బ్రో ట్రైలర్ విడుదలైంది. అందులోని డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే రాజకీయంగా పవన్ వ్యవహారశైలికి బ్రో ట్రైలర్‌లోని డైలాగ్స్ బాగా సరిపోయాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా పవన్‌కల్యాణ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. వలంటీర్లపై పదేపదే ఆయన గెలుక్కుంటున్నారు. వలంటీర్లు, బ్రో సినిమాలోని ఆ డైలాగ్స్‌కు సంబంధం ఏంటో తెలుసుకుందాం.
‘అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్!.. మీరు సీఎం అయినా కాకపోయినా డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 1) వలంటీర్ల బాస్ ఎవరు?; 2) ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ దాస్తున్నారు?; 3) వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు …ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?’ అని జగన్‌ను పవన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ డేటా చౌర్యంపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను పవన్ షేర్ చేయడం గమనార్హం.
వలంటీర్లపై పవన్‌కల్యాణ్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. అనవసరంగా వలంటీర్ల వ్యవస్థతో ఘర్షణ పెట్టుకుని రాజకీయంగా నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తప్పును సరిదిద్దుకోవాల్సిన పవన్‌కల్యాణ్, ఆ పని చేయకుండా పదేపదే వలంటీర్లపై ట్వీటో, నోరో పారేసుకుంటున్నారు. తన నెత్తిపై తానే చేయి పెట్టుకుని నష్టపోతున్నాడని చెబుతున్నారు.
ఈ సందర్భంగా పవన్ నటించిన బ్రో సినిమా ట్రైలర్ విడుదల కావడం, అందులోని డైలాగ్‌లు ఆయనకే వర్తిస్తాయనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆ డైలాగ్స్ ఏంటంటే… ‘భస్మాసురుడు అని ఒకడు వుండేవాడు తెలుసా. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవడికీ చాన్స్ ఇవ్వడు’ అనే డైలాగ్స్‌ను నెటిజన్లు గుర్తు చేస్తూ, పవన్‌కు చీవాట్లు పెడుతున్నారు. తనలోనే భస్మాసురుడు ఉన్నాడని పవన్ గుర్తించకపోవడమే రాజకీయ విషాదం అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.