ముంబై వరస పేలుళ్ల కేసులో ఒకానొక దోషిగా జైలు శిక్షను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తనకు పెరోల్ కావాలంటున్నాడు. తనను ఒక నెల రోజుల పాటు బయటకు వదలాలని ఈ హీరో కోరుతున్నాడు. వ్యక్తిగత కారణాలను పరిగణనలోకి తీసుకొని తనకు విముక్తి కల్పించాలని దత్ కోరుతున్నాడు. ఇది వరకూ కూడా దత్ పెరోల్ వ్యవహారాలు ఆసక్తికరమైన రీతిలో వార్తల్లో నిలిచాయి. దీంతో ఇప్పుడు దత్ విజ్ఞప్తి మరింత ఆసక్తికరంగా మారింది.
టాడా కోర్టు దత్ ను దోషిగా నిర్ధారించింది. జైలు శిక్షను విధించింది. 2013 సంవత్సరం చివరి లో ఈ శిక్షను అనుభవించడానికి దత్ జైలుకు వెళ్లాడు. అయితే అడపాదడపా ఆయన బయటకు వస్తూనే ఉన్నాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంలో దత్ 118 రోజులు బయటబయటే ఉన్నాడు. పెరోల్ మీద బయటకు వస్తూనే ఉన్నాడు. మరి దత్ కు దొరకుతున్న పెరోళ్లు విమర్శలకు కూడా దారి తీస్తున్నాయి. ఒక ఖైదీకి అన్ని సార్లు విముక్తి కల్పించడం ఏమిటి? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే దత్ మాత్రం ఈ విషయంలో మొహమాట పడటం లేదు. తనకు మళ్లీ పెరోల్ కావాలని విజ్ఞప్తి చేసుకొన్నాడు. నెల రోజుల పాటు బయటకు వదలాలని కోరాడు. మరి ఈ సారి జైలు అధికారులు దత్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి!