టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్‌కి కొదవే లేదు. కానీ, మెగాస్టార్ చిరంజీవికి కథ దొరకడంలేదు. వినాయక్‌తో చిరంజీవి చేస్తారంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇది ఇప్పటి మాట కాదు.. ఆరేళ్ళ క్రితం నాటి మాట. రాజకీయాల్లోకి వచ్చాక, చిరంజీవి ఇదిగో అదిగో.. అంటూనే ఆరేళ్ళు గడిపేశారుగానీ, ఆయన నటించే 150వ సినిమా సెట్స్‌పైకి ఇంకా రాలేదు.. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు.
నిన్న రజనీకాంత్ హీరోగా నటించిన ‘లింగా’ తెలుగు వెర్షన్ ఆడియో విడుదల వేడుక కార్యక్రమంలో, అల్లు అరవింద్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, ‘ముందు మీ చిరంజీవిగారి సంగతి చూడండి.. ఆయన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు..’ అని సరదా సలహా ఒకటిచ్చారు రజనీకాంత్. ఆ సమాధానానికి అల్లు అరవింద్ ఒకింత షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది.
కథల కొరత సీనియర్ హీరోలకు ఏ రేంజ్లో వుందో చెప్పడానికి రజనీకాంత్ వ్యాఖ్యలే నిదర్శనం. కొంచెం గ్యాప్ వస్తే, ఆ తర్వాత ఏ సినిమాలో నటించాలన్నదానిపై సీనియర్ హీరోలు కిందా మీదా పడాల్సి వస్తుంది. రజనీకాంత్ అనారోగ్యంతో గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించడానికి నానా తంటాలూ పడ్డారు. చిరంజీవి రాజకీయాల కారణంగా, సినిమాలకు దూరమై.. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంటున్నా, ఆయన కథల్ని ఫైనలైజ్ చేసుకోలేని కన్ఫ్యూజన్లో వున్నారు.
‘రాజమౌళితో చేయాలని వుంది..’ అని బాహాటంగా రజనీకాంత్ ప్రకించిన దరిమిలా.. బాహుబలి తర్వాత, రజనీకాంత్ విజ్ఞప్తిని రాజమౌళి పరిశీలిస్తాడేమో చూడాలి. పనిలో పనిగా చిరంజీవి కూడా, రాజమౌళి కోసం ట్రై చేస్తే బెటరేమో. ఎందుకంటే, చిరంజీవిని డీల్ చేయగలిగే దర్శకుల్లో రాజమౌళి మాత్రమే కన్పిస్తున్నాడిప్పుడు అందరికీ.