వైసీపీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ ట్విటర్ వేదికగా విరుచుకుపడుతుంటే, వైసీపీ కూడా అదే రేంజ్‌లో సమాధానం ఇస్తోంది. పవన్ రెచ్చిపోయే కొద్ది, వైసీపీ వ్యూహాత్మంగా ఆయనకు చురకలు అంటిస్తోంది. వైసీపీ విద్యా విధానం, మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ లేకపోవడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం, అలాగే ఇతరత్రా అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన ధోరణిలో ట్విటర్ వేదికగానే డియర్ పవన్‌కల్యాణ్ అంటూ మర్యాదగా సంబోధిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం విశేషం. పవన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు చదువు చెప్పిన టీచర్లు సిగ్గుపడతారనే అభిప్రాయాన్ని బొత్స వ్యక్తం చేశారు. పవన్‌కు బొత్స ఇచ్చిన కౌంటర్‌లో ప్రధానంగా రాజకీయ విమర్శ ఉంది.
“ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిసారి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయం. నాకు కూడా జాలేస్తోంది. మీ మెదడులో పదును పెంచేందుకు ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా” అని బొత్స హితవు చెప్పారు. గురువుల్ని ముందుకు తీసుకురావడం ద్వారా పవన్ అజ్ఞానాన్ని చూపే ప్రయత్నాన్ని గమనించొచ్చు.
పవన్‌కల్యాణ్ అంటే బొత్సకు అసలే గిట్టదు. పవన్ ఏదిపడితే అది మాట్లాడుతుంటారని, ట్వీట్ చేస్తుంటారనేది బొత్స ఆరోపణ. పవన్‌కు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు సిగ్గుపడతారని బొత్స చేసిన కామెంట్ ఆలోచించ తగిందే. ఎందుకంటే ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే మొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత చదువు నేర్పిన ఉపాధ్యాయుల గురించి మాట్లాడ్డం తెలిసిందే.