పురందేశ్వ‌రి నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌కు బైరెడ్డి ప‌రీక్ష‌!

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీ సీనియ‌ర్ నేత , మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌రీక్ష పెట్టారు. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీపై బైరెడ్డి ఇవాళ ఘాటు విమ‌ర్శ‌లు…

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీ సీనియ‌ర్ నేత , మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌రీక్ష పెట్టారు. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీపై బైరెడ్డి ఇవాళ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. మ‌రోవైపు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పురందేశ్వ‌రి నేతృత్వంలో నిర్వ‌హిస్తున్న సీమ బీజేపీ నేత‌ల స‌మావేశానికి బైరెడ్డి వెళ్ల‌డం లేదు. అస‌లు కేంద్ర మంత్రి గ‌డ్క‌రీపై బైరెడ్డికి ఎందుకు కోపం వ‌చ్చింది?  బీజేపీకి ఆయ‌న దూరంగా ఎందుకు ఉన్నారో తెలుసుకుందాం.

సిద్ధేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి తీగ‌ల వంతెన‌కు కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ అనుమ‌తి ఇచ్చారు. ఇదే  బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. తీగ‌ల వంతెన‌తో సీమ‌కు ప్ర‌యోజ‌నం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో బీజేపీ సీమ డిక్ల‌రేష‌న్ ఇచ్చింద‌ని, అందులో సిద్దేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తామ‌ని హామీ ఇవ్వ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

సిద్ధేశ్వ‌రంలో తీగల వంతెన నిర్మించేందుకు అనుమ‌తి ఇచ్చిన కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని సీమ ద్రోహిగా, దుర్మార్గుడిగా బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభివ‌ర్ణించారు. సిద్ధేశ్వ‌రం అలుగు ప్రాజెక్టు నిర్మించాల‌నే డిమాండ్‌పై త్వ‌ర‌లో ఢిల్లీలో ధ‌ర్నాకు దిగ‌నున్న‌ట్టు బైరెడ్డి తెలిపారు. రాయ‌ల‌సీమ‌కు న్యాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలా వుండ‌గా సొంత పార్టీ నేత‌ల‌పైనే బైరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బీజేపీలో బైరెడ్డి రాష్ట్ర‌స్థాయి ప‌ద‌విలో వుండ‌గా, ఆయ‌న కుమార్తె శ‌బ‌రి బీజేవైఎం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీజేపీ విధానాలకు వ్య‌తిరేకంగా బైరెడ్డి మాట్లాడుతున్నా, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోలేని ద‌య‌నీయ స్థితిలో బీజేపీ వుంది. దీంతో బీజేపీలో క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బైరెడ్డి వ్య‌వ‌హారం పురందేశ్వ‌రికి స‌వాల్ అని చెప్పొచ్చు.