కోననకుంటె ఆపరేషన్ తర్వాత కమెండోలను విత్‌డ్రా చేయడం చేతనే తిరుచ్చి శంతన్‌ను సజీవంగా పట్టుకోలేక పోయామని కార్తికేయన్ వాపోయారు. అతను సజీవంగా దొరికి వుంటే, నోరు విప్పి వుంటే అతి ముఖ్యమైన సాక్షిగా మారేవాడని ఆశ పెట్టుకున్నారు కానీ ఆశాభంగమే మిగిలింది. అందువలన సందర్భానుగతమైన సాక్ష్యం, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్సుతోనే కేసు నడిపారు. కాంతన్, రమణన్, తిరుచ్చి శంతన్ సహాయకుల్లో శివథాను, అరుణ వీరంతా జాఫ్నా పారిపోయారు. రాజీవ్ హత్య కేసులో సిట్ చేసిన మొట్టమొదటి అరెస్టులు 1991 జూన్ 11న. అంటే టాడా కింద చార్జిషీటును దాఖలు చేయడానికి 1992 జూన్ 10 వరకు వ్యవధి వుంది. 1991 నవంబరు నాటికి ముద్దాయిల్ని వేటాడే కార్యక్రమం పూర్తయింది. కానీ దొరికిన డాక్యుమెంట్లను, వీడియో కాసెట్లను, ఫైళ్లను, ఫోటోల్ని పరిశీలించి, విశ్లేషించి, కేసు రూపొందించడానికి టైము పట్టింది. ప్రభాకరన్‌తో సహా 41 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. 1044 మంది సాకక్షులను, 10 వేల పేజీల వాఙ్మూలాలను, 1477 డాక్యుమెంట్లని, ఎగ్జిబిట్స్ కింద 1180 వస్తువులను కోర్టుకు సమర్పించింది. 1993 మే నుంచి పూనమల్లిలోని స్పెషల్ కోర్టులో విచారణ మొదలైంది. కేసు విచారణ ముందుకు సాగనీయకుండా నిందితులు చాలా రకాల ఎత్తుగడలు వేశారు. వాటి గురించి సీరియల్ మధ్యలోనే రాశాను. సాకక్షులలో నలుగురు మాత్రమే ప్రతికూలంగా మారారు. చివరకు 1998 జనవరి 28 నాడు అందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది.
వారిలో 11 మంది భారతీయులు – నళిని, భాగ్యనాథన్, పద్మ, అరివు, ఇరుంబొరై, రవి, సుశీంద్రన్, శుభా సుందరం, శాంతి, ధనశేఖరన్, రంగనాథ్‌లు కాగా పుట్టుకతో భారతీయులై శ్రీలంకలో స్థిరపడి, మళ్లీ ఇండియాకు వచ్చిన వారు – విజయన్, సెల్వలక్ష్మి, భాస్కరన్‌లు! ముద్దాయిలు సుప్రీం కోర్టులో అప్పీలు కెళ్లారు. 1998 సెప్టెంబరు – 1999 జనవరి మధ్యలో విచారణ పూర్తయింది. నళిని, శంతన్, మురుగన్, అరివు (పేరారివాలన్)లకు ఉరిశిక్ష! రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌కు ఉరిశిక్ష యావజ్జీవఖైదుగా మారింది. సుప్రీం కోర్టు సిట్‌ను, డి ఆర్ కార్తికేయన్‌ను ప్రత్యేకంగా అభినందించింది. ఈ విచారణ అనుభవాలను కార్తికేయన్, తనతో బాటు కలిసి పనిచేసిన రాధా వినోద్ రాజుతో కలిసి ''ట్రయంఫ్ ఆఫ్ ట్రూత్'' అనే పేర పుస్తకంగా 2004 మేలో వెలువరించారు. దాన్ని ప్రముఖ పాత్రికేయుడు వల్లీశ్వర్ చాలా రసవత్తరంగా తెలుగులోకి అనువదించగా ఎమెస్కోవారు ''నిప్పులాటి నిజం'' పేర 2008 మే లో ప్రచురించారు. ఆ పుస్తకమే నన్ను యీ సీరియల్ రాయడానికి పురికొల్పింది. నేను తమిళనాడులో వున్నపుడే రాజీవ్ హత్య జరిగింది. హత్య, దాని పర్యవసానం, అది రాష్ట్రంలో రేకెత్తించిన అలజడి, పరిశోధన, హంతకుల వేట గురించి ఉత్కంఠ – యివన్నీ ప్రత్యక్షంగా అనుభవించాను. ఆనాడు పేపర్లలో, మ్యాగజైన్లలో వచ్చినవి ఆసక్తి కొద్దీ సేకరించి పెట్టుకున్నాను. అప్పట్లో నేను చాలా అరుదుగా రాసేవాణ్ని. ఇంగ్లీషులో డైరక్టు కథలు, అనువాదాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగులో కథలు రాసేవాణ్ని. ఇలాటి సీరియల్ రాస్తానని కలలో కూడా వూహించలేదు. కార్తికేయన్ పుస్తకం చదివాక, మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి రాస్తే బాగుంటుందనిపించింది. మన దేశంలో యీ స్థాయి నేరపరిశోధన యిప్పటిదాకా జరగలేదు. కార్తికేయన్ కథనం సిట్ దృక్కోణం నుంచి సాగింది. కొన్ని వివాదాస్పద విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. వృత్తిరీత్యా ఆయన ఒక పరిధికి మించి వ్యాఖ్యానించలేరు కదా. నా కలాటి పరిమితులు లేవు, పైగా ఒక సామాన్యుడిగా నేను అనేక కోణాల నుంచి పరామర్శించ గలుగుతున్నాను. నేను ఒక వీక్షకుడి దృక్కోణంలోంచి తేదీల వారీగా కథనం నడిపాను. నా పుస్తకం, కార్తికేయన్ పుస్తకం రెండూ చదివినవారికి ఆ తేడా తెలుస్తుంది.
ఇది నేను చేసిన అత్యంత క్లిష్టమైన రచనల్లో ఒకటి. మధ్యలో వచ్చిన దీర్ఘవిరామాల వలన కొందరికి ఆసక్తి నశించి వుండవచ్చు కానీ ఏకబిగిన చదివితే పుస్తకం ఉత్కంఠభరితంగా వుంటుందనే నా నమ్మకం. నేను విరామాలు యివ్వడానికి నా వ్యక్తిగత వ్యవహారాలే కారణం తప్ప ఒక పాఠకుడు ఆరోపించినట్లు కినిగే డాట్‌కామ్ ద్వారా పుస్తకంగా అమ్ముకోవడానికి కాదు. ఆ మాట కొస్తే కినిగేలో పుస్తకంగా తయారు చేయడానికి నేను పడే శ్రమ, ఆ పుస్తకాలపై రాబడి చూసుకుంటే అదేమీ కిట్టుబాటు వ్యవహారం కాదు. మనలో చాలామంది పుస్తకాలు కొనరు. ఆసక్తికరమైన రచనలు కనబడినపుడు ప్రింట్ ఔట్ తీసి దగ్గర పెట్టుకోరు. తర్వాత గుర్తు వచ్చో, వేరెవరికో చూపడానికో ఏమో ఆర్టికల్ కోసం వెతుకుతారు. నాకు చాలామంది రాస్తారు – ఆర్కయివ్స్ అన్నీ వాళ్లకు పిడిఎఫ్ పంపమని! అలా పంపేటంత టైమే వుంటే సీరియలే రాయనా? ఇప్పటికైనా నేనిచ్చే సలహా ఒకటే – పుస్తకాలు ఎల్లకాలం లభ్యతలో వుండవు. మార్కెట్టులో వచ్చిన రెండు, మూడేళ్లకు అమ్ముడుపోని బుక్‌సెల్లరు వెనక్కి పంపేస్తాడు. రచయిత ఇంకో ఏడాది దాచుకుని తర్వాత తూకానికి అమ్మేస్తాడు, లేదా స్నేహితులకు పంచేస్తాడు. చాలా సందర్భాల్లో తన పుస్తకం కాపీయే అతని వద్ద వుండదు. అందువలన నచ్చిన పుస్తకం కానీ, వ్యాసం కానీ కనబడితే కొని దాచుకోండి. థాబ్దాలుగా అలా నేను సేకరించిన సమాచారం నాకు ఉపయోగపడుతోంది కదా. వ్యాసకర్తలు అవుదామనుకునేవారే జాగ్రత్త పెట్టాలి అనుకోవద్దు. నా దగ్గరున్న సమాచారంలో 90% నాకు వ్యాసాలకు ఉపయోగపడదు. నా సరదా కొద్దీ దాచుకున్నవంతే. పాతవి మళ్లీ చదువుతూంటే కొత్తరకంగా బోధపడతాయి. ఫిక్షన్ కూడా మళ్లీ మళ్లీ చదివినా బాగుంటుంది.
చివరగా – ఈ సీరియల్ రచనకు ఉపయోగపడిన పుస్తక రచయిత కార్తికేయన్‌గారికి, అనువదించిన వల్లీశ్వర్ గారికి, ప్రచురించిన ఎమెస్కో వారికి, నేను ఉపయోగించుకున్న పత్రికా కథనాలు రాసిన, ప్రచురించిన, చిత్రాలు సమకూర్చిన అందరికీ కృతజ్ఞతలు. విరామాలు యిస్తున్నా ఏమీ అనకుండా సహించిన గ్రేట్ ఆంధ్రకు, దాని పాఠకులకు మరీమరీ కృతజ్ఞతలు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)