ఆ ఒక్కటీ అడక్కు !
నమస్కార్ !మోడీజీ!
నమష్కార్ .
మీ పేరు దేశమంతా మార్మోగి పోతోంది.
అవును నా వెబ్‌సైట్‌లో చూస్తున్నాను. అందరూ ఒకటే పొగుడుతున్నారు.
అహహ నేననేది పొగడటం గురించి కాద్సార్ తెగడటం గురించి
తెగడుతున్నారా? ఎందుకు?
ఎలక్షన్ ప్రామిస్లు మిస్ కొట్టినందుకు
వాట్? ఎలెక్షన్ ప్రామిస్లు మిస్ కొట్టానా? ఇంపాజిబుల్! ప్రామిస్ లన్నీ నెరవేర్చా కొంచం అటూ ఇటుగా
ఎక్కడ సార్?విదేశాల్లో బ్లాక్మనీ దాచుకున్న వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టి ఆ డబ్బంతా వాపస్ తెస్తానన్నారు-ఇంతవరకూ ఏమీ చేయలేదు.
ఆ ఒక్కటీ చేయాలంటే ఒక చిన్న ప్రాబ్లెం ఉంది
ఏమిటది?
ఆ లిస్టులో మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా-ఇంకెలా బయట పెడతాం? మా వాళ్ళు అన్నీ సర్దుకున్నాక అప్పుడు బయట పెడతాం.
ఆలోగా మిగతా పార్టీ వాళ్ళు కూడా అన్నీసర్దుకుంటారుగా ఇంకా జైలుకెవరెల్తారు?
ఆ ప్రామిస్ నెరవేర్చటంలో ప్రాబ్లెం ఉంది గనుకే దాని బదులు ఎన్నికల్లో ప్రామిస్ చేయక పోయినా ఒక బోనస్ ప్రామిస్ నెరవేరుస్తున్నాం .
చాలా గొప్ప విషయం సార్ అదేమిటో తెలుసుకోవచ్చా?
అదే అయోధ్యలో రామ మందిరం కడతాం.
అదేంటి సార్? దేశంలో విదేశీ పెట్టు బడులూ కొత్త ప్రాజెక్ట్‌లూ, వాటి వల్ల లక్షల ఉద్యోగాలూ వస్తాయన్నారుగా ఇప్పు డది వదిలేసి మందిర్ అంటారేమిటి?
మీకేం తెలివుందా లేదా? మన దేశంలో ఒక్క గుడి కడితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయో తెలీదా? పూజారి ఉద్యోగాలూ, దుకాణాలూ, హోటళ్ళూ-వాళ్లకు దళారులూ- టూరిజంఅభివృద్ది అవుతుంది. రాముడి గుడి దగ్గర బోలెడు మంది బిచ్చ గాళ్ళకు కూడా భక్తులు దానాలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. బిచ్చగాళ్ళు కూడా మా హయాంలో ఉద్యోగుల కింద లెక్కే -అర్ధమయిందా?
అయింది సార్ కానీ మీరు ఎలక్షన్స్‌కి ముందు చెప్పింది వేరు కదా-యువకులందరికీ వద్దంటే ఉద్యోగాలని! దాని సంగతి తేల్చండి ముందు
ఆ ఒక్కటీ అడక్కు
పదవిలోకి రాగానే ప్రాణ త్యాగాలు చేసే మన జవాన్‌లకు వన్‌రాంక్ వన్ పెన్షన్ స్కీం మంజూరు చేస్తామన్నారు కదా?అదెందుకు చేయలేదు?
ఎన్నికల ప్రామిస్‌లు అయిదేళ్ళల్లో ఎప్పుడయినా అమలు చేస్తాం. అది మాఇష్టం. అడగడానికి ఎవడికీ హక్కు లేదు. అయినా దాని బదులు మతమార్పిడికి వ్యతిరేకంగా చట్టంతేబోతున్నాం. అది చాలా గొప్ప కార్యక్రమం కదా?అదీగాక ఇంకో బోనస్ ప్రజల కోసం చేసిందేంటంటే స్వచ్ భారత్- సారూ నేనడిగేది ప్రాణ త్యాగాలు చేసే మన జవాన్‌లకు వన్‌రాంక్ వన్ పెన్షన్ స్కీంగురించి సార్
ఆ ఒక్కటీ అడక్కు
సరే మరి పదవిలోకిరాగానే అవినీతిని అంతం చేస్తానని ప్రామిస్ చేసారు కదా?
అంతం చేసాం కదా అవినీతి లేకుండా కోల్ అమ్మేసాం. స్పెక్ట్రం అమ్మేసాం. కాంగ్రెసోళ్ళు చేసిన అవినీతికి వాళ్ళమీద కేసులు పెట్టాం.
మరి బీజేపీలో అవినీతి సంగతేంటి?
మా బీజేపీలో అవినీతి ఎక్కడుంది?
రాజే, సుష్మా అవినీతికి పాల్పడే కదా 16 ఈడీ కేసులున్న అవినీతి దొంగ లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్స్ మంజూరు చేసారు? అంటే అదంతా అవినీతి కనక్షనే కదా?
అది అవినీతి అని రుజువులు లేవు కదా?
లేకపోవటం ఏమిటి? మొదటి నుంచీ సుష్మా స్వరాజ్ అవినీతికి హెడ్ క్వార్టర్స్ అని అందరికీ తెలుసు. అసలు అవినీతి రాణి సుష్మాకి మైనింగ్ డాన్ జనార్ధన్ రెడ్డికీ అవినీతి యువరాజ్ జగన్కీ ఎప్పటి నుంచో అవినీతి కనెక్షన్స్ ఉన్నాయని తెలిసీ మంత్రి పదవి ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆ డాకూ రాణి మన దేశం తాలూకూ క్రిమినల్ లలిత్‌కి పాస్ పోర్ట్ ఇమ్మని బ్రిటిష్ హై కమిషనర్‌కి రికమెండ్ చేసిందంటే సృష్టంగా అది అవినీతి వ్యవహారం అని గుడ్డివాడికి కూడా తెలుస్తుంది. మరి మీకెలా తెలీటం లేదు?
ఇదిగో చూడు మేము కాంగ్రెస్‌లో అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామన్నాం గానీ మా బీజేపీలో అవినీతికి వ్యతిరేకంగా కాదు.
అంటే మీ మంత్రులలో కూడా అవినీతి ఉన్నట్లు వప్పుకుంటున్నారా?
ఆ ఒక్కటీ అడక్కు.
యర్రం శెట్టి సాయి