జగజ్జేత తెలుగుజాతి పరువు ఢమాల్

అవనికి దశదిశాలా తెలుగు బిడ్డల ఘనత జేగీయమానమై అలరారుతూ ఉంటుంది… తెలుగుతల్లి, తెలంగాణ తల్లుల యశశ్చంద్రికలు దివ్యకాంతులను వెదజల్లుతూ ఉంటాయి.. తెలుగుజాతి వైభవం, తెలుగు కీర్తిప్రతిష్టలు అన్నీ ఆచంద్రతారార్కమై పరిఢవిల్లుతూ ఉంటాయి…  Advertisement పదాడంబరంతో…

అవనికి దశదిశాలా తెలుగు బిడ్డల ఘనత జేగీయమానమై అలరారుతూ ఉంటుంది… తెలుగుతల్లి, తెలంగాణ తల్లుల యశశ్చంద్రికలు దివ్యకాంతులను వెదజల్లుతూ ఉంటాయి.. తెలుగుజాతి వైభవం, తెలుగు కీర్తిప్రతిష్టలు అన్నీ ఆచంద్రతారార్కమై పరిఢవిల్లుతూ ఉంటాయి… 

పదాడంబరంతో కూడుకున్న ఇలాంటి స్తోత్రపాఠాలన్నీ ఇక గతం. తెలుగుజాతి పరువు మొత్తం ఢమాల్ మని పేలిపోయింది. ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన సంగతి.. దానికి అనుబంధంగా జరిగిన కుట్ర, లేకి రాజకీయ బేరసారాల గురించిన పరువు నష్టం మాత్రమే కాదు.. తెలుగుజాతి రెండు రాష్ట్రాలుగా ఉన్న ఈ రోజున… పాలకులుగా వర్తిల్లుతున్న వారు.. ఒకరి గురించి ఒకరు ఎంత హేయంగా మాట్లాడుకుంటున్నారో… ఒకరినొకరు రచ్చకీడ్చడానికి ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో… ఇలాంటి సక అవకతవకల పనులన్నిటినీ తతిమ్మా దేశం, ప్రపంచం హేళనతో కూడిన నవ్వులతో గమనిస్తున్నది. ఒకరి పరువు తీసేయడం లక్ష్యంగా మరొకరు.. పాలకులే ప్రయత్నిస్తుండడం పరాకాష్ట. 

నిజానికి ఒకరి ఎదుగుదలకు వెనుక గోతులు తీయడానికి అందరూ కలిసి కుట్రలు చేసిన వైనం.. ఇదివరలోనూ ఉండేది. కాకపోతే.. ఇప్పుడు అవి తారస్థాయికి చేరుకుని.. యావత్తు తెలుగుజాతి పరువు ప్రతిష్ఠలు అనబడేవి.. గాలి బుడగలాగా ఇప్పుడు ఒక్కసారిగా ఢమాల్ మన్నాయి. 

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు. కోర్టుల్లో జాతి పరువు పోతోంది. తెలుగుజాతిని బజారు కీడుస్తున్నారు… ఇలాంటి పడికట్టు మాటలు ఇక రాజకీయ నాయకులు చెప్పుకోడానికి అవకాశం లేదు. ఎందుకంటే.. అందరూ కలిసి అలాంటి పరువు ప్రతిష్ఠల్ని భూస్థాపితం చేసేశారు. 

ఇన్నాళ్లూ కొట్టుకోవడమూ గౌరవంగానే ఉంది..

తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది. నీళ్ల కోసం కొట్టుకుంటున్నాం.. విద్యాసంస్థలు విద్యావకాశాల కోసం కొట్టుకుంటున్నాం… కరెంటు కోసం కొట్టుకుంటున్నాం.. ఉద్యోగావకాశాల కోసం కొట్టుకుంటున్నాం.. ఇలాంటి విషయాల్లో ఎంత కొట్టుకున్నా కూడా తెలుగుజాతి గౌరవం చెడిపోలేదు. భంగపడలేదు. అన్నదమ్ముల్లా విడిపోయిన మనం.. అన్నదమ్ముల్లా కొట్లాడుకున్నట్లే ఈ వ్యవహారాలన్నీ గడిచాయి. సహజంగా విడిపోయే ప్రతిచోటా ఇలాంటి తగాదాలు ఉంటాయని అందరూ సహజంగానే తీసుకున్నారు. హక్కులకోసం కూడా పోరాడకుండా  రాష్ట్రాలు ఎలా మనుగడ సాగిస్తాయిలెమ్మని సర్దుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కొట్టుకోవడం కూడా గౌరవప్రదంగానే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 

