ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ 26న చెన్నయ్ లో జరగబోతోంది. దీనికి మన తెలుగులో కొన్ని సినిమాలు నామినేట్ అయ్యాయి. మనం, కార్తికేయ ఇలా. ఇందులో కార్తికేయకు నాలుగు నామినేషన్లు దక్కాయి. అంతవరకు బాగానే వుంది. తమ సినిమా కు నాలుగు నామినేషన్లు దక్కాయి..పోనీ అవార్డులు వచ్చినా రాకున్నా ఫంక్షన్ చూద్దామనుకున్నా కార్తికేయ టీమ్ కు ఫిల్మ్ ఫేర్ నుంచి అస్సలు ఆహ్వానమే అందలేదట.
కార్తికేయ నిర్మాత ఫిల్మ్ ఫేర్ ముంబాయిని కాంట్రాక్టు చేసి, తాను ఆ సినిమాకు నిర్మాతనని, ఫంక్షన్ కు హాజరయ్యేదెలా అని ఎంక్వయిరీ చేస్తే, తమకేం తెలియని, తమ సౌత్ ఇండియా ప్రతినిధిని కాంట్రాక్టు చేయమని చెప్పారట. సరే అని అలా కాంటాక్ట్ చేస్తే, తమకు ఫంక్షన్ కు పాస్ లు రెండు వందలే వస్తాయని, వాటిని, గ్లామరస్ సెలబ్రిటీలకే ఇస్తామని, నామినేషన్లు పొందిన సినిమాలు, వాటి యూనిట్ సంగతి తమకు తెలియదని సమాధానం వచ్చిందట.
దాంతో అవాక్కవడం నిర్మాత వంతయింది. తమ సినిమా బాగుంది కాబట్టి నామినేట్ చేసారని, తాము బతిమాలి నామినేట్ చేయించుకోలేదని, అలాంటపుడు, ఫంక్షన్ తమ సినిమా నిర్మాత, దర్శకుడు లేకుండా ఇంకెందుకని ఆ నిర్మాత వాపోతున్నారు. సెలబ్రిటీల కోసం ఫంక్షన్ చేసుకునేటపుడు, సినిమాలు, నామినేషన్ల తతంగం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్, అవార్డు అంటే అదో గౌరవంగా భావిస్తామని, కానీ ఇలా తమను పిలవకుండా తమ సినిమాను నామినేట్ చేసి, ఫంక్షన్ చేసుకునే అవమానంగా వుంటుదని మాత్రం తాము అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు కార్తికేయ నిర్మాత శ్రీనివాస్.