ఎమ్బీయస్‌ : మ్యూజియం అధికారి అంతర్ధానం

కలకత్తాలోని ఇండియన్‌ మ్యూజియంలో పని చేసే సైంటిస్టు, చీఫ్‌ హెరిటేజ్‌ కన్సర్వేనిస్టు అయిన 35 ఏళ్ల డా|| సునీల్‌ ఉపాధ్యాయ జులై 3 నుండి కనబడటం లేదు. కలకత్తాలోని పోష్‌ కాలనీ అయిన స్విస్‌…

కలకత్తాలోని ఇండియన్‌ మ్యూజియంలో పని చేసే సైంటిస్టు, చీఫ్‌ హెరిటేజ్‌ కన్సర్వేనిస్టు అయిన 35 ఏళ్ల డా|| సునీల్‌ ఉపాధ్యాయ జులై 3 నుండి కనబడటం లేదు. కలకత్తాలోని పోష్‌ కాలనీ అయిన స్విస్‌ పార్క్‌ ఏరియాలో ఫ్లాట్‌లో నివసించే ఆయన అవేళ సాయంత్రం 7 గంటలకు ఒక పుస్తకం చదువుతూ చదువుతూ మామూలు దుస్తుల్లో, హవాయి చెప్పులతో బయటకు వెళ్లాడు. అదే కాంప్లెక్సులో నివాసముంటున్న తన కజిన్‌ యింట్లోనైనా ఏమీ చెప్పలేదు. అప్పటినుండి తిరిగి రాలేదు. నెల దాటినా ఆచూకీ తెలియలేదు. కిడ్నాప్‌ చేశాం, ఇంత యిస్తే వదులుతాం అంటూ ఫోనైనా రాలేదు. మాయం కావడానికి కారణాలను రకరకాల కోణాల్లో వెతుకుతున్నారు. 

సైంటిస్టు మాయం అనగానే ఏదో ఫార్ములా కోసమే అయి వుంటుంది, ఆ ఫార్ములా చేజిక్కించుకున్న అంతర్జాతీయ ముఠావాళ్లు కోట్లకు కోట్లు గడిస్తారు.. అని సినిమా ప్రేక్షకులు వూహించడం కద్దు. మరి యిక్కడ మ్యూజియం ఉద్యోగంలో అలాటి నేరాలకు తావెక్కడ అనుకోవచ్చు. ఎందుకంటే మ్యూజియం అనగానే ముక్కు విరిగిన రాతి విగ్రహాలు, అంచు పగిలిన మట్టి కడవలు, వంగిపోయిన తుప్పుకత్తులు గుర్తుకు వస్తాయి. వీటికి తాళాలు వేయడమే దండగ, వాచ్‌మన్లను పెట్టడం యింకా దండగ.. అనిపిస్తుంది. కానీ అది సరికాదు. పురాతన వస్తువులకు, కళాత్మక సామగ్రికి చాలా విలువ వుంటుంది. ప్రపంచం మొత్తం మీద భారతదేశం గురించి ఆసక్తి పెరిగిన కొద్దీ యీ కళాసంపదకు, వారసత్వానికి ఎక్కడ లేని ధరా పలుకుతోంది. అందువలన వాటిని మ్యూజియాలనుండి దొంగిలించి, చాటుగా విదేశాలకు తరలించేవాళ్లు ఎక్కువయ్యారు. వస్తువులు తరిగిపోతే అనుమానం వస్తుంది కాబట్టి నకిలీవి తయారుచేసి అసలైన వాటి స్థానంలో పెట్టి, అసలైనవి తస్కరిస్తున్నారు. అసలేమోననే భ్రమ కొల్పేట్లా నకిలీవి తయారుచేయాలంటే రోజుల తరబడి అసలు చిత్రపటాలను, శిల్పాలను స్టడీ చేసే అవకాశం కల్పించాలి. 200 బిసి నుండి పురాతన వస్తువులు కలిగిన కలకత్తా మ్యూజియం ఉద్యోగులలో కొంతమంది అలాటి అవకాశాలు కల్పించి యిలాటి చోరీలకు సహకరిస్తున్నారు. రవీంద్ర నాథ్‌ ఠాకూర్‌ 150 వ జయంతి సందర్భంగా 2011 మార్చిలో రవీంద్రుని ఒరిజినల్‌ పెయింటింగ్స్‌ అంటూ ఇండియన్‌ మ్యూజియం గవర్నమెంట్‌ ఆర్ట్‌స్‌ అండ్‌ క్రాఫ్ట్‌స్‌ కాలేజీ ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ''ఇవన్నీ డూప్లికేట్‌వి. చాలా తెలివిగా అనుకరించినవి. ఒరిజినల్స్‌ ఎక్కడికో దాటించేసి, యీ డూప్లికేట్లను ప్రదర్శనకు పెట్టడం ద్వారా యివే ఒరిజినల్‌ అనే భ్రమ కల్పిద్దామని చూస్తున్నారు. మ్యూజియంలోని ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా యిదంతా జరగదు. దీనిపై విచారణ జరపాలి.'' అంటూ ప్రముఖ శిల్పి తపస్‌ సర్కార్‌ కలకత్తా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశాడు. 

