అంతులే క్విడ్‌ ప్రో కో

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర, కేంద్రమంత్రిగా ఐదేళ్లు పని చేసిన ఎ ఆర్‌ అంతులే మంగళవారం చనిపోయారు. 1980లలో పదవీ దుర్వినియోగానికి మారుపేరుగా పేరుబడి, శ్రీశ్రీ చేత 'అంతులే(ని) అవినీతి' అని చమత్కరింపబడిన అంతులేది అవినీతిలో…

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర, కేంద్రమంత్రిగా ఐదేళ్లు పని చేసిన ఎ ఆర్‌ అంతులే మంగళవారం చనిపోయారు. 1980లలో పదవీ దుర్వినియోగానికి మారుపేరుగా పేరుబడి, శ్రీశ్రీ చేత 'అంతులే(ని) అవినీతి' అని చమత్కరింపబడిన అంతులేది అవినీతిలో అప్పటికి విలక్షణమైన పంథా. అప్పటిదాకా నాయకులపై లంచగొండితనం ఆరోపణలే వుండేవి. అంటే ఫలానా పని చేసి పెడతా, యింత డబ్బు చాటుగా మా యింట్లో యిచ్చేయండి, లేకపోతే నా పేర ఆస్తులు కొనండి అంటూండే పద్ధతి. అయితే అంతులే రాజమార్గంలో డబ్బు పుచ్చుకునే మార్గం కనిపెట్టాడు. అప్పటి ప్రధాని, తన పార్టీ అధ్యకక్షురాలు అయిన ఇందిరా గాంధీ పేర 'ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్టాన్‌' అనే ట్రస్టు ఏర్పరచి దాని ద్వారా కళాకారులను ప్రోత్సహిస్తామని ప్రకటించాడు. దానికి తను ముఖ్యమంత్రిగా వున్న మహారాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 2 కోట్లు విరాళంగా యిచ్చాడు. కొందరు బిల్డర్లకు, చక్కెర సహకారసంఘాలకు చెప్పి మరి కొన్ని విరాళాలు సేకరించి మూలధనం రూ. 5.20 కోట్లు చేశాడు. అప్పట్లో సిమెంటుకి కొరత వుండేది. ఏం కావాలన్నా లైసెన్సుల కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షణాలు చేసే రోజులవి. బిల్డింగ్‌ కాంట్రాక్టర్లు అదనపు సిమెంటు కోసం వస్తే 'సరే యిస్తాను కానీ బస్తాకు కొంత ఆ ట్రస్టుకి చందాగా యియ్యి' అని చెప్పేవాడు. అంతా వైట్‌ మనీయే. చాటుమాటు వ్యవహారం కాదు. బిల్డర్లు యిచ్చేవారు. అలా రూ. 30 కోట్లు పోగేశాడు. ఆ ట్రస్టు ప్రభుత్వ ట్రస్టు అనే అభిప్రాయం అందరిలో వుండేది. కానీ దాని రూల్సు ఎలా తయారుచేశారంటే అది మూసేసినపుడు దాని నిధులన్నీ  చైర్మన్‌ (అనగా అంతులే మహాశయుడే)కి చెందుతాయి. 

