ఢిల్లీ చాలాకాలం పాటు కేంద్రపాలిత ప్రాంతంగా వుంది. దానికి రాష్ట్రస్థాయి కల్పించాలని బిజెపి చాలాకాలం పోరాడింది. చివరకు అర్ధరాష్ట్ర స్థాయి ఇచ్చారు. శాంతిభద్రతల వంటి కొన్ని అధికారాలు కేంద్రం చేతిలో, మరికొన్ని రాష్ట్రప్రభుత్వం చేతిలో! కేంద్రం తరఫున లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) వుంటారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి వుంటారు. వీళ్లిద్దరి మధ్య తగాదాలు రావడం కొత్తకాదు కానీ, ఇప్పుడు అవి పరాకాష్ఠకు చేరాయి. కేంద్రంలో యుపిఏ వున్నంతకాలం అధికారాలన్నీ గుప్పిట్లో పెట్టుకుందని, ఢిల్లీకి రాష్ట్రస్థాయి కల్పించలేదని తీవ్రంగా విమర్శించిన బిజెపి ఇప్పుడు తనకు కేంద్రంలో అధికారం దక్కాక, ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారాలు దఖలు పరచడానికి ఇచ్చగించటం లేదు. తమను చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీకి వేస్తున్న శిక్షకాబోలు, ఎల్‌జి ద్వారా ముఖ్యమంత్రిని తీవ్రస్థాయిలో సతాయిస్తోంది. అరవింద్ మాత్రం అప్పుడూ యిప్పుడూ ఒకే మాట – ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి వుండాలని! (తనే ప్రధాని అయితే అప్పుడేం చేస్తాడో!) 2013-14లో మొదటిసారి 49 రోజులు ముఖ్యమంత్రిగా వుండే రోజుల్లో ఢిల్లీ పోలీసుపై రాష్ట్రప్రభుత్వానికి అదుపు వుండాలని డిమాండ్ చేస్తూ రైల్ భవన్ ఎదుట ధర్నా చేశాడు. ఇప్పుడూ అంతే! మే 27 న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎల్‌జి అధికారాలకు పరిమితి వుండాలని వాదిస్తున్నాడు. అదే సమావేశంలో ఆమ్‌ఆద్మీ శాసనసభ్యుడొకడు, పార్లమెంటు రాష్ట్రపతిని అభిశంసించినట్లే, అసెంబ్లీ ఎల్‌జిని అభిశంసించే వెసులుబాటు కల్పించేట్లా రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించాడు.
రాష్ట్ర నిర్వహణకు అత్యంత కీలకమైన వ్యక్తి చీఫ్ సెక్రటరీ. ఢిల్లీ రాష్ట్రానికి ఆ పదవిలో వున్న కెకె శర్మ పది రోజుల సెలవులో వెళ్లినపుడు అతని స్థానంలో అనేకమంది సీనియర్లను విస్మరించి ఎల్‌జి శకుంతలా గామ్లిన్‌ను నియమించాడు. శకుంతల నియామకాన్ని అరవింద్ వ్యతిరేకించాడు. పరిమళ్ రాయ్‌ను నియమించాలని అతని కోరిక. ఐయేయస్ ఆఫీసరుగా పనిచేసి, తర్వాత రిలయన్సు ఇండస్ట్రీస్‌లో పనిచేసి, యుపిఏ హయాంలో 2013లో ఎల్‌జిగా నియమితుడైన నజీబ్ జంగ్ ఆ కోరికను తిరస్కరించాడు. ఢిల్లీలో విద్యుత్, నీటి సరఫరా ప్రధాన సమస్యలు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు రిలయన్సు వంటి ప్రయివేటు కార్పోరేట్ల చేతిలో వున్నాయి. వాళ్లు తమకు ఋణాలు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం హామీ ఇచ్చి లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. అరవింద్, రాష్ట్ర విద్యుత్ మంత్రి సత్యేంద్ర జైన్ ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు శకుంతల రూ.11 వేల కోట్ల లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు