గోడ్సే 30లో రాశాను – ''నైన్ అవర్స్ టు రామా'' పూర్తి చేశాక గోడ్సేపై నా వ్యక్తిగత అభిప్రాయం చెప్త్తానని. అది చెప్పేసి, యీ సీరీస్ ముగిస్తాను. ''నైన్..'' పై ఒక పాఠకుడు వ్యాఖ్యానిస్తూ హిస్టారికల్ ఫిక్షన్ వుంటుందా అని ఆశ్చర్యపడ్డారు. తప్పకుండా వుంటుంది. చరిత్రలోని యదార్థసంఘటనలు యథాతథంగా వుంచి, ఆ కాలంలో జరిగినట్లుగా కథ కల్పిస్తారు. ఎన్నో ఉదాహరణలున్నాయి. నేను ఇంగ్లీషులో రాసిన ''డెత్ ఆఫ్ ఎ ఫ్యూజిటివ్'' (''ప్రవాసి'' పేరుతో చేసిన దాని అనువాదాన్ని ఎమ్బీయస్ కథల్లో యిచ్చాను) అలాటిదే. కమల హాసన్ తీసిన ''హే రామ్'' కూడా అలాటిదే. నైన్.. కూడా..! దీనిలో పాత్రల ఔచిత్యం దెబ్బ తిందన్నది వేరే విషయం. ఇక్కడే యింకో మాట కూడా చెప్తాను. పురాణాలను, చరిత్రను కథగా, సినిమాగా, నాటకంగా మలిచినపుడు ప్రధానపాత్రల వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతాయన్న సంగతులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తారు. లేకపోతే వారి యిమేజికి దెబ్బ తగులుతుందన్న భయం. భారతంలో దుష్యంతుడుకి శాపం వుండదు. శకుంతల తన ఆస్థానానికి వచ్చినపుడు నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంటాడు. కానీ దాన్ని నాటకంగా మలచినపుడు కాళిదాసు శకుంతలను అతను మర్చిపోవడానికి ముని శాపం కారణమని, ఆమె అంగుళీయకాన్ని జారవిడుచుకుందనీ కల్పించాడు. ఉత్తర రామాయణంలో హనుమంతుడు వాల్మీకి ఆశ్రమంలో సీతకు తోడుగా వున్నాడని రాయలేదు. కానీ ''శ్రీరామరాజ్యం'' సినిమాలో అలా కల్పించారు. ఇలా అనేకం. చరిత్ర విస్తారంగా చెప్పాను కాబట్టి, దాన్ని ఫిక్షన్‌గా మార్చినపుడు జరిగే మార్పులు చూపడానికి ఆ నవల సారాంశాన్ని యిచ్చాను.
ఇక గోడ్సే వాదనల్లో ఏ మేరకు సమంజసంగా వుందో ఎప్పటికప్పుడు రాస్తూనే వచ్చాను. నేను ఆలోచించిన రీతిలోనే పాఠకులు ఆలోచించాలని లేదు. ఎవరి భావన వారిది. ఇక్కడే యింకో విషయం చెప్పాలి. ఇటీవలి కాలంలో గాంధీకి, నెహ్రూకి వ్యతిరేకంగా రాయడం ఎక్కువైంది. రాయకూడదని కాదు, వాళ్లు జీవించి వున్న కాలంలోనే విమర్శలు వచ్చాయి. అవాస్తవాలతో, అసంగత విషయాలతో, వాళ్లు చెప్పని మాటలను కూడా చెప్పినట్టుగా ప్రచారం చేసి (యీ సీరీస్‌పై వచ్చిన వ్యాఖ్యల్లోనే అటువంటి ప్రయత్నం చూశాం) పని గట్టుకుని కొందరు అసత్యప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా చేసిన తప్పొప్పులతో సరిపెట్టకుండా వారి వ్యక్తిగత విషయాల గురించిన పుకార్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక వైరస్. ఇవాళ వాళ్లయ్యారు, రేపు మరొక నాయకుడి గురించి కావచ్చు. నేను చాలా మంది జీవితచరిత్రలు చదివాను, వారిపై యితరుల వ్యాఖ్యానాలు చదివాను. రాజకీయంగా పొరపాట్లు చేయని వారు యిప్పటిదాకా నాకు కనబడలేదు. ఆ సమయంలో వారు ఎందుకలా ప్రవర్తించి వుంటారు అని నా చిన్నబుర్రకు తోచిన సమాధానాలు చెప్పుకుని వూరుకున్నాను. ఒకటి మాత్రం ఒప్పుకుని తీరాలి. కొన్ని తప్పులు చేసినా ఆ తరం వారు త్యాగమూర్తులే, మహానుభావులే, భరత జాతికి వెలుగు నిచ్చినవారే. ఎవరినీ ఆరాధించవలసిన అవసరం లేదు కానీ వారి నుంచి మంచిని నేర్చుకుని వారిని గౌరవించాలి మనం. గౌరవిస్తూనే వారి తప్పొప్పులను చర్చించే అలవాటు కూడా చేసుకోవాలి. లేకపోతే వ్యక్తిపూజలో మునిగిపోతాం. అయితే చర్చించడానికి బాగా అధ్యయనం చేయాలి. మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా కనబడే అంశాలన్నీ క్రోడీకరించుకుని, తరచి చూసి, బేరీజు వేసుకుని చూసుకోవాలి. నిష్పక్షపాతంగా ఆలోచించుకుని నిర్ణయానికి రావాలి. కొన్నాళ్లు పోయాక కొత్త వాస్తవం మన దృష్టికి వస్తే అభిప్రాయం మార్చుకోవడానికి కూడా వెనకాడకూడదు.
కొద్దికాలం కితం దాకా మన జాతీయ నాయకులను గౌరవించే సంస్కృతి వుండేది. పోనుపోను అందర్నీ తిట్టడమే ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే స్వాతంత్య్రం వస్తే చాలు, ఆకాశం నుంచి అన్నీ వూడిపడతాయని జనాలు అనుకున్నారు. వాటిలో కొన్నే నెరవేరాయి. అన్నీ నెరవేరాయన్న మాట ఎంత అబద్ధమో ఏదీ నెరవేరలేదన్న మాటా అంతే అబద్ధం. 'స్వాతంత్య్రం వచ్చి యిన్నేళ్లయినా, యిది కూడా జరగలేదా…?' అంటూంటారు. అన్నేళ్లలో ఏది సంభవం, ఏది కాదు, ఏదైనా చేయాలంటే ఎన్ని అడ్డంకులు వస్తాయి యివేమీ ఆలోచించరు. ఫిర్యాదులు, ఫిర్యాదులు…! సాధారణంగా పిల్లలకు తండ్రిపై ఎప్పుడూ ఫిర్యాదు వుంటుంది. తగినంత ఆస్తి సంపాదించి పెట్టలేదనో, స్టాటస్ సమకూర్చలేదనో, తనకు పెద్ద చదువులు చెప్పించలేదనో, ఉద్యోగాలకు సిఫార్సు చేయించలేదనో… యిలా. ఆనాటి ఆయన సంపాదన ఎంత, దానిలో ఆయన మిగల్చగలిగినది ఎంత, ఆయన పరిమితులు ఏమిటి, ఆయన నియమాలు ఏమిటి అనేవి పరిగణనలోకి తీసుకోకుండా తండ్రిపై పిల్లలకు అలక వుంటుంది. ఎదిగే వయసులో ప్రతీ వారికి వ్యవస్థలోని అస్తవ్యస్తతపై కోపం సహజం. వ్యవస్థకు ప్రతీకలుగా వారికి వెంటనే కనబడేది తలిదండ్రులే. అందుకే పిల్లలు వారిని సమస్త దోషాలకు బాధ్యులను చేస్తారు. నాయకులు కూడా తండ్రి లాటి వారే కాబట్టి వారిపై కూడా కోపం వుంటుంది. ఈనాడు తెలంగాణవాదులకు కెసియార్ దేవుడిగా కనబడవచ్చు, కానీ ఒక్క తరం గడవనీయండి, ఆనాటి యువత ఏమంటుందో చూడండి. 'ఈ పాటి దానికా ప్రత్యేక తెలంగాణ అడిగింది! తెలంగాణ సాధించి మనకేం ఒరగబెట్టారు?' అని విమర్శిస్తారు. ఈనాటి నాయకులు ఎటువంటి క్లిష్టపరిస్థితుల మధ్య ఏ మేరకు సాధించారు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. దక్కినదానితో సంతృప్తి పడరు.
ఇక గాంధీ విషయానికి వస్తే – గాంధీ జాతి'పిత' కాబట్టి దేశంలోని సమస్త అవగుణాలకు ఆయన్ని బాధ్యుణ్ని చేస్తున్నారు. ఆనాటి పరిస్థితులేమిటి, ఆయన పరిమితులేమిటి, ఆయన మాట యితర నాయకులు ఎంతవరకు విన్నారు, బ్రిటిషువారు ఆయనకు అడ్డంకులు ఎలా కల్పించారు యివన్నీ ఆనాటి కళ్లతో చూడాలి. గాంధీ మాటే శాసనమని, ఆయన తలచుకుని వుంటే భగత్ సింగ్‌ను కాపాడగలిగేవాడని కొందరు వాదిస్తారు. ఆయన సిఫార్సు బ్రిటిషువారు వింటారా? విని భారతీయ ప్రజల్లో ఆయన పరపతి పెంచుతారా? వీలైతే దిగజారుస్తారు కానీ! కాంగ్రెసు చరిత్ర ఆసాంతం చదివితే గాంధీకి కాంగ్రెసుపై ఏ మేరకు, ఎంతకాలం పట్టుంది అనేది తెలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చాక పార్టీని రద్దు చేయమంటే ఎవరైనా విన్నారా? తెలుగుదేశం పార్టీ నాతో పుట్టింది, నాతో పోతుంది అన్నారు ఎన్టీయార్. ఏమైంది, పార్టీ మిగిలింది, ఎన్టీయార్‌ను తరిమేశారు. జనతా పార్టీ అధికారంలోకి రావడానికి జయప్రకాశ్ నారాయణ్ ఎంతో శ్రమించారు. అధికారం చేజిక్కాక ఆయనను పక్కన పడేశారు. గాంధీకి కూడా ఐదారేళ్లలో కాంగ్రెసు వాళ్లు జయప్రకాశ్ గతే పట్టించి వుండేవారు. గాంధీ బతికి వుంటే కాంగ్రెసు వాళ్లు ఆయనతో వేగలేక చచ్చివుండేవారు. కానీ ఆయన చచ్చిపోవడంతో వాళ్లు బతికిపోయారు. ఆయన పేరు చెప్పుకుంటూ బతికేశారు. తమ స్వార్థం కోసం చనిపోయాక గాంధీకి దైవత్వం ఆపాదించారు. సామాన్యప్రజలకు యివన్నీ తెలియవు. వారి దృష్టిలో గాంధీ తమ కోసం తపించిన మహాత్ముడు. భారతీయులు అమాయకులు కాబట్టి యిలా అనుకుంటున్నారనుకోవద్దు, ప్రపంచం మొత్తం మీద గాంధీ అహింసామార్గమంటే ఫాసినేషన్ ఏర్పడింది. ప్రపంచ నాయకుల్లో ఎంతోమందికి గాంధీ ఆదర్శప్రాయుడయ్యాడు. గాంధీపై సినిమా తీస్తే ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఆడింది.
