తనను ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించబోతోందని తెలియగానే మోదీ చేసిన పని అమిత్ షాను యుపికి యిన్‌చార్జిగా నియమించేయడం! ఎందుకంటే బిజెపి అధ్యకక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆ రాష్ట్రం వాడే! బిజెపి అగ్రనాయకుల్లో చాలామంది అక్కడి వారే ! అక్కడ బిజెపి నెగ్గితే ఏనుగు కుంభస్థలం కొట్టినట్లే. కానీ యుపిలో ఎస్పీ, బియస్పీ తప్ప వేరే పార్టీ కనబడకుండా పోయాయి. అంటే బిజెపి స్థానిక నాయకత్వం సత్తా చాలటం లేదన్నమాట. అందుకే అమిత్‌ను అక్కడకు పంపాడు.
బాధ్యత అప్పగించాక అమిత్ షా యుపిలో పార్టీని రకరకాలుగా బలోపేతం చేస్తూ పోయాడు. టిక్కెట్లు ఎవరెవరికి యివ్వాలో రాజ్‌నాథ్‌కు సూచించేవాడు. సూచన అనేది ఒక ఆనవాయితీ మాత్రమే తప్ప అంతిమనిర్ణయం అమిత్‌దే. రాజ్‌నాథ్‌కు అది మొదట్లో అర్థం కాలేదు. అమిత్ చెప్పినదల్లా పాటించాలని గ్రహించలేదు. 2014 మార్చిలో అమిత్ వచ్చి రాజనాథ్ వద్దకు వచ్చి 'మోదీగారు తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేస్తే మంచిది' అన్నాడు. రాజ్‌నాథ్‌కు అది రుచించలేదు. 'పార్టీ అధ్యకక్షుడిగా నేనూ, ప్రధాని అభ్యర్థిగా మోదీ యిద్దరం ఒకే రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తే ఏం బాగుంటుంది?' అన్నాడు. 'నీ అధ్యక్ష భోగం యింకెన్నాళ్లులే' అని లోపల అనుకున్నా అమిత్ పైకి ఏమీ అనలేదు. టాపిక్ మార్చేశాడు. వెళ్లబోయేముందు మాత్రం 'నేను చెప్పినది ఓ సారి ఆలోచించండి' అన్నాడు. రాజ్‌నాథ్ పెద్దగా ఆలోచించలేదు. మోదీ అడిగితే 'బిహార్ కూడా మనకు ముఖ్యమే కదా, మీరు పట్నా నుండి పోటీ చేయండి' అని చెప్దామనుకున్నాడు.
కానీ మోదీ అడగలేదు. అమిత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 'రెండు, మూడు సార్లు నేను చెప్పినదాని గురించి ఏమంటారు' అంటూ రాజ్‌నాథ్‌కు గుర్తు చేశాడు. మోదీ అడిగినప్పుడు చూద్దాంలే అన్న ఉద్దేశంలో వున్న రాజ్‌నాథ్ సమాధానం వాయిదా వేస్తూ పోయాడు. చివరకు ఓ శుభముహూర్తాన అమిత్ 'మోదీ వారణాశి నుంచి పోటీ చేస్తున్నారు. అవునూ, మీ సంగతేమిటి, అధ్యక్షా? ఎక్కణ్నుంచి పోటీ చేస్తున్నారు?' అని అడిగేశాడు. రాజ్‌నాథ్‌కు మతి పోయింది. చివరకు తన నియోజకవర్గాన్ని కూడా అమితే ఫైనలైజ్ చేసేట్టున్నాడే అని వణికాడు. అమిత్ మనుషులు వచ్చి 'మరీ ఝార్ఖండ్ నుండి పోటీ చేస్తే బాగుంటుందేమో' అనసాగారు రాజ్‌నాథ్‌తో. బాబోయ్ అనుకుని చివరకు 'లఖనవ్ (లక్నో) సీటు యిప్పించండి' అని బతిమాలుకో వలసి వచ్చింది. అదీ అమిత్ షా పవర్. ఆ పవర్ అతనికి మోదీ సాన్నిహిత్యం కారణంగా వచ్చింది.