జైన్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఎక్కడ అవినీతి జరిగినా చెప్పండి, అధికారుల భరతం పడతానంటూ అరవింద్ ప్రజలను కోరగా కేంద్ర ఉద్యోగుల జోలికి రాష్ట్ర ఎసిబి (అవినీతి నిరోధక శాఖ) వెళ్లడానికి వీల్లేదంటూ కేంద్ర హోంశాఖ మే 21న ఒక గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇది అవినీతిపరులను వెనేకసుకుని రావడం కాకపోతే మరేమిటని ఆమ్‌ఆద్మీ పార్టీ విరుచుకు పడింది. ఎల్‌జి ఆదేశాలను ఉన్నతాధికారులెవరూ మన్నించనక్కరలేదంటూ తన ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా అరవింద్ ప్రిన్సిపల్ సెక్రటరీ (సర్వీసెస్) ఆఫీసు మూసివేయించి ఎల్‌జి ఆదేశాలు వేరెవరికీ చేరకుండా చేశాడు. దానిపై ఎల్‌జి సిఎంను ఉద్దేశించి ఒక ఘాటైన లేఖ రాశాడు. ఢిల్లీ సిబ్బందిలో స్టెనో నుండి సిఎస్ దాకా ఎవరినైనా సరే నియమించే, బదిలీ చేసే, తీసేసే హక్కు తనకుందని దానిలో రాశారు. అది పట్టుకుని అరవింద్ ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ హైకోర్టు హోంశాఖ నోటిఫికేషన్‌పై వ్యాఖ్యానిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర ఉద్యోగుల అవినీతిని విచారించే హక్కు వుందని చెప్పింది. దానిపై కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి మూడు వారాల్లో బదులిమ్మంది. ఈలోగా హైకోర్టు తీర్పును నిలిపివేయమని కేంద్రం అడిగితే సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. అలా అంటూనే అది ప్రయోగాత్మకమే తప్ప, విధాయకం కాదంది. (టెన్టేటివ్, వుడ్ నాట్ బి బైండింగ్). ఇప్పటికే ఢిల్లీ స్థాయి గురించి న్యాయకోవిదులు వెలువరిస్తున్న భిన్నాభిప్రాయాల గందరగోళానికి కోర్టు వ్యాఖ్యానం తోడైంది. నేషనల్ కాపిటల్ టెరిటరీ యాక్ట్‌లోని ఆర్టికల్ 293ఎఎ (4) ప్రకారం ‘ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం లెఫ్టినెంట్ గవర్నరుకు నిర్వహణలో సలహా, సహాయాలు (ఎయిడ్ అంట్ ఎడ్వయిజ్) అందిస్తారు’ అని వుంది కాబట్టి అధికారం నాదే, వాళ్ల పని సలహాలు ఇవ్వడం వరేక, వినాల్సిన బాధ్యత నాకు లేదు’ అంటున్నాడు ఎల్‌జి. ‘స్వాతంత్య్రం వచ్చాక ఏ పార్టీకి రానట్లుగా 54% ఓట్లు, 96% సీట్లు తెచ్చుకున్న పార్టీ ఎంచుకున్న ప్రభుత్వం మాట పెడచెవిన పెట్టడానికి ఎల్‌జి ఎవరు, అతన్ని ప్రజలు ఎన్నుకున్నారా? ఆప్‌ను గెలిపించి, ప్రజలు చీపురుతో తుడిచిపెట్టేసిన బిజెపికి చెందిన కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యేక్త కదా?’ అంటున్నారు ఆప్ తరఫున మాట్లాడే నిపుణులు. ‘సలహా, సహాయాలు అనే మాట ప్రతి గవర్నరు, రాష్ట్రపతి విషయంలో కూడా వాడతారు. వాళ్లు నామమాత్రపు పాలకుల కింద లెక్క. ఢిల్లీ ఎల్‌జి మాత్రం వాటిని అక్షరాలా పాటించేద్దామని చూడడం తప్పు’ అంటున్నారు. అరవింద్ గతంలో రిలయన్సుపై, వీరప్ప మొయిలీపై కేసులు పెట్టిన తరహాలోనే ఇప్పుడు ఒక కేంద్రమంత్రిని అరెస్టు చేయిస్తాడనే పుకారు రావడంతో కేంద్రం వివాదాన్ని ఈ స్థాయికి తెచ్చిందని వార్తలు వస్తున్నాయి.
