ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్ను ప్రవేశ పెట్టి హైటెక్ సీఎంగా తనను తాను అభివర్ణించుకున్న నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు నేలదిగాల్సి వచ్చింది.
గత కొన్ని నెలలుగా ఇంటి గడప దాటి బయటికి రాని చంద్రబాబు, ఇప్పుడు వృద్ధాప్యాన్ని, కరోనాను కూడా లెక్క చేయకుండా ఎక్కడో విసిరేసినట్టుండే మారుమూల కుప్పం బాట పట్టాల్సి రావడం కాసింత విచిత్రంగా అనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా లేదా మెయిన్‌స్ట్రీమ్ మీడియా, జూమ్ మీటింగుల్లో తప్ప నేరుగా మనుషులతో మాట్లాడే అలవాటు తప్పిన చంద్రబాబు, పంచాయతీ ఎన్నికల ఓటమి కారణంగా తన అలవాటు మార్చుకోవాల్సి వచ్చింది.
తన నియోజకవర్గ ప్రజలను కలుసుకోడానికి ఈ వయసులో కుప్పం వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురు కావడం నిజంగా బాబుపై జాలి కలిగేలా చేస్తోంది. మరోవైపు తనను కరివేపాకులా వాడుకున్న బాబు వైఖరిపై సోషల్ మీడియా గుర్రుగా ఉందని నెటిజన్లు వ్యంగ్య కామెంట్స్ చేస్తున్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కుప్పం వెళ్లారు. ముందుగా బెంగళూరు విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం బయల్దేరారు. ఆంధ్రా -కర్నాటక సరిహద్దుల్లో ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఖచ్చితంగా ఏడాది క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో కుప్పం నియోజకవర్గంలో ఆయన ‘ప్రజాచైతన్య యాత్ర’ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు కుప్పానికి వెళ్లారు.
మాట మాట్లాడితే టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, జూమ్ మీటింగ్‌లు, ట్విటర్, ఫేస్బుక్, మీడియా మీట్ అంటూ చావగొట్టే చంద్రబాబు …పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమి ఆయనలో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చింది.
నియోజకవర్గ ఇన్చార్జ్, పీఏలను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని చంద్రబాబుకు అనుభవవంలోకి వచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, తనపై వ్యతిరేకతను తగ్గించుకునే క్రమంలో నేరుగా కార్యకర్తలతో మాట్లాడేందుకు చంద్రబాబు కుప్పానికి వెళ్లాల్సి రావడం గమనార్హం.
ఇంత కాలం చుక్కల్లో చంద్రుడిలా , సోషల్ మీడియాలో విహరిస్తున్న చంద్రన్నా, ఓటమి పుణ్యానైనా తమను కలవడానికి రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు ఇంత కాలం తమను వాడుకుని, అవసరం తీరాక విసిరి పారేసిన బాబు వైఖరిపై సోషల్ మీడియా అలకబూనిందంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. సోషల్ మీడియాను నమ్ముకుంటే వర్కౌట్ కాదనే కదా ….బాబు కుప్పం వెళ్లిందనే వెటకారాలు వెల్లువెత్తుతున్నాయి.