ఎన్నికలు జరిగే సమయంలో రాజ్‌నాథ్ తను పార్టీ అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతాననే అనుకున్నాడు. అధికార పార్టీ ప్రెసిడెంటుగా ప్రధానితో సమానస్థాయి హోదా అనుభవిస్తాననే అనుకున్నాడు. ఎన్నికలలో మోదీ నెగ్గాక అతని ఆశల పల్లకి బోల్తా పడింది. తనకు ప్రత్యామ్నాయంగా మరో అధికార కేంద్రం తయారవుతుందన్న సందేహంతో మోదీ 'పార్టీ పగ్గాలు అమిత్‌కు అప్పగించి, నువ్వు కాబినెట్‌లోకి వచ్చేయ్' అన్నాడు.పూర్తి పదవీకాలం అనుభవించకుండానే అధ్యక్షపదవి వూడింది. ప్రాంతీయపార్టీల్లో పార్టీ అధ్యక్షపదవి, ముఖ్యమంత్రి పదవి ఒకరి చేతిలో వుండడం చూస్తాం. కాంగ్రెసు పార్టీలో కూడా కొన్ని సార్లు అలా జరిగింది. ఇప్పుడు బిజెపిలో ఆ ధోరణి కనబడుతోంది. వైయస్-కెవిపి జంటలాటిదే, అమిత్-మోదీ జంట కూడా. అమిత్ మోదీ మాట తుచ తప్పకుండా అమలు చేస్తాడు. పార్టీని తన గుప్పిట్లో వుంచుకోవడానికి మోదీకి యింకేం కావాలి?
అమిత్‌ను పార్టీ అధ్యకక్షుడు చేయాలన్న సలహా వచ్చినపుడు నితిన్ గడ్కరీ, ఆడవాణీ దగ్గర్నుంచి పార్టీ పెద్దలందరూ 'పార్టీ గెలుపు ఘనత అతనికి ఒక్కడికే ఎందుకు కట్టబెట్టాలి? యుపిలోనే కాదు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా ఘనవిజయం సాధించింది కదా. అందరికీ నచ్చినవాడు, వివాదరహితుడు అయిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జె పి నడ్డాను పార్టీ అధ్యకక్షుడిగా చేద్దాం. అమిత్‌పై సిబిఐ కేసులు తొలగిపోలేదు. సూర్యనెల్లి రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ వైస్ చైర్మన్ పి జె కురియన్ యిరుక్కున్నపుడు, కేసుల నుండి విముక్తుడయ్యేదాకా అతను రాజీనామా చేయాలని మనం ఆందోళన చేశాం. ఇప్పుడు కాంగ్రెసు వాళ్లు మనల్ని తప్పుపట్టరా?' అని అనుకున్నారు. మోదీ అందర్నీ తోసిరాజన్నాడు. అమితే అధ్యకక్షుడన్నాడు. 'మీరు ప్రధాని, ఆయన పార్టీ అధ్యకక్షుడు, యిద్దరూ గుజరాతీలే, చూడ్డానికి ఏం బాగుంటుంది?' అని చూశారు పార్టీ పెద్దలు. ఏం ఫర్వాలేదు అనేశాడు మోదీ.