ఇలాటి దివ్యమైన ఆలోచన అంతులేకు ఊరికే రాలేదు. అతను రాజకీయాల్లోకి చేరేముందు లండన్‌లో బారిస్టర్‌ చదివాడు. 1980లో ఇందిరా గాంధీకి మళ్లీ అధికారం దక్కాక ఆమె మహారాష్ట్రలో రాజకీయంగా బలంగా వున్న మరాఠాల పాలనకు స్వస్తి చెప్పాలనుకుంది. ఆ రాష్ట్రంలో ముస్లిముల సంఖ్య గణనీయంగా వున్నా, ముస్లిం ముఖ్యమంత్రిగా ఎన్నడూ లేడు. ముస్లింలలో ఉదారవాది అయిన అంతులేను జూన్‌లో ముఖ్యమంత్రి చేసింది. అతను వెంటనే ప్రజారంజకమైన జనాకర్షక చర్యలు మొదలుపెట్టాడు. బాల ఠాక్రేను కలుపుకుని రాత్రి పూట మారువేషాల్లో సంచరించడం, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కళాకారులను ఆదుకోవడం యిలాటివి చేసి పాప్యులర్‌ అయిపోసాగాడు. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అంతేకాదు, లండన్‌లో వున్న శివాజీ భవానీ కరవాలానికి వెనక్కి తెస్తానని ప్రకటించాడు కూడా. అందరూ హర్షించారు. మరాఠా నాయకులకు కడుపు కాలింది. ఈ ట్రస్టు వ్యవహారం మొదలుపెట్టగానే ప్రతిపక్షంలో వున్న శరద్‌ పవార్‌, అధికారపక్షంలోనే రెవెన్యూ మంత్రిగా వున్న శాలినీ తాయ్‌ పాటిల్‌ కలిసి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కాలమిస్టు అరుణ్‌ శౌరీకి ఆధారాలు అందించారు. ఎక్స్‌ప్రెస్‌ రామనాథ్‌ గోయెంకా ఇందిరా గాంధీకి బద్ధవిరోధి. జనసంఘ్‌ సమర్థకుడు. ఇంకేం? వ్యాసాలపై వ్యాసాలు వేశారు. కాంగ్రెసు ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ట్రస్టుకి తన పేరు పెట్టడం ఇందిరా గాంధీకి ఆగ్రహం కలిగించింది. 1982 జనవరిలో అంతులేను తప్పించేసింది. కేసులు నడిచాయి. థాబ్దాలపాటు నడిచాయి. 2013లో కేసు ముగిసింది. అంతులే జైలుకి వెళ్లలేదు. వసూలు చేసిన డబ్బు బిల్డర్లకు తిరిగి యిచ్చాశారో లేదో తెలియదు. అంతులే ఇందిరకు, ఆమె కుటుంబానికి విధేయుడిగానే వున్నాడు. ఆ విధేయతకు మెచ్చి సోనియా గాంధీ 2004లో అతన్ని మైనారిటీ ఎఫయిర్స్‌ మంత్రిగా పదవి యిచ్చింది. భారత ముస్లిముల స్థితిపై అధ్యయనం చేయడానికి రాజేంద్ర సచార్‌ కమిటీ వేయించినది అంతులేయే. 2009 పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయాడు. ఉదారవాదిగా వున్న అంతులే తన పదవి వూడబెరికిన మరాఠాలపై ద్వేషం పెంచుకుని, క్రమంగా తీవ్రభావాలు అలవర్చుకున్నట్లు కనబడుతోంది. బొంబాయి ముట్టడిలో కసబ్‌ చేతిలో మరణించిన హేమంత్‌ కర్కరే చావుకి హిందూ ఛాందసవాదులే కారణమంటూ నిరాధార ఆరోపణలు చేశాడు.

క్విడ్‌ ప్రొ కోకు అసలైన ఉదాహరణ – అంతులే వ్యవహారం. సిమెంటు ఎలాట్‌మెంట్‌కు, ట్రస్టుకు యిచ్చిన విరాళాలకు డైరక్టు లింకు వుందని జస్టిస్‌ లెంటిన్‌ అభిప్రాయపడ్డారు. సాధారణంగా క్విడ్‌ ప్రొ కొ యింత బాహాటంగా వుండదు. ఒక బ్యాంకు మేనేజర్‌ ఒక పరిశ్రమకు భారీ ఋణం యిచ్చాడనుకోండి. ఆ మేనేజర్‌ కొడుకును ఆ పరిశ్రమలో ఉన్నతోద్యోగిగా తీసుకుంటే రెండిటికీ లింకు తెలుస్తున్నా నిరూపించడం కష్టమౌతుంది. అతనా ఉద్యోగానికి అర్హుడని తీసుకున్నాం అని కంపెనీ వాదిస్తుంది. కంపెనీకి స్తోమత వుంది కాబట్టి ఋణం యిచ్చామని బ్యాంకు వాదిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌పై క్విడ్‌ ప్రొ కో ఆరోపణలు చేసేవారు యిది గమనించాలి. అంతులే కేసులో సిమెంటు ఎలాట్‌ చేసినది అతనే. విరాళాలు పొందిన ట్రస్టుకి చైర్మన్‌ కూడా అతనే. అయినా అతను జైలుకి వెళ్లలేదు. వైయస్‌ హయాంలో క్విడ్‌ ప్రొ కో జరిగిందని ఎలాగోలా నిరూపితమయినా అప్పుడు అధికార దుర్వినియోగం చేసినందుకు వైయస్‌యే ముద్దాయి అవుతారు. అధికారంలో లేనివారి విషయంలో దుర్వినియోగం అనే ప్రశ్నే వుదయించదు. వైయస్‌పై అధికార దుర్వినియోగం కేసును గత కాంగ్రెసు ప్రభుత్వం చేపట్టలేక పోయింది. తన పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి అనే కారణం అని చెప్పుకుంటే మరి యిప్పుడు టిడిపికి అటువంటి శంకలు ఏమీ లేవు కదా. పదవిలోకి వచ్చి ఆర్నెల్లు అయినా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదేం? ఆధారాలు లేకనా? నిరూపించడం కష్టమనా? 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి