హైదరాబాద్ ఇక నుంచి ‘హై స్పిరిట్స్’లోకి వెళ్ళబోతోంది. ఇక ఈ నగరం నిద్రపోతే వొట్టు. లైట్లు వెలుగుతూనే వుంటాయి. కారణం ఒక్కటే. మద్యం ‘ఏరులై’ కాకుండా, ‘బారులై’ పారుతుంటుంది.
వైన్‌షాపులు రాత్రి 10 గంటలేక మూసివేస్తారన్న బెంగ లేదు. 11గంటలవరకూ తెరచే వుంచుతారు. (తర్వాత కూడా షట్లర్లు మూసి వెనుకనుండి మద్యం ఎలా పొందాలో, మందుబాబులకీ తెలుసు, వైను షాఫుల వాళ్ళకీ తెలుసు. మరి ఎక్సయిజు పోలీసులకు తెలుసో లేదో తెలియదు. వారికి తెలిసినట్లు జనానికి తెలిస్తే మాత్రం కేసులు బుక్ చేస్తారు.) ఇక బార్లూ, పబ్బులూ అంటారా? ఇప్పటి వరకూ 12 గంటల వరకూ మాత్రమే తెరచి వుండేవి. అక్కడ కూడా ఇంకో గంట పెంచేసుకున్నారు.
హైదరాబాద్‌లో ‘బీర్’ బల్స్ ( అనగా బీరు సేవించి లావయ్యేవారు) ఎక్కువ. ఎంత ఎక్కువో తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఏటా మూడు కోట్ల కేసుల బీర్లను భాగ్యనగరవాసులే ( వారి కడుపు ‘చల్ల’ గుండ!) తాగేస్తారు. అలాగని తెలంగాణ రాష్ర్టంలో మిగిలిన జిల్లాలను కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ తక్కువ అంచనా వేయనక్కర లేదు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు వీరులెంత మంది వున్నారో తెలియదు కానీ, ‘తెలుగు బీరులు’ మాత్రం అధికమే. దేశంలో మొత్తం మీద తయారయిన బీరులో దాదాపు మూడోవంతు (31 శాతం) ఈ రెండు రాష్ట్రాల వారే పీల్చేస్తారు.
ఈ ‘తీరని దాహాన్ని’ పట్టించుకోకుండా ఇంతవరకూ ఎలా వుండిపోయామని, తెలంగా ఎక్సయిజు విధాన నిర్ణేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ‘అవును కదా! కనీసం హైదరాబాద్ వాసుల ‘దాహార్తి’నన్నా తీర్చాలి కదా!’ అని భావించి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎక్కడ ‘ఛాయ్’ అక్కడే, ఎక్కడ కాఫీ అక్కడే అప్పటికప్పుడు తయారు చేసిన రీతిలో, ఎక్కడి పబ్బులో, ఎక్కడి క్లబ్బులో అక్కడ బీరును తయారు చేసి ఇస్తే ఎంత బావుంటుంది? ఈ వార్త బీర్ బల్స్ చెవిన పడితే ఎలా వుంటుంది? కార్కుతీసిన సీసాలోనుంచి బీరు వచ్చినట్లు, వారి ఉత్సాహం ‘బుస బుస’ లాడుతూ రాదూ!?
కాఫీ ప్రయిఉలుకాఫీ డేలోకి వెళ్ళి, ఏ కాఫీ కావాలంలే ఆ కాఫీ అలా తాగుతారో, ఇక నుంచి బీరును కూడా అలా పొందవచ్చు. అది కాపిక్యూనా నా? ఇండియన్ కాఫీనా? అని అడిగినట్లే…,వీట్ బీరా? డార్క్ బీరా? స్టౌట్సా? పోర్టర్సా? ఇలా తయారు చేసే వాటినే ‘మైక్రోబ్రూవరీస్’ అంటారు. ఇప్పటికే ఈ సదుపాయం బెంగళూరు, ముంబయి, పుణె నగరాల్లో వుంది. కానీ బీరు ముఖ్యపట్టణమైన భాగ్యనగరంలో లేక పోవటం ఎంత అవమానం?
చూశారా! ఇక్కడే పక్షపాతం కనిపిస్తుంది. అభివృధ్ది మొత్తం హైదరాబాద్‌కు ఇచ్చేసి, మిగిలిన గ్రామీణ తెలంగాణను వదిలేయటం మంచిదేనా? అలా చేస్తే అది సర్వజనసహితాభివృధ్ధి ( ఇన్‌క్లూజివ్ గ్రోత్) అని అనిపించుకుంటుందా? అందుకే తెలంగాణ రాష్ర్ట సర్కారు ఈ విషయంలో మాత్రం గ్రామీణ తెలంగాణకు ఏమాత్రం అన్యాయం చెయ్యాలని భావించటం లేదు. పైపెచ్చు గ్రామీణ ప్రాంతాలకి మద్యాన్ని అందించటంలో సాటి తెలుగు రాష్ర్టమయిన ఆంధ్రప్రదేశ్ ముందంజలో వుంది. అక్కడ గ్రామాలలో సైతం ప్రతి 10 వేలమందికి ఒక మద్యం షాపు వుంది.
కానీ తెలంగాణలో ప్రతి 16 వేలమందికి మాత్రమే ఒక మద్యం షాపు మాత్రమే వుంది. ఇది అన్యాయం కాదూ? అని అనుకున్నారో యేమో, ఇక్కడ కూడా అన్ని షాపులూ వుండాల్సిందే నని నిర్ణయించేశారు. ఇప్పటికే తెలంగాణలో 2016 వైన్‌షాపులున్నాయి. ( బెల్టుషాపులు కాదండోయ్! వాటి గణాంకాలు ఎవరి దగ్గరా లేవు. రెండు రాష్ట్రాల్లో నూ అవి లక్షల్లో వుండొచ్చు.) ఇప్పుడు మరో 900 షాపులు వచ్చేస్తున్నాయి.
అయితే సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించి ఈ కొత్త విధానానికి కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టటం లేదు. గుడుంబా, నాటు సారాల్లాంటివి తాగి ‘పోదాం పోదా పైపైకి’ అంటూ నిజంగానే పేదలు ‘పైకి’ పోతున్నారు. ఈ కల్తీ సారాను అరికట్టాలంటే, సర్కారు పరీక్షించి, మూతబిగించి సీలు వేసిన సారా… సారీ మద్యాన్నే తాగాలి. అదే ధరకు చీప్ లిక్కర్ దొరికితే ఈ కల్తీ సారా తాగారు కదా! ఆర్గ్యుమెంటు అదిరిపోలేదూ..!
చట్ట బధ్ధమైన హెచ్చరిక: మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఈ ప్రకటనను కొంచెం మార్చుకుని చదవాలి. ‘చీప్ లిక్కర్ తాగటం ఆరోగ్యానికి హానికరమే. కానీ గుడుంబా తాగటం ప్రాణాంతకం’ ఇదీ కొత్త ఎక్సయిజ్ పాలసీ ‘సారా’ అంశం!!
సతీష్ చందర్