అంతే, అమిత్ తన 49 వ యేట అత్యంత పిన్నవయస్కుడైన బిజెపి అధ్యకక్షుడిగా అయిపోయాడు. జులై 13న అహ్మదాబాద్‌లో వాళ్ల అబ్బాయి నిశ్చితార్థం జరిగితే రాజ్‌నాథ్ సింగ్‌తో సహా 20 మంది మంత్రులు వచ్చి వాలారు. గుజరాతీ నాయకుల కంటె ఢిల్లీ, యుపి ల నుండి ఎక్కువమంది వచ్చారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం యిదే జులైలో అమిత్‌ను హత్య, కిడ్నాప్ వంటి క్రిమినల్ కేసుల్లో సిబిఐ అరెస్టు చేసి తీసుకెళ్లింది. మూడు నెలలు జైల్లో వుంచింది. ఇప్పుడు ప్రభుత్వమే అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ యిచ్చి 25 మంది కమాండోలను అంగరక్షకులుగా నియమించింది. ఆ కేసులు యింకా తేలలేదు. అతను బెయిలు మీదనే బయట తిరుగుతున్నాడు. సిబిఐ కేసు తిరగతోడి, యితన్ని జైలుకి మళ్లీ పంపిస్తే, పార్టీకి ఎంత నగుబాటు..? అనే సందేహమే ఎవరికీ రాలేదు. అధికారంలో వున్నవారి పట్ల సిబిఐ ఎలా ప్రవర్తిస్తుందో అందరికీ తెలుసు.
అమిత్‌కు, మోదీకి యింత సాన్నిహిత్యం ఎలా పెరిగింది? గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో 1995లో అప్పటి ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాతో కలహించి మోదీ ఒక న్యూసెన్సుగా తయారయినపుడు బిజెపి అతనిపై రాష్ట్రబహిష్కరణ శిక్ష విధించింది. ఢిల్లీలోనే వుంటూ గుజరాత్లో అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పింది. ఆ సమయంలో అతని అనుచరులందరూ దూరమై పోయారు – ఎమ్మెల్యేగా వున్న అమిత్ షా తప్ప! అమిత్ ఆరెస్సెస్ ప్రచారక్‌గా వున్నపుడు అహ్మదాబాద్‌లో ఒక ఆరెస్సెస్ సమావేశంలో 1985లో అతను అమిత్‌ను గమనించాడు. ఇష్టపడి అనుచరుడిగా చేసుకున్నాడు. వాఘేలాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో మోదీకి అమిత్ సహకరించాడు. మోదీ ఢిల్లీ వెళ్లిపోయాక తను గుజరాత్‌లోనే వుంటూ మోదీకి కళ్లు, చెవులుగా పనిచేశాడు. వాఘేలా తర్వాత 1998లో అధికారానికి వచ్చిన కేశూభాయ్ పటేల్ మోదీని దూరం పెట్టేసి, ఎమ్మెల్యే టిక్కెట్టు కూడా యివ్వకుండా చేసినపుడు కూడా అమిత్ మోదీ గూఢచారిగా, అనుచరుడిగా కొనసాగాడు. 2001లో పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నపుడు, 'మోదీ అయితేనే మనల్ని గట్టెక్కించగలడు' అని యితర ఎమ్మెల్యేలను ఒప్పించి అక్టోబరులో మోదీ గుజరాత్ తిరిగి రావడానికి కారకుడయ్యాడు. ఆ విషయాన్ని మోదీ మర్చిపోలేదు. ముఖ్యమంత్రి అయ్యాక కొద్ది నెలలకు 2002లో డిసెంబరు అతన్ని తన కాబినెట్లో సహాయ మంత్రిగా తీసుకుని హోం, ట్రాన్స్‌పోర్టు, లా శాఖలు చూడమన్నాడు. ఆ ఉపకారాన్ని అమిత్ ఎన్నడూ మరవలేదు. మోదీ ఏం పని చెప్తే అది చేశాడు. అమిత్ పరిపాలనా దక్షత కూడా ఎన్నదగినది. 1995లో గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్‌గా అయ్యాక 16 నెలల్లో దాన్ని నష్టాల వూబి నుండి పైకి లాగాడు, మూడేళ్ల తర్వాత అహ్మదాబాద్ జిల్లా కోపరేటివ్ బ్యాంక్‌ను కూడా బాగుచేశాడు. ఏటా రూ. 40 కోట్ల నష్టాల నుండి రూ. 20 కోట్ల లాభాలకు తీసుకుని వచ్చాడు. ట్రాన్స్‌పోర్టు మంత్రిగా ఆర్టిసిని కూడా లాభాలబాట పట్టించాడు.
