ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్లో ఉన్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన నాయకుడు వైఎస్ జగన్పై ఒక రకంగా ధిక్కరణకు వెనుకాడడం లేదు. పార్టీకి నష్టమైనా కేడరే తనకు ముఖ్యమని ఆయన తేల్చి చెప్పడం విశేషం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం వైసీపీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయి. ఆ నియోజకవర్గం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిజానికి ఆ నియోజకవర్గం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంతం. అయితే 2014లో ఆయన ఓడిపోవడం, 2019లో అక్కడికి పక్క నియోజకవర్గానికి చెందిన వేణును తీసుకొచ్చారు. పిల్లిని మండపేట నుంచి పోటీ చేయించారు. కానీ ఆయన ఓడిపోయారు.
అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో పిల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవితో గౌరవించారు. ఆ తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం పిల్లి సుభాష్, మంత్రి వేణుగోపాలకృష్ణ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. గత వారంలో పిల్లి అనుచరులు ఆత్మీయ సమావేశం నిర్వహించి, మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవాళ మంత్రి నేతృత్వంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. 2024లో రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు అభ్యర్థి అయితే తాను సమర్థించనని తేల్చి చెప్పారు. అతన్ని వైసీపీ సమర్థిస్తే తాను పార్టీలో వుండనని స్పష్టం చేశారు. వేణు బరిలో వుంటే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని పిల్లి సంచలన కామెంట్ చేశారు.
తమ కుటుంబం నుంచి పోటీ చేయాలని కేడర్ కోరుతోందన్నారు. కేడరే నాకు ముఖ్యమని వైసీపీ అధిష్టానానికి ఆయన తెగేసి చెప్పారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించి ధిక్కరణ బాటలో పయనిస్తానని ఆయన సంకేతాలు ఇచ్చారు. వేణు ఆత్మీయ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. కార్యకర్తల్ని వదులుకోడానికి సిద్ధంగా లేనన్నారు. పార్టీకి నష్టమైనా కార్యకర్తల కోసం తప్పడం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దీంతో రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ బరిలో వుంటారని తేలిపోయింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. రామచంద్రాపురంలో కుమ్మలాటపై చర్చించారు. దీంతో సమస్య సర్దుమణిగిందని అందరూ భావించారు. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడానికి కూడా వెనుకాడేది లేదని ఇవాళ బోస్ స్పష్టం చేయడం వైసీపీని కలవరపెడుతోంది.