుతున్నాం. ఇది రుచి చూసి నచ్చితే ఒరిజినల్ కథ చదవవచ్చు, అంతటితో ఆగకుండా జాకబ్ యితర కథలు కూడా చదవవచ్చు. నాకు నచ్చిన ఉడ్‌హౌస్, డరోతీ పార్కర్, స్టీఫెన్ లీకాక్ వంటి కొందరు హాస్య రచయితల రచనలు తెలుగులో అందిస్తున్నాను. మాతృభాషలో కాబట్టి త్వరగా చదివి స్వారస్యం గ్రహించవచ్చు. నచ్చితే ఆ రచయితల యితర రచనలకై వేటాడవచ్చు. నిజానికి హాస్యరచనలను మూలభాషలో చదవగలిగితే ఆ ఆనందమే వేరు. ఇంగ్లీషులో చదివే శక్తి, ఆసక్తి లేనివారు తెలుగుతోనే సరిపెట్టవచ్చు. ఇది ప్రపంచమంతా వున్నదే. మనం ఇంగ్లీషు నవలలుగా పొరబడే అనేక గొప్ప నవలలు ఫ్రెంచ్ నుండి అనువదింపబడినవే. మహాభారతం సంస్కృతంలో వుంది కదా, మళ్లీ తెలుగులో ఎందుకు అని కవిత్రయం అనుకుని వుంటే ఆంధ్రభారతం దక్కేది కాదు. శ్రీనాథుడు స్వతంత్రంగా గొప్ప కవి అయి వుండి కూడా హర్షుడి ''నైషధం''ను తెలుగులోకి అనువదించాడు. సొంత రచనలు చేసేవారు కూడా అనువాదాలను తక్కువగా చూడలేదు – అప్పుడూ యిప్పుడూ కూడా!
తెలుగువాళ్లు అనువాదాలను ఎప్పుడూ ఆదరించారు. 1950లలోనే ఆంధ్రపత్రిక వీక్లీ ప్రసిద్ధ ఆంగ్ల, ఫ్రెంచ్ నవలలను తెలుగులోకి అనువదింప చేసింది. నేను ''టామ్ సాయర్'' తెలుగు అనువాదాన్ని హైస్కూలు రోజుల్లో చదివాను. తర్వాత కాస్త ఇంగ్లీషు వంటపట్టాక ఒరిజినల్ చదివాను. ''టామ్ సాయర్'' తొలి తమిళ అనువాదం తెలుగులోకి వచ్చిన దాదాపు 40 ఏళ్లకు వచ్చింది. తమిళంలో శరత్ నవలలు, రవీంద్రుడి నవలలు తప్ప యితర భారతీయ భాషల్లోని రచనలను తమిళులు పెద్దగా దిగుమతి చేసుకోలేదని నా పరిశీలన. తెలుగు వాళ్ల లాగానే కన్నడం వాళ్లు అనువాదాలను ధారాళంగా ఆమోదిస్తారు. కానీ అనువాద కథలే ప్రధానంగా నడిచే ''విపుల'' వంటి పత్రిక మరే యితర భాషలోను వుంటుందనుకోను. హిందీ నుంచి తెలుగు వాళ్లు అనేక అనువాదాలు చేశారు కానీ హిందీ మాతృభాషగా కలవారు తెలుగు నుంచి హిందీలోకి అనువాదం చేయలేదు. మాతృభాషలోకి కాల్పనిక రచనలు చేసేవారు అనువాదాలు చేస్తే అవి అందంగా వుంటాయి. ఇంగ్లీషు మన మాతృభాష కాదు కదా, ఇంగ్లీషు వాళ్లు మన భాష నేర్చుకుని అనువాదాలు చేయాలంటే అది ఎప్పటికి సాధ్యపడేను? ఇంగ్లీషులో ఫిక్షన్ రాసే తెలుగువారు తెలుగు పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తే అవి బాగుంటాయి. ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన అనువాదానికి ఉపక్రమిస్తే సొగసు వుండదు.
ఇతర భాషల్లో నుంచి అనువాదం చేసేటప్పుడు నేను నుడికారం గురించి, నేటివిటీ గురించి చాలా జాగ్రత్తగా వుంటాను. నేను వాడే తెలుగు జాతీయాలు ఇంగ్లీషు లేదా హిందీ రచనల్లో వుండవు. వారి భావాన్ని గ్రహించి తెలుగువాడైతే ఎలా రాస్తాడు అనుకుని ఆ ధోరణిలో రాస్తాను. అది ఒక కష్టమైన ప్రక్రియ. టైము బాగా పట్టినా అనువాదాలు చేయడం నాకిష్టం. ప్రపంచంలో యింతమంది గొప్ప రచయితలున్నారు సుమా, రుచి చూడండి అని పాఠకులకు చెప్పడంలో తృప్తి పొందుతాను. నా ప్రొఫైల్ రాసుకునేటప్పుడు 'అనువాదకుడు' అని కూడా రాసుకుంటాను. తెలుగులో రానురాను అనువాదాలకు ఆదరణ తగ్గింది. ''విపుల'' తప్ప పత్రికలు ప్రోత్సాహించడం మానేశాయి. ఈ మధ్యే ''నవ్య'' అనువాద కథలు వేస్తోంది. ప్రసిద్ధ విదేశీ నవలలను అనువాదం చేసి సీరియల్‌గా వేయటం లేదు. వాటి కథను సంక్షిప్తంగా చెప్పే వ్యాసాలను నవలా పరిచయం పేర ''ఆంధ్రభూమి'' వీక్లీ కొన్నేళ్ల క్రితం వేసింది. ''నవ్య'' యిటీవల ఆ ప్రయత్నం చేసింది. పాఠకుడి మేధోవిస్తృతికి యీ ప్రయత్నాలు దోహదపడతాయి.
