భీమన్న అనే వాడి వలన రామన్న అనే వాడికి ప్రాణహాని ఉన్నదని ప్రపంచం మొత్తాన్నీ నమ్మించాం అనుకోండి. అప్పుడిక రామన్నకు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా కాపాడుకోవడం అనేది.. భీమన్న బాధ్యత. ఎందుకంటే.. రామన్నకు చిన్న ఆపద వాటిల్లినా.. ప్రపంచం భీమన్ననే అనుమానిస్తుంది, నిందలు వేస్తుంది.
సోమన్న అనే ఇంకో ఆకతాయి.. పైన చెప్పిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. అప్పుడు తానే రామన్నను దొంగచాటుగా ఒక దెబ్బ కొట్టాడనుకోండి.. అప్పుడైనా సరే.. సోమన్నను ఎవరూ పట్టించుకోరు. భీమన్నే కొట్టాడని అనుకుంటారు. ఇదే సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నదా? అనే అభిప్రాయం కలుగుతోంది.
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి.. కేసీఆర్ సర్కారును గద్దె దించి తీరుతానని ముమ్మరంగా తిరుగుతున్న షర్మిల మీద ఇప్పుడు తెలుగుదేశం హఠాత్తుగా ప్రేమ కురిపిస్తోంది. షర్మిల ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని ఆరాటపడుతోంది.
వివేకాహత్య కేసుకు సంబంధించి.. సీబీఐ విచారణలో షర్మిల వాస్తవాలను వెల్లడించినందువలన జగన్ తో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నదని.. హత్యకు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. కేంద్రం ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించాలని తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న అంటున్నారు. షర్మిల తరఫున ప్రశ్నించినందుకే వివేకాను జగన్ హత్య చేయించారని, జగన్ తో పాటు భార్య భారతిని కూడా సీబీఐ విచారించాలని.. ఇలా అనేకానేక డిమాండ్లు వినిపించిన బుద్ధా వెంకన్న షర్మిల మీద కురిపిస్తున్న ప్రేమానురాగాలే అనుమానం కలిగిస్తున్నాయి.
వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఎవరు ఎలా మాట్లాడుతున్నప్పటికీ.. ఏ ఒక్కరికీ ఇస్పటిదాకా వీసమెత్తు సమస్య వచ్చిన సందర్భమే లేదు. ఎందుకంటే.. హత్య కేసు ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి అప్రూవర్ గా మారిపోయాడు. కేవలం దస్తగిరి మాటలు తప్ప మరో ఆధారం ఏదీ లేకపోయినప్పటికీ.. సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, తండ్రి భాస్కర రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. వారు సాక్షులను బెదిరిస్తారని వారు బెయిలుకు కూడా అడ్డు పడుతున్నారు.
ఇంత జరుగుతున్నా.. కేసు రూపురేఖలు మార్చేసిన దస్తగిరి కి ఇప్పటిదాకా ఎలాంటి ప్రమాదమూ వాటిల్లలేదు. పైగా బయట అతను సెటిల్మెంట్లు, దందాలు, రౌడీయిజం, కిడ్నాపులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.
అలాంటిది.. షర్మిలకు మాత్రం.. అన్నయ్య జగన్ నుంచి ప్రాణాపాయం పొంచి ఉన్నదని మధ్యలో తెలుగుదేశం ఆవేదన వ్యక్తం చేయడం తమాషాగా ఉంది. చూడబోతే.. ఇలాంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, అలా జరగగలదని ప్రజలను నమ్మించి.. తెలుగుదేశమే షర్మిలకు కుట్రపూరితంగా కీడు తలపెట్టినా ఆశ్చర్యం లేదని ప్రజలు అనుమానం వెలిబుచ్చుతున్నారు.