రాజకీయప్రయోజనాల కోసం ఎలాటి పనికైనా సిద్ధపడని స్వభావం అమిత్‌ది. అతని సర్ఖేజ్ నియోజకవర్గంలో హిందూ ముస్లిం కలహాలు జరుగుతూంటాయి. 'శాంతి కమిటీ ఒకటి పెట్టి సయోధ్య కుదర్చరాదా?' అని అతని నియోజకవర్గంలోని ఒక పెద్దమనిషి హోం మంత్రిగా వున్న అమిత్‌ను అడిగాడు. 'మతకలహాలు ఆపాలని అంత ఆతృత పడుతున్నారేం?' అని అడిగాడు అమిత్. ఆ పెద్దమనిషి నీళ్లు నమిలి 'అక్కడ నాకు ఆస్తులున్నాయి. గొడవల్లో నా యిల్లు కూలగొడతారేమోనని…' అన్నాడు. 'ఏ లొకాలిటీలో వుందేమిటి?' అడిగాడు అమిత్. అతను చెప్పాక 'అక్కడైతే గొడవలేవీ రావు. నిశ్చింతగా వుండండి.' అన్నాడు అమిత్ చిరునవ్వుతో. అతను ఘటనాఘటన సమర్థుడని చెప్పడానికి యీ ఉదాహరణ చాలు. సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు వెనక్కాల కూడా రాజకీయ కోణం వుంది. అతనూ, తులసీరామ్ ప్రజాపతి యిద్దరూ అండర్వరల్డ్కు చెందినవారే. గోధ్రా అల్లర్ల విషయంలో మోదీతో విభేదించిన కాబినెట్ సహచరుడు, రాజకీయ ప్రత్యర్థి అయిన హరేన్ పాండ్యా హత్యకేసులో వాళ్లు అనుమానితులు కూడా. అమిత్‌కు సన్నిహితుడైన పోలీసు అధికారి అభయ్ చూడాసమా ఏం చెపితే అది వాళ్లు చేస్తూ వుంటారు. తమకు ఆ విధంగా ఉపకరిస్తున్న వాళ్లను చంపించడమేమిటి? అంటే వాళ్ల అవసరం తీరిపోయింది కాబట్టా? వాళ్ల చేత తమకు కావలసిన పనులు చేయించుకుని, రహస్యాలు బయటకు పొక్కకుండా కడతేర్చారా? అన్న సందేహాలు సిబిఐకు కలిగాయి.
అమిత్ స్నేహితుడైన అజయ్ పటేల్ అనే బిల్డర్‌ను యీ విషయంపై ఇంటరాగేట్ చేశారు. సమాధానంగా 'ఈ విషయమే అమిత్‌ను అడిగాను. అతను నవ్వి 'తనను సజీవంగా వుంచుకునే అవకాశాన్ని సొహ్రాబుద్దీన్ స్వయంగా చెడగొట్టుకున్నాడు' అన్నాడు.' అని చెప్పాడతను. '…అంటే మీ ప్రత్యర్థుల హత్యకై సొహ్రాబుద్దీన్‌ను ఉపయోగించుకుంటే అతను తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగాడన్నమాట, అందుకే అతన్నీ లేపేశారు. ఇదంతా మోదీ చెప్పినమీదట నువ్వు చేశావు కదూ' అంటూ సిబిఐ అమిత్‌పై చాలా ఒత్తిడి తెచ్చింది.