పేరుకి ఎల్‌జితో పోరాటం అంటున్నాం కానీ ఇది ఆప్-బిజెపి మధ్య వివాదమని అందరికీ తెలుసు. తమను తుక్కుతుక్కుగా ఓడించిన ఆప్‌పై బిజెపి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ విషయంలో అది కాంగ్రెసు పోకడే పోతోంది. నిజానికి ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చినపుడు, విలువలతో కూడిన కొత్త శకం, కొత్త తరహా పాలన వస్తుందని ఎందరో ఆశ పెట్టుకున్నారు. లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే తోడ్పడిన తీరు బయటకు వచ్చాక యుపిఏకు వీరికి తేడా ఏముందనిపిస్తోంది. పలుకుబడి వున్నవారికి ఏ ప్రభుత్వంలోనైనా సరే, పనులు అయిపోతున్నాయి. లలిత్ భార్యకు కాన్సర్ కాబట్టి మానవతా దృక్పథంతో సాయం చేశానని సుష్మా చెప్పుకున్న మర్నాడే ఆమె భర్త, కూతురు లలిత్ తరఫున వాదించారని బయటకు వచ్చింది. ఇది ‘‘సండే టైమ్స్’’లో బయటకు రావడానికి కారణం మర్దోక్‌కు తనకు ఐపియల్ విషయంలో వచ్చిన తగాదా అని లలిత్ ఆరోపిస్తున్నారు. ఎలా బయటకు వచ్చినా, ఇమిగ్రేషన్‌కు వసుంధరా రాజే సాయపడ్డారని, లలిత్ భార్య చికిత్స చేయించుకున్న ఆసుపత్రితో రాజస్థాన్ ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకున్నారనీ అన్నీ తేటతెల్లమవుతున్నాయి.
లలిత్‌ను వెనక్కి రప్పించి న్యాయవిచారణ జరిపించ వలసిన ఎన్‌డిఏ ప్రభుత్వం యుపిఏ కంటె దారుణంగా అతనికి సాయపడుతోంది. మోదీ స్వచ్ఛపాలనపై ఆశలు పెట్టుకున్నవారిని నిస్పృహకు గురి చేసే ఘట్టం ఇది. కాంగ్రెసు అవినీతిని, వృథావ్యయాన్ని, నియంతృత్వ పోకడలను ఎండగట్టడంలో ఆప్, బిజెపి ఒకేలా ప్రచారం చేశాయి. మళ్లీ అదే తరహాలో నడుస్తున్నాయి. తన పార్టీని గుప్పిట్లో పెట్టుకోవడానికి అరవింద్ ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. ఆయన సహచరు గుణగణాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక చేసిందేమీ లేకపోయినా ఏడాది పాలన పూర్తయిందంటూ దేశమంతా హోరెత్తించిన మోదీ తరహాలో తనను తాను ప్రొజెక్టు చేసుకోవాలని తన వంద రోజుల పాలన పూర్తయిందంటూ ఢిల్లీ అంతా తన ఫోటోల హోర్డింగ్స్ పెట్టేసి కోర్టు చేత అక్షింతలు వేయించుకున్నాడు. అధికారం తన గుప్పిట్లో పెట్టుకోవాలని పోరాడుతూ బిజెపి, ఆప్ రెండూ ఢిల్లీ మౌలిక వసతులను పట్టించుకోవటం లేదని గుర్తించిన కాంగ్రెసు పారిశుధ్య సమస్యల గురించి లేవనెత్తింది. వెంటనే ఇద్దరూ ఉలిక్కిపడి తమ వాలంటీర్ల ద్వారా ఢిల్లీని శుభ్రపరిచే కార్యక్రమంలో పడ్డారు. కేంద్రం అర్జంటుగా దానికై నిధులు విడుదల చేసింది. వీళ్లిలా కొట్టుకుంటూనే వుంటే, ఇంకో పార్టీ రంగంలోకి రావచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)