ఇంకొక సాంకేతిక అంశం టిడిపి నాయకులు చర్చల్లో లేవనెత్తారు కానీ బాబు తన లేఖలో ప్రస్తావించలేదు. ఈ వ్యవహారం ఎసిబి పరిధిలోకి రాదని, అయితే గియితే ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని వారి వాదన. బాబు తన లేఖలో 'ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది' అని వదిలేశారు తప్ప ఎసిబిని ఎలా ప్రయోగించారు అని ప్రశ్నించలేదు. 'స్టింగ్ ఆపరేషన్ ముసుగులో భయాందోళనలకు గురి చేసే కుట్రకు ఒడిగట్టారు' అన్నారు. స్టింగ్ ఆపరేషన్‌కు భయపడేవారు ఎవరు? నేరస్తులే కదా! స్టింగ్ ఆపరేషన్లు చేయకూడదు అని టిడిపి వాదించగలదా? అలా మాట్లాడితే అన్యాయాలు వెలికి రావడం మీకిష్టం లేదన్నమాట అని అవతలివాళ్లు అడుగుతారు. అసలు ఒక మాట – ఎసిబికు అధికారం వుందా లేదా, వీడియో వాళ్లు తీశారా, మరొకరు తీశారా, టీవీ ఛానెల్‌కు ప్రభుత్వ మద్దతు వుందా లేదా? ఇవన్నీ సాంకేతిక విషయాలు. రామ్ జెఠ్మలానీ లాటి వాళ్లు లేవనెత్తే ప్రశ్నలు. థాబ్దాలుగా చూస్తున్నాను. ఏదైనా ఘోరమైన నేరం జరగగానే నిందితుడు రామ్ జెఠ్మలానీని పిలుస్తాడు. ఆయన వచ్చి కోర్టులో మొట్టమొదట లేవనెత్తే ప్రశ్న – 'అసలు యీ కేసు విచారించడానికి నీకు జ్యురిస్డిక్షన్ వుందా?' అని. ఈ కేసు యీ సెక్షన్ కింద రాదు, మరో సెక్షన్ కింద వస్తుంది వంటి సాంకేతిక అంశాలు లేవనెత్తి, నిందితుడికి బెయిలు తెప్పిస్తాడు. ఆ తర్వాత కాలికేస్తే వేలికేసి, వేలికేస్తే కాలికేసి కేసు సాగదీస్తాడు. చివరకు ముద్దాయో, న్యాయమూర్తో, పాలకులో ఎవరో ఒకరికి ఏదో ఒకటి అయి శిక్ష వాయిదా పడుతుంది, లేక తగ్గుతుంది. చట్టాల ప్రకారం రామ్ జెఠ్మలానీ విజయం సాధించవచ్చు కానీ ప్రజల దృష్టిలో ముద్దాయి ముద్దాయిగానే నిల్చిపోతాడు. వీడియో తీయడం తప్పయితే, దాన్ని సాక్ష్యంగా చూపడం తప్పయితే కోర్టు వాటి సంగతి చూస్తుంది. ఎసిబి తన పరిధికి మించి వ్యవహరిస్తే దానికీ అక్షింతలు పడతాయి. నేరం జరిగిందా లేదా అన్నదే ప్రజలు గమనిస్తారు.
నేరాన్ని అరికట్టడానికి లేదా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు అనేక విధానాలను అవలంబిస్తారు. దొంగతనం చేసినవాణ్ని బుజ్జగిస్తూ అడిగితే వాడు నేరం ఒప్పుకోడు. నాలుగు తగిలిస్తేనే నిజం చెపుతాడు. అది చట్టవిరుద్ధం కావచ్చు. కానీ పోలీసువాళ్ల పద్ధతే అది. మెత్తగా వుంటే సాక్ష్యం ఎప్పటికీ దొరకదు. కోర్టులు కూడా యీ సంగతి గ్రహించి పోలీసు క్రౌర్యాన్ని చూసీచూడనట్టు వదిలేస్తాయి – లాకప్ డెత్ అయితే తప్ప! ఇలాటి నేరాలు పట్టుకోవడం ఎసిబి పని కాదు అంటున్నారు టిడిపి నాయకులు. మరి ఎవరి పని? రేపు ఆంధ్రలో వైసీపీ నాయకులు టిడిపి ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తే వాళ్లను ఎలా పట్టుకుంటారు? ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా? వాళ్లు కదిలి వచ్చేటప్పటికి యిక్కడివాళ్లు ఎలర్ట్ అవరా? ఎన్నికల కమిషన్ ఎన్నికల టైములోనే కింగ్, మామూలు సమయాల్లో కోరలు లేని పాము. ఋణమాఫీ గురించి వంటి టిడిపి ఎన్నికల వాగ్దానాల గురించి ఎన్నికల సమయంలో వారిని నిలదీసింది. అవి ఆచరణసాధ్యమే అని టిడిపి అప్పుడు కమిషన్‌కు నచ్చచెప్పుకుంది. ఇప్పుడు ఆచరణసాధ్యం కాదు అని చేతులెత్తేసింది. కమిషన్ ఏం చేయగలుగుతోంది? అబద్ధపు వాగ్దానాలతో నెగ్గిన ఎన్నిక చెల్లనేరదు అని టిడిపి నాయకుల ఎన్నికను రద్దు చేయగలదా?
