ఓదారుస్తా జాగ్రత్త !

వచ్చేశా! వచ్చేశా! ఓదార్పు యాత్ర కొచ్చేశా! ఇదిగో నిన్నే నిన్నే రా బాబూ ఓదారుస్తా! బాబూ, నాయినా, రండి. ఓదారుస్తా. అమ్మా, తల్లీ, రండి ఓదారుస్తా!   Advertisement అదేంది సారూ. ఓదార్పుదేన్దిక్కు కెళ్లి?…

వచ్చేశా! వచ్చేశా! ఓదార్పు యాత్ర కొచ్చేశా! ఇదిగో నిన్నే నిన్నే రా బాబూ ఓదారుస్తా! బాబూ, నాయినా, రండి. ఓదారుస్తా. అమ్మా, తల్లీ, రండి ఓదారుస్తా!  

అదేంది సారూ. ఓదార్పుదేన్దిక్కు కెళ్లి?

అదే.. మా నాయన చనిపోయాడని  నువ్వు విచారంగా ఉన్నావ్ కదా! అందుకని ఓదార్చటానికి వచ్చా.

మీనాయనెవళు సారూ!

ఎవరేంటి? రాజశేఖర్ రెడ్డి బాబూ. మొన్నటి వరకూ మన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉండేవాడు  కదా!

మన రాష్ర్ట మనబడితివి. అదేనాడో రెండు ముక్కలాయె గదా! మాతెలంగాణ మాకొచ్చె.

అయినాగానీ మా నాయనే మీ గరీబోళ్ళగురించీ ఎంతో కష్ట పడ్డాడు. మీ కోసం ఎన్నో మంచి స్కీములు పెట్టాడు.

టీడీపీ వోళ్ళూ గదే మాట చెబుతున్రు. కాంగ్రేసోళ్ళూ గట్లనే అంటున్రు. ఎవడేమి చేసినాగాని మా బతుకు లిట్టనే ఉన్నయ్ గదాసారూ.

అందరూ వేరు. మా నాయన వేరు. ఆయన చేసినన్ని మంచి పనులు ఇంకెవ్వరూ చేయలేదు.

మా తెలంగాణ భూములన్నీ గుంజుకుని మస్తు పైసలు కమాయించిండు. ఆ సారేనా సారూ?

అంతా అబద్దం. ఇదంతా చంద్రబాబు చేస్తున్న ప్రచారం.

గట్లనా! గట్లయితే ఎన్నో కోట్లు నీ తాన కెళ్లి కోర్టులు ఎందుకు వాపస్ గుంజు కున్నయ్ సారూ?

అది కూడా చంద్రబాబు కుట్రే.   

ఏమో సారూ. మాకేమెరుక? నీకే తెల్వాలె. ఆదట్లుండనీ గానీ మీ నాయన పోతే నువ్వు పరేశానీల ఉండాలే. నేనెందుకు దుఃఖ పడాలె సారూ?

నీకు తెలీదు వెంకటయ్యా. మా నాయన పోయిండని నువ్వు చాలా బాధ పడుతున్నావ్. లోలోపల! ఆ  బాధ భరించలేక రాత్రింబగళ్ళు ఏడుస్తున్నావ్!  ఆ సంగతి నాకు తెలుసు గానీ ఇంకెవరికీ తెలీదు. ఆఖరికి నీక్కూడా తెలీదు.

నీ మాటలు నాకు సమజ్ కావటంలే సారూ. నువ్వేం దేముడివా, నేను లోపట ఏం సోన్చాయిస్తున్నానో తెలియనికి? ఇగో మా నాయిన పోతేనే నేను దుఃఖ పడలే! మీ నాయన పోతే నాకేడెకళ్లి  దుఃఖముంటది? 

ఉంటది. నాకు తెలుసు. నిన్న రాత్రి దేవుడు కలలో కొచ్చి చెప్పాడు.

‘బాబూ జగన్, వరంగల్ జిల్లాలో వెంకటయ్య అనే రైతు మీ నాయన పోయిండని  ఎంతో దుఃఖ పడుతున్నాడు. వెంటనే వెళ్లి ఓదార్చు.’ అని ఆజ్ఞాపించాడు.     

ఇగో.. దేవుడు సత్యమే జెప్పిండు సారూ. నేను ఎంతో దుఃఖంలో ఉన్నా. కానీ నా దుఃఖం మీ నాయన పెద్దమనిషి పేరేందంటివి?

వయ్యస్సార్..

ఆ.. నా దుఃఖం ఆయన దిక్కు కెళ్లి కాదు.

మరి?

పంటలు పండకపాయే.. వానలు కురవకపాయే.. బాంకుల అప్పులాయే.. అదే దుఃఖం సారూ నాకు.. రాత్తిరీ పగలూ 

గదే  దుఃఖం.

అందుకే దేముడు నన్ను నీదగ్గరకు పంపాడు.    

అయితే గిప్పుడేమంటావ్ సారూ. 

నిన్ను ఓదారుస్తా.

గంటే ఎన్ని పైసలిస్తావు సారూ?

ఆ పైసలా? పైసలేంటి?

మరి ఓదార్చుడంటే ఇంకేంది సారూ?

నువ్వేం దిగులు పడకు. నీకు నేనున్నానని  భరోసా ఇవ్వటాని కొచ్చా.

భరోసా ఇయ్యనికి మస్తు మంది ఉన్నారు సారూ. నాకు పైసలు గావాలె.

పైసలు ఎందుకు?

నా దుఃఖం పోనికి. నీ ఓదార్పు భరించనికి

ఇదిగో చూడు.. నా దగ్గర పైసలు వచ్చుడే గానీ పోవుడు లేదు. బొత్సను చూడు.. వోటు పోయింది సీటు పోయిందని ఒకటే ఏడుపు. వెళ్లి ఓదార్చా. నాపార్టీలో కొచ్చాడు.

నాకు ఓటూ లేదు సీటూ లేదు సారూ. నా జిందగీల ఇప్పటివరకూ వోటే వెయ్యలే.

అట్లాగా.. ముందే చెప్పవేం మరి. ఇంకా నిలబడ్డా వేంది? పో.

సారూ.. పోతా గానీ పోయే ముందు నేనే నిన్ను ఓదారుస్తా సారూ.

ఆ. నువ్వా? నన్ను ఓదారుస్తావా? 

అవ్ సారూ.

ఎందుకు? నన్నెందుకు ఓదారుస్తావ్?  

జైలుకి పోయే రోజులు దగ్గర కొచ్చినాయ్ కద్సార్.

యర్రంశెట్టి సాయి