జ‌గ‌న్ అడ్డాలో ఏం చేద్దామ‌ని?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు క‌డ‌ప జిల్లా అడ్డా. వైఎస్సార్ కుటుంబానికి మొద‌టి నుంచి క‌డ‌ప జిల్లా ప్ర‌జానీకం గ‌ట్టి మ‌ద్దతుగా నిలుస్తోంది. ఈ కార‌ణంగానే రాష్ట్ర స్థాయిలో నాడు వైఎస్సార్‌, నేడు ఆయ‌న కుమారుడు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు క‌డ‌ప జిల్లా అడ్డా. వైఎస్సార్ కుటుంబానికి మొద‌టి నుంచి క‌డ‌ప జిల్లా ప్ర‌జానీకం గ‌ట్టి మ‌ద్దతుగా నిలుస్తోంది. ఈ కార‌ణంగానే రాష్ట్ర స్థాయిలో నాడు వైఎస్సార్‌, నేడు ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయాలు చేయ‌గ‌లుగుతున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా కాలం ఆయ‌న‌కు సొంత జిల్లాలో బ‌ల‌మైన వ్య‌తిరేక వ‌ర్గం వుండేది. వాళ్లంద‌రినీ దాటుకుని ఆయ‌న రాష్ట్ర‌స్థాయి నాయ‌కుడిగా ఎదిగారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ బీజేపీ నూత‌న సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రాష్ట్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు పురందేశ్వ‌రి శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ఇవాళ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రాయ‌ల‌సీమ జోన్ నేత‌ల భేటీకి ఆమె హాజ‌రుకానున్నారు. పురందేశ్వ‌రితో పాటు మాజీ ముఖ్య‌మంత్రి  న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొన‌నున్నారు. స‌మావేశానికి ఏడు జిల్లాల నుంచి బీజేపీ నాయ‌కులు, క‌న్వీన‌ర్లు వెళ్ల‌నున్నారు.

ప్రొద్దుటూరులో బీజేపీకి అంతోఇంతో బ‌లం వుంది. ఆ ప‌ట్ట‌ణంలో వైశ్య సామాజిక వ‌ర్గం మంచి ప‌ట్టు క‌లిగి వుంది. అలాగే వ్యాపారానికి ప్రొద్దుటూరు ప్ర‌సిద్ధి. వివిధ ప్రాంతాల నుంచి వ‌ల‌స వెళ్లిన వారంతా అక్క‌డ స్థిర‌ప‌డ్డారు. వీరు బీజేపీ అనుకూల వైఖ‌రితో ఉంటారు. 

గ‌తంలో ప్రొద్దుటూరులో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో బీజేపీ అగ్ర‌నేత ఎల్‌కే అద్వానీ పాల్గొన్నారు. అలాగే 2004లో పొత్తులో భాగంగా ప్రొద్దుటూరు టికెట్‌ను బీజేపీకి టీడీపీ కేటాయించింది. దీంతో టీడీపీ నాయ‌కుడు లింగారెడ్డి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగారు. దీన్ని బ‌ట్టి ప్రొద్దుటూరులో బీజేపీకి అంతోఇంతో స్థానం వుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే పురందేశ్వ‌రి ప్రొద్దుటూరును ఎంచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బీజేపీకి క‌డ‌ప జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే స్థానం లేదు. అలాంట‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌కు కంచుకోట అయిన జిల్లాలో పురందేశ్వ‌రి, కిర‌ణ్ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌రకు ఫ‌లిస్తాయో చూడాలి.