హద్దుల అతిక్రమణలో ఆరితేరిపోయిన పాకిస్తాన్ ఓవైపు, చొరబాట్లను అడ్డుకుంటూనే తన భూభాగాన్ని రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యే భారత్ ఒక వైపు దాయాది దేశాలైనా నిరంతరం ఒకదానిపై మరొకటి కాలుదువ్వుతూనే ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దు ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య అర్ధరాత్రి సమయంలో బోర్డర్ ఎలా ఉంటుంది? అత్యంత హై సెక్యూరిటీ నడుమ, సరిహద్దులున్నంత మేరా శక్తివంతమైన కాంతులు వెదజల్లే లైట్ల వెలుగులో … ఈ దేశాల మధ్య బోర్డర్ విజువల్‌ను ఆకాశమంత ఎత్తు నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబును అమెరికన్ అంతరిక్ష పరిశోధనా (నాసా) సంస్థ జవాబు చెప్పింది.
అర్ధరాత్రి పూట ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ ఎలా కనిపిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు చెందిన ఆస్ట్రోనాట్ ఒకరు కొన్ని అత్యద్భుతమైన ఫొటోగ్రాఫ్‌లు తీశాడు. వీటిని నాసా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. రాత్రిపూట సైతం అత్యంత స్పష్టంగా వీక్షించడానికి అవకాశమున్న ప్రపంచంలోని అతికొన్ని బోర్డర్‌లలో ఒకటిగా దీన్ని చెబుతారు. ఈ ఫొటోలో రాత్రి పూట సైతం పట్టపగల్లా వెలుగుతున్న కరాచీతో పాటు మరెన్నో విశేషాలు చూడవచ్చు.