విమర్శలు మరియు తగాదాల స్థాయి మారిపోయింది.  ఎప్పుడైనా సరే.. మనం చేస్తున్న పని ద్వారా మనం ఆశించే లక్ష్యాన్ని బట్టి.. మనమీద ఎదుటివారికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. నీళ్లు, కరెంటు, విద్యాసంస్థల కోసం కొట్టుకున్నప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల గౌరవం భద్రంగా ఉన్నది అందుకే. అయితే ఇప్పుడు జరుగుతున్న తగాదా, పరస్పర నిందారోపణలకు సంబంధంచి వారి లక్ష్యం ఏమిటి? ‘ఎదుటివారి మీద బురద చల్లడం మాత్రమే’!! సామాజిక ప్రయోజనం కాకుండా.. ఇలాంటి సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించి రెండు రాష్ట్రాల పాలకులు… రెండు రాష్ట్రాల ప్రభుత్వాల తగాదాగా మార్చివేసిన ఈ కీచులాట అంతిమంగా ఎటు మలుపు తిరుగుతుందో కూడా అర్థం కావడం లేదు.

హేయమైన తగాదా ఇది!

ఇక్కడ ఏం జరిగింది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలానికి మించి.. సీట్లను గెలుచుకోవాలని తెదేపా తెరాస రెండు పార్టీలూ ఆశపడడం అనేది వికటించింది. ఉన్నబలం కొంచెమే అయినా.. మద్దతుగా మజ్లిస్ వైకాపా వంటి పార్టీలతో మాట్లాడుకున్నది గనుక.. తెరాస రంగంలోకి అయిదుగురిని దించింది. ఎవరి బేరాలు వారు సాగించుకున్నారు. ఆ క్రమంలో భాగంగా తెదేపా సాగించే ఒక బేరం తెరాస దృష్టికి వచ్చింది. ప్లాన్డ్‌గా ఉచ్చు బిగిస్తే కడు వినోదంగా ఉంటుందని వారు అనుకున్నారు. ప్లాన్ ప్రకారం వెళ్లి.. చిన్న చేప వచ్చి వలలో చిక్కింది. పెద్ద చేప వలకు వెలుపల గిలగిల్లాడుతోంది. ఇదీ పరిస్థితి. 

రాజకీయ అవినీతిని, ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనే దుష్ట సంసృ్కతిని దునుమాడడానికి.. రాజకీయ కుళ్లును కడిగేసి సమాజాన్ని ఉద్ధరించేయడానికి తమ ప్రభుత్వం (లేదా పార్టీ) ఆధ్వర్యంలో ఇలాంటి ప్రయత్నం జరిగిందని తెరాస చెప్పి ఉంటే.. ప్రజలంతే నవరంధ్రాలతో నవ్వుకునేవాళ్లు. అయితే కేసీఆర్ కూడా అదేమీ చెప్పలేదు. ‘‘ఏసీబీకి కంప్లయింటు వస్తే.. దాని మీద వారు  చర్యలు తీసుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా నేరం జరుగుతుండగా పట్టుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’’ అని మాత్రమే అంటున్నారు. చంద్రబాబు ఫోను సంభాషణల రికార్డులు కూడా రిలీజైన తర్వాత.. వాతావరణం హీటెక్కింది. 