అలాటి గాంధీని చంపి గోడ్సే చరిత్రలో దుష్టుడిగా మిగిలిపోయాడు. గోడ్సే విధానాలు గోడ్సేకు వున్నాయి. వాటికి గాంధీ వ్యతిరేకం. అంతమాత్రం చేత చంపవచ్చా? తనతో విరోధించినందుకు గాంధీ గోడ్సేని చంపేవాడా? గోడ్సే దేశభక్తుడా అంటే దేశభక్తుడే. తన దేశం ఒక పద్ధతిలో వుండాలని అతను కోరుకున్నాడు. గాంధీ దానికి అడ్డుగా వున్నాడనుకుని బలవంతంగా తొలగించివేశాడు. దేశమంటే మట్టి మాత్రమేనా? మనుషులు కాదా? గోడ్సేకు తన విధానాలపై అంత విశ్వాసం వుంటే గాంధీని రాజకీయంగా ఎదుర్కోవాలి, తుపాకీతో చంపేయడమేమిటి? గోడ్సేను సమర్థిస్తే నక్సలైట్లను సమర్థించాలి. వాళ్లూ దేశభక్తులే, తాము అనుకున్న విధంగా సాగితేనే దేశం బాగుపడుతుందని అనుకుని, తమను వ్యతిరేకించిన వారందరినీ చంపివేస్తూ వుంటారు. ఈనాటి యుగంలో హింసకు చాలా గ్లేమర్ వుంది. ఎంతమందిని బాదితే అంత గొప్ప హీరో. కానీ హింసామార్గంలో వెళ్లి వుంటే భారతదేశంలో ఎంతమంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేవారో సందేహం. హింసా మార్గం పట్టిన గోడ్సేను ఎవరు ఆరాధిస్తున్నారు?
గాంధీని గొప్పవాడిగా సినిమాల్లో, నవలలో చూసిచూసి వున్నాం కాబట్టి దానికి భిన్నంగా ఎవరైనా చూపితే వెరైటీగా వుంటుందని కాస్సేపు చూస్తాం. అందుకనే కొన్ని రచనలు, నాటకాలు, సినిమాలు ఆ కోణంలో వచ్చాయి. ఇప్పుడు గోడ్సేని హీరోగా చూపేవి కూడా అలాగే వుంటాయి. అవి తాత్కాలికమైనవే. రాముడు చెడ్డవాడు, రావణాసురుడు గొప్పవాడు అంటూ పెరియార్ తమిళనాడులో రావణలీల నిర్వహించాడు. ఎన్నాళ్లు? ఒక్క ఏడాది! మరి రామలీల! శతాబ్దాలుగా సాగుతోంది. ఇప్పటికీ తమిళనాడులో పిల్లలకు రాముడి పేరే పెట్టుకుంటున్నారు, రావణాసురుడి పేరు పెట్టుకోవడం లేదు. ఈ మధ్య మన రాష్ట్రంలో దళిత కార్డు వుపయోగించి, మహిషాసురుడిని, నరకాసురుడిని స్తుతిస్తూ ఆ పండగల్లో టీవీల్లో కాస్సేపు కాలక్షేపం చేస్తున్నారు. తెలుగు సమాజంలో యింకా మహిషుడి పేరు, నరకుడి పేరు పెట్టుకోవడం లేదు. ఇటీవల గోడ్సేను ఆకాశానికి ఎత్తడం కూడా యిలాటి తాత్కాలికమైన కార్యకలాపమే. ఇంకో వందేళ్లు పోయాక కూడా గాంధీయే నాయకుడిగా వెలుగుతాడు. చరిత్రలో గోడ్సే ఉన్మాదిగానే మిగులుతాడు. అతన్ని ద్వేషించడం కంటె అతనిపై, అతని అభిమానులపై జాలిపడడమే సరైన దండన. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)