ఎన్నికల టైములో రాష్ట్ర యంత్రాంగం సమస్తం ఎన్నికల కమిషన్ చెప్పినట్టు పని చేయాలి. ఎన్నికలు అయిపోయాక రాష్ట్రప్రభుత్వానిదే అజమాయిషీ. సాధారణ ఎన్నికల టైములోనే కమిషన్‌కు ఆ విశేషాధికారాలు. ఉపయెన్నికల టైములో, కౌన్సిల్ ఎన్నికల టైములో అలాటివి వుపయోగించినట్లు ఎన్నడూ చూడలేదు. ఉపయెన్నికల టైములో కొత్త స్కీములు ప్రకటించకూడదు, వేళ దాటి ఉపన్యసించకూడదు వంటి చిన్న చిన్న ఆదేశాలు యివ్వడమే తప్ప యిలాటి స్టింగ్ ఆపరేషన్లు చేసి ఫిరాయింపుదార్లను అరికట్టిన ఉదంతం యిప్పటిదాకా వినలేదు. ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఎన్నికల కమిషన్ మాట ఎత్తారు. రేపు టిడిపి ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టి దానికి అనుకూలంగా ఓటేయమని టిడిపి ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టిందనుకోండి. అప్పుడు ఏ శాఖ కలగజేసుకోవాలి? చెప్పండి. ఎందుకైనా మంచిది ఇవన్నీ ముందే అనేసుకుంటే నాయకులకు, ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ఎసిబిని దింపడం తప్పు అని కేంద్రం యింకా ఏమీ అనలేదు. అయినా సమర్థుడిగా పేరుబడ్డ ఎకె ఖాన్‌కు తన పరిధి తెలియకుండా వుండదు. రేవంత్ స్టింగ్ ఆపరేషన్ టీ-ఛానెల్ నిర్వహించి వుంటే అదంతా బోగస్ అనేయగలిగేవారు. అందుకే ఎసిబిని దింపారు. అబ్బే కాదు, యిది హోం శాఖ పరిధిలోకే వస్తుంది అంటే ఎసిబి తమకు దొరికిన సాక్ష్యాలను వాళ్లకు బదిలీ చేసేయవచ్చు. అప్పుడేమంటారు?
బాబుగారికి హఠాత్తుగా సెక్షన్ 8, హైదరాబాదుపై గవర్నరు అధికారాల సంగతి గుర్తుకు వచ్చింది. నిజానికి విభజన చట్టంలో దాన్ని పెట్టడమే తప్పు. హైదరాబాదును కేంద్రపాలితం చేయాలి, లేకపోతే ఆంధ్రుల ఆస్తిపాస్తులకు, మానప్రాణాలకు ముప్పు అని వాదించిన ఆంధ్ర కాంగ్రెసు నాయకులను చల్లార్చడానికి ఆ సెక్షన్ చేర్చారు. ఏ మాట కా మాట చెప్పాలంటే అలా పెట్టడం రాష్ట్రప్రభుత్వంపై విశ్వాసరాహిత్యమే. తన పౌరులను అది కాపాడదని, కేంద్ర ప్రభుత్వ ప్రతినిథి దానిపై అజమాయిషీ చేయాల్సిందేనని ఒప్పుకున్నట్లు అయింది. తెలంగాణలో ఈ రోజు తెరాస ప్రభుత్వమైంది, రేపు టిడిపి ప్రభుత్వమే రావచ్చు. అప్పుడైతే యీ సెక్షన్ అక్కరలేదని అనగలరా? విభజన జరిగి ఏడాది అయింది. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం అనేక ఉమ్మడి ఆస్తులను స్వాధీనం చేసేసుకుంది. ఆంధ్ర అధికారులను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్న సందర్భాలున్నాయి. వీటిపై టిడిపి యింత పెద్ద ఎత్తున ఉద్యమించలేదు. ఎందుకంటే తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదు పై గవర్నరు అజమాయిషీ అంటే ఏ తెలంగాణ నాయకుడికి రుచించదు. రాజకీయంగా యిక్కడ బలపడదలచిన టిడిపి దీని గురించి గట్టిగా పట్టుబడితే సెంటిమెంటుకు వ్యతిరేకంగా వెళ్లినట్లవుతుందని భయపడింది.
ఈ రోజు తన చాప కిందకే నీరు రావడంతో బాబు ఉలిక్కిపడి లేచి, గవర్నరుకు అధికారాలు అప్పగించవలసినదే అని పట్టుబడుతున్నారు. రేపు మర్నాడు బిజెపి తన పార్టీ నాయకుణ్ని గవర్నరుగా పంపి, బాబును యిరకాటంలో పెట్టడానికి యిలాటి స్టింగ్ ఆపరేషన్‌కు ఆదేశిస్తే అప్పుడు ఎవరికి అప్పగించమంటారు? గవర్నరు అంటే రాజకీయ నియామకమే అని అందరికీ తెలుసు. బాబుకి యీరోజు బిజెపి మిత్రపక్షం. రేపటిమాట ఎవరికి తెలుసు? బాబు కొంతకాలం కమ్యూనిస్టులతో కలిసి బిజెపిని ఓడించడానికి ప్రయత్నించారు, యింకొంతకాలం బిజెపితో కలిసి కమ్యూనిస్టులను ఓడించడానికి చూశారు. టిటిడి బోర్డు విషయంలో మాట తప్పిన బాబును దారికి తేవడానికి బిజెపి రేవంత్ అంశాన్ని కాస్త వాడుకుంది. కానీ తెలుగు మీడియా బాబు ఢిల్లీ వెళ్లగానే మోదీ భరోసా యిచ్చారని, అండగా వుంటామని అమిత్ షా హామీ యిచ్చారని రాసేసింది. అండ సంగతి అవతల తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి టిటిడి బోర్డు సంగతి గిల్లి గుర్తు చేసినట్లు తేలింది.(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)