భరతుడు భరతుడిలా వుండటం లేదు

గతంలో జయలలిత తను పదవి నుంచి తప్పుకోవలసి వచ్చినపుడు పన్నీర్‌ శెల్వంకు అప్పగించి వెళ్లింది. అతను భరతుడి లెవెల్లో ఆవిడ పాదుకలతో రాజ్యం నడిపి, వనవాసం పూర్తయిన వెంటనే మళ్లీ సింహాసనం అప్పగించేశాడు. అందుకే…

గతంలో జయలలిత తను పదవి నుంచి తప్పుకోవలసి వచ్చినపుడు పన్నీర్‌ శెల్వంకు అప్పగించి వెళ్లింది. అతను భరతుడి లెవెల్లో ఆవిడ పాదుకలతో రాజ్యం నడిపి, వనవాసం పూర్తయిన వెంటనే మళ్లీ సింహాసనం అప్పగించేశాడు. అందుకే ప్రస్తుతం మళ్లీ అతనికే అప్పగించింది. మే పార్లమెంటు ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తన అనుచరుడు, మహా దళితుడు ఐన జితన్‌ మాంరీ­ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు. వచ్చే ఏడాది అక్టోబరు ఎన్నికలలో జరగబోయే ఎసెంబ్లీ ఎన్నికలలో నెగ్గాక, మళ్లీ పదవి చేపడదామని, అప్పటిదాకా వేరెవ్వరూ తన్నుకుపోకుండా యీ భరతుణ్ని కూర్చోబెట్టానని అనుకున్నాడు. జనాభాలో 30% వున్న బిసి ఓటుకు తోడుగా మాంరీ­ని ముఖ్యమంత్రి చేయడం ద్వారా జనాభాలో 16% వున్న దళితులు ఓట్లు కూడా తమ పార్టీకి పడతాయని, తమ పార్టీకి విజయం ఖాయమని అనుకున్నాడు. 

అయితే మాంరీ­ గట్టిపిండంగా తేలాడు. అవసరం తీరాక నితీశ్‌ తనను కరివేపాకులా పడేస్తాడు కాబట్టి, దళిత కార్డుతో తను బలపడాలని నిశ్చయించుకున్నాడు. అతను కాంగ్రెసు పార్టీలో చేరి, లాలూ పార్టీకి మారి, అక్కడ నుంచి నితీశ్‌ పార్టీకి వలస వచ్చాడు. పదవి దక్కాక ఓ నెల్లాళ్లు పాటు మెత్తగా వుండి ఆ తర్వాత ఎడ్మినిస్ట్రేషన్‌  పై తన ముద్ర వేయసాగాడు. దసరా ఉత్సవంలో గలభా జరిగిన పట్నా జిల్లాలో అధికారగణాన్నంతటినీ మార్చిపారేశాడు. విధులకు సరిగ్గా హాజరుకాని డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నాడు. దీనితో బాటు తన పదవీకాంక్షను కూడా చాటుకుంటున్నాడు. ''నేను బిహార్‌కు మూడో దళిత ముఖ్యమంత్రిని. ఎంతో కష్టపడి యీ స్థానానికి వచ్చాను. ఎవరు చూడవచ్చారు, రేపు నేను ప్రధాని కూడా కావచ్చు'' అన్నాడు ఓ మీటింగులో. 

సొంత ప్రాంతమైన గయకు వెళ్లి అక్కడి సభలో ''కాబోయే ముఖ్యమంత్రి యీ ప్రాంతానికి చెందినవాడే అవుతాడు'' అన్నాడు. దళితులను ఆకట్టుకోవాలంటే తీవ్రమైన భాష వుపయోగించాలని అనుకుని అప్పుడప్పుడు తిక్కతిక్కగా కూడా మాట్లాడుతున్నాడు. ''అగ్రవర్ణస్తులందరూ విదేశీయులే'', ''బీదలకు సరిగ్గా చికిత్స చేయని డాక్టర్ల చేతులు నరికేస్తాను'', ''మహాదళితులారా, మీకు తాగాలని అనిపిస్తే తాగుడు మానక్కరలేదు, మితంగా తీసుకోండి'', ''దళితులు వాళ్ల పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నారు'' – యిలాటి స్టేటుమెంట్లు విసురుతున్నాడు. నితీశ్‌ యితన్ని తీసేసి మరొకర్ని పెట్టలేడు. 'వేసేటప్పుడు వేపకొమ్మ, తీసేటప్పుడు అమ్మోరు' లా యితన్ని దింపేస్తే దళితులకు కోపం వస్తుందేమోనని భయం. తక్కిన అనుచరులలో దళితులు ఎవరూ లేరు. అందుకని పళ్లు నూరుకుంటూ భరిస్తున్నాడు. జనతా పరివార్‌ పేరుతో లాలూతో చేతులు కలిపి పార్టీని బలోపేతం చేసుకుంటే యీ మారీ­ లాటి వాళ్లను లెక్క చేయనక్కరలేదని అతని ఆశ.

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]