ఇలాటి సంఘటనల వలన మ్యూజియంలో యిలాటి నేరాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక సునీల్‌ గురించి చెప్పాలంటే అతను ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. చాలా తెలివైనవాడు. కష్టపడి నిజాయితీగా పనిచేసి పైకి వచ్చాడు. ఇక్కడకు వచ్చేముందు ఢిల్లీ మ్యూజియంలో పని చేశాడు. ఇక్కడ యీ మధ్య రిపేరు పనులు జరుగుతూంటే సీలింగు సరిగ్గా జరగలేదని సునీల్‌ కాంట్రాక్టరుపై కోప్పడ్డాడు. కోట్లు లంచాలు యిచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్టరు యిలాటి హెచ్చరికలను లెక్కచేస్తాడా? 'పోవోయ్‌' అన్నాడట. ఇలాటివి, యింకా కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయని పసిగట్టి ప్రభుత్వాన్ని ముందుగా హెచ్చరిద్దామని (విజిల్‌ బ్లోయింగ్‌) ప్రయత్నించాడని అతని సహచరులు కొందరు అంటున్నారు. ఇది ముందే పసిగట్టినవారు మాయోపాయంతో అతన్ని మాయం చేశారని అనుమానాలు వస్తున్నాయి. 'కిడ్నాప్‌ చేస్తే యిలాటి అనుమానాలు వస్తాయని తెలుసు. అందుకని అతన్ని మెంటల్‌గా హెరాస్‌ చేశారు. ఒత్తిడి భరించలేక తనంతట తనే ఎక్కడికో వెళ్లిపోయేట్లా చేశారు' అని మరి కొందరు అంటారు. సునీల్‌ ఆరోగ్యం బాగాలేదన్నమాట వాస్తవమే. ఊపిరి పీల్చుకోవడంలో యిబ్బంది పడుతూంటే అతని కజిన్‌ కార్డియాలజిస్టు వద్దకు జులై 1 న తీసుకెళ్లాడు. ఆయన  కొన్ని మందులు రాసిచ్చి, బెడ్‌రెస్ట్‌ తీసుకోమన్నాడు. జులై 4 వచ్చి కొన్ని టెస్టులు చేయించుకోమన్నాడు. ఆ ముందు రోజే మాయమయ్యాడు. టెన్షన్లు భరించలేక వైరాగ్యంతో సునీల్‌ ఎక్కడికో వెళ్లిపోయి వుండవచ్చు అని కూడా అంటున్నారు. అతను వివేకానంద భక్తుడట. ఆయనలాగే సన్యాసి అవుదామనుకున్నాడేమో! 

ఇంతకీ టెన్షన్లు ఎందుకు అంటే – ఆ మధ్య మ్యూజియంలో ఒక సంఘటన జరిగింది. లయన్‌ కాపిటల్‌ అనే ప్రాచీన శిల్పం ఒకదాన్ని తరలిస్తూ వుంటే పనివాళ్ల అజాగ్రత్త వలన అది కింద పడి విరిగి ముక్కలైంది. దానిపై కేంద్ర శాఖ విచారణ జరిపిందని, తప్పు సునీల్‌పై నెట్టడంతో కృంగిపోయాడని కొందరంటారు. అతను డిప్యూటీ డైరక్టరు పోస్టు ఆశిస్తే అది రాకపోవడంతో కృంగాడని మరి కొందరంటారు. మ్యూజియం డైరక్టరును అడిగితే అతను ఆ పోస్టుకి అప్లయి చేయలేదని చెప్పారు. లయన్‌ కాపిటల్‌ విషయంలో విచారణ కమిటీ అందర్నీ సామూహికంగా తప్పు పట్టింది తప్ప ఏ ఒక్కరిపై నింద మోపలేదని చెప్పారు. బయటకు మామూలుగా వెళ్లి ఏదైనా హార్ట్‌ ఎటాక్‌ వచ్చి పడిపోతే వీధిలో ఎవరైనా ఆసుపత్రిలో చేర్పించి వుండవచ్చు అనే అంచనాపై అతని సోదరులు కలకత్తాలో అసుపత్రులన్నీ తిరిగారు. అతను కనబడకపోవడంతో కలకత్తా మ్యూజియంలో సహచరులు, అతను చదువుకున్న ఢిల్లీ వర్శిటీ విద్యార్థులు అందరూ కలిసి ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి అతని గురించి ఏ సమాచారం దొరికినా సేకరిద్దామని చూస్తున్నారు. వచ్చేవారానికైనా యీ మిస్టరీ విడుతుందేమో చూడాలి.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]