అప్రూవర్‌గా మారిపొమ్మనమని ఆశలు చూపింది. అయినా అమిత్ లొంగలేదు. మోదీకి వ్యతిరేకంగా ఒక్కమాట అనలేదు. హంతకుడనే ముద్ర తనే మోస్తున్నాడు. కోర్టుల చుట్టూ తనే తిరుగుతున్నాడు. కేసులో యిరుక్కున్నాక మూణ్నెళ్ల తర్వాత బెయిల్ దక్కినా గుజరాత్లో అడుగు పెట్టడానికి వీల్లేదని హై కోర్టు అనడంతో అతను ఆ వనవాసాన్ని ఢిల్లీలో గడుపుతూ జాతీయ నాయకులతో తన సంబంధాలు పెంచుకోవడానికి వుపయోగించుకున్నాడు. మోదీ గొప్పతనాన్ని వాళ్లకు చాటి అతనికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేశాడు. రెండేళ్లు పోయిన తర్వాత సుప్రీం కోర్టు అతన్ని గుజరాత్‌కు తిరిగి అనుమతించింది. అప్పుడు గుజరాత్ వచ్చి మోదీకి సహాయపడుతూ వున్నాడు. మోదీ హిందూత్వ మంత్రాన్ని పక్కకు పెట్టి అభివృద్ధి మంత్రం పఠిస్తూండగా, అమిత్ మాత్రం హిందూత్వ విధానాన్నే చాటి చెపుతూ ఎన్నికల కమిషన్ చేత అభిశంసనకు కూడా గురయ్యాడు. ఏది ఏమైతేనేం, అతను నమ్ముకున్న నాయకుడు ప్రధాని అయ్యాడు. పరిస్థితి మారుతోంది. జులై 4 న సిబిఐ కొత్త జడ్జి 'కేసుల విచారణ సమయంలో మీరు స్వయంగా హాజరు కానక్కరలేదు' అంటూ అమిత్‌కు మినహాయింపు కూడా యిచ్చేశాడు.
మోదీ లాగే అమిత్ కూడా ఆరెస్సెస్ మనిషే. అందుకే తనకు సహాయకులుగా ఆరెస్సెస్ నాయకులను తెచ్చుకుంటున్నాడు. 1980లలో ఆడ్వాణీ పార్టీ అధ్యకక్షుడైనపుడు ఆరెస్సెస్ కొందరు ముఖ్యనాయకులను అతనికి సహాయకులుగా పంపింది. వారు బహ్మచారులు, పార్టీ కొరకు ఫుల్‌టైమ్ పని చేయడానికి సిద్ధపడినవారు. వారి పేర్లు – నరేంద్ర మోదీ, కె ఎన్ గోవిందాచార్య, సంజయ్ జోషి. (కొంతకాలానికి మోదీ, జోషి కలహించుకున్నారు, జోషీని పూర్తిగా అణచివేసేదాకా మోదీ ఊరుకోలేదు) ఇప్పుడు ఆరెస్సెస్ తన అధికార ప్రతినిథి అయిన రామ్ మాధవ్‌ను, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ముఖ్య నాయకుడైన శివ్ ప్రకాశ్‌ను అమిత్ వద్దకు పంపింది. గతంలో ఆరెస్సెస్ తన ప్రతినిథులను పంపి బిజెపిలో పట్టు సాధించగా, యిప్పుడు మోదీ-అమిత్ కాంబినేషన్ రివర్స్‌లో ఆరెస్సెస్‌పై పట్టు సాధిస్తుందని పరిశీలకులు ఊహిస్తున్నారు. ఆరెస్సెస్‌కు ప్రస్తుతం చీఫ్‌గా వున్న మోహన్ భగవత్‌కు నితిన్ గడ్కరీపై అభిమానం. అందువలన అవకాశం వస్తే మోహన్‌ను తప్పించడానికి మోదీ వెనకాడడు. మోహన్ కంటె సీనియర్, ఆరుగురు సభ్యులున్న ఆరెస్సెస్ కోర్ కమిటిలో సభ్యుడు అయిన మదన్ దాస్ దేవీకి మోదీ అంటే అభిమానం. మోదీ అనుచరుడైన అరుణ్ జైట్లీకి, ఆరెస్సెస్‌లో బిజెపి వ్యవహారాలు చూసే సురేశ్ సోనీకి మంచి స్నేహం వుంది. వీరి ద్వారా మోదీ, అమిత్‌లు కలిసి ఆరెస్సెస్ నాయకత్వంలోనే మార్పు తీసుకువచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)