మళ్లీ ''ఆఖరి కోరిక'' కథ వద్దకు వస్తాను. ఇంగ్లీషు కథల్లో, సినిమా డైలాగుల్లో క్లుప్తత, క్రిస్ప్‌నెస్ వుంటుంది. సాధారణ తెలుగు పాఠకులకు భావం పూర్తిగా బోధపడదు. మన వాళ్లకు కాస్త వివరణ అవసరం. ఇంగ్లీషు భాషలో ఒక్క పదం తెలియకపోయినా స్వారస్యం బోధపడదు. పుస్తకం చదువుతూ మధ్యలో వెళ్లి డిక్షనరీ చూసే అలవాటు నూటికి ఒకరికైనా వుందో లేదో. సందర్భం బట్టి వూహించేద్దాం అనుకుంటూ కథ చదివేసి, చివర్లో నోరు చప్పరించేయవచ్చు. ఆఖరి కోరిక కథ తెలుగులోనే చాలామందికి అర్థం కాలేదు. ఇంగ్లీషులో అయితే యింకా గందరగోళ పడేవారు. కథ ముగింపు అర్థం కాక వివరించమంటూ నాకు మెయిల్స్ రాశారు కొంతమంది. ఆ కథలో వున్నది అద్భుతరసం. రెండో కోరిక కారణంగా చనిపోయిన కొడుకు తిరిగి వచ్చాడు, మూడో కోరిక కారణంగా తిరిగి వెళ్లిపోయాడు అని అనుకోవచ్చు, లేదా కోరిక నెరవేరడం అనేది ట్రాష్, మొదటి కోరిక నెరవేరడం కాకతాళీయం అనుకోవచ్చు. అతీంద్రియ శక్తులున్నాయో లేదో యితమిత్థంగా చెప్పకుండా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కథ అది.
''కొండూర'' అనే మరాఠీ కథలో యిలాటి చిక్కుముడే వుంటుంది. దాని ఆధారంగా శ్యామ్ బెనగల్ ''అనుగ్రహం'' అని తెలుగులో వాణిశ్రీ హీరోయిన్‌గా సినిమా తీశారు. జనాలకు అర్థం కాక, సినిమా ఆడలేదు. నిజానికి అద్భుతరసంలో మన తెలుగులో కథలు చాలా అరుదుగా వున్నాయి. ''నవరసాల శ్రీశ్రీ'' పేరుతో శ్రీశ్రీ నవరసాల్లో కథలు రాశారు. నన్నడిగితే శ్రీశ్రీ మహాకవే కానీ గొప్ప కథకుడేమీ కాదు. కోనేటిరావు కథలు కొత్తగా వుంటాయి. ఆయన అనువాద కథలు కూడా నన్ను ఆకట్టుకోలేదు. ఈ నవరసాల కథల్లో అద్భుతరసం కింద మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో భద్రపరిచిన లెనిన్ శవం మాయమైందని, దానికి ప్రాణప్రతిష్ట జరపడానికి ప్రయత్నాలు జరిగాయనీ, అయితే ఏవో అవాంతరాలు వచ్చి మళ్లీ శవంగా మార్చేశారనీ కథ కల్పించారు. కథ అంతంత మాత్రంగానే వుంటుంది.
నా వరకు అద్భుతరసంలో కథలు రాయాలన్న సరదా వుంది. 16 ఏళ్ల క్రితమే ''అద్భుత రసయామిని'' అనే కథామాలిక ప్లాన్ చేశాను. ఒక ముఖ్యమంత్రిగారు రాష్ట్ర పర్యటనలో వుండగా సడన్‌గా తుపాను రావడంతో ఒక బంగళాలో రాత్రంతా గడపవలసి వస్తుంది. ఆ బంగళాలో దెయ్యాలున్నాయా అని చర్చ మొదలై, అసలు దెయ్యాలున్నాయా, అతీంద్రియ శక్తులున్నాయా, వివరించలేని కొన్ని సంఘటనలు ఎందుకు, ఎలా జరుగుతాయి అని తర్కించుకుంటూ ఒక్కొక్కరు తమకు ఎదురైన వింత అనుభవాలను చెప్తారు. అవన్నీ అద్భుతరసంలో వుండాలి. ఇదీ స్కీము. అతి కష్టం మీద ఆరేడు రాయగలిగాను. కనీసం పదమూడైనా లేకపోతే సీరియల్ ఎవరూ వేసుకోరు. మంచి థీమ్‌లు తట్టినప్పుడే తక్కినవి రాద్దామనుకుని ఆ కథలను అలాగే అట్టిపెట్టాను. ఎక్కడా వుపయోగించలేదు. చెప్పవచ్చేదేమిటంటే అద్భుతరసం అంత క్లిష్టమైన ప్రక్రియ. వాటిల్లో ఎన్నదగిన కథ ''ఆఖరి కోరిక''. వీలైతే ఒరిజినల్ చదవండి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)