అప్పటిదాకా చాలా బింకంగా ఈ సబ్జెక్టు మీద మాట్లాడకుండా జాగ్రత్తలు పాటించిన చంద్రబాబు లోని ఆవేశం (ఏమో! అది భయం కూడా కావచ్చనేమో!!) ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. ఒక నేరం గురించిన చర్చ జరుగుతూ ఉంటే.. అప్రస్తుత ప్రసంగంలాగా ఆయన వాదన సాగింది. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి మీదకు నేరుగా తన విమర్శలను సంధించారు. ఒక నేరం గురించి.. ఇద్దరు వ్యక్తులు పరస్పరం నిందలు వేసుకుంటూ మాట్లాడుకోవడం సహజమే కావచ్చు. కానీ తెలుగు ప్రజల ఖర్మానుసారం.. వారిద్దరూ రెండు రాష్ట్రాలకూ పాలకులు అయ్యేసరికి.. ఆ ఇద్దరి తగాదా రెండు రాష్ట్రాల తగాదాలాగా మారిపోతున్నది. అందుకే ఇది చాలా హేయమైన గొడవ అని చెప్పాలి. 

తెదేపే వాదనలన్నీ తేలిపోయేవే…

నిజానికి చంద్రబాబునాయుడు లేదా తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదనలన్నీ బలం లేనివి. ఒక నేరం జరుగుతూ ఉండగా.. నేరానికి పాల్పడుతున్న వ్యక్తి పట్టుబడ్డ తర్వాత.. అతణ్ని రిమాండులో పెడితే.. ఆ నేరానికి సంబంధం లేకుండా మాట్లాడడం అనేది తెదేపా అగ్రనేతలకు మాత్రమే చెల్లింది. నేరానికి సంబంధించి వారంటున్న మాట కేవలం ఒకటే.. ‘స్టింగ్ ఆపరేషన్లు చెల్లవు అని సుప్రీం కోర్టు తీర్పు ఉందన్న విషయం మాత్రమే’. అలాంటి నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు ఎంత తర్కరహితమైన వాదనలు చేస్తున్నారంటే.. దానివలన ఆంధ్రప్రదేశ్ పరువు పోతున్నది. 

‘నీకు పోలీసులున్నారు.. నాకు పోలీసులున్నారు.. నీకు ఏసీబీ ఉంది.. నాకు ఏసీబీ ఉంది…’ ఏపీ పల్లెలల్లోని సభలనుంచి.. ఢిల్లీ ఎన్డీటీవీ ఇంటర్వ్యూల వరకు ఆయన ఈ పడికట్టు మాటలనే వినిపిస్తున్నారు. అయితే ఏంటి? ఆయనకు పోలీసులు ఏసీబీ లేరని ఎవరన్నారు. ఈ మాటల ద్వారా ఆయన ఏం చెప్పదలచుకుంటున్నారు? లేదా, ఎవరిని బెదిరించదలచుకుంటున్నారు.. అనేది అసలు అర్థం కావడం లేదు. 

ఫోన్ల ట్యాపింగ్ అనే పదాన్ని కొత్తగా తెరమీదికి తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం మీద ఢిల్లీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. మీ ఎమ్మెల్యే దొరికిపోయిన నేరం సంగతేంటి సారూ అని జనం అడుగుతోంటే.. మా ఫోను కాల్స్ వింటున్నారు అంటూ రాగాలాపన చేయడం ఆయనను ఈ సమస్యనుంచి ఎలా గట్టెక్కిస్తుందని అనుకుంటున్నారో.. అలాంటి వ్యర్థ ప్రేలాపనల వల్ల.. నేరం వలన పడిన మచ్చ మసకబారిపోతుందని ఎవరు సలహా ఇచ్చారో తెలియడం లేదు. రాష్ట్రాల మధ్య గొడవగా ఉన్న ఈ సిగ్గుమాలిన నేర వ్యవహారాన్ని ఆయన ఢిల్లీ దాకా తీసుకువెళ్లారు. అక్కడ ఏం జరగాలని ఆయన కోరుకున్నారో తెలియదు గానీ.. మొత్తానికి ఢిల్లీ వీధుల్లో తెలుగుజాతి పరువు మొత్తం మంటగలిసిపోయింది. 

రాజకీయ పరస్పర కుట్రలే జాతి పరువు తీస్తున్నాయ్…

ఇలాంటి పోకడలు ఇవాళ కొత్త కాదు. ‘తనకు ఒక నష్టం జరిగితే.. కలిగే బాధ కంటె తన పొరుగువాడికి కూడా అదే నష్టం జరిగితే కలిగే ఊరట ఎక్కువ’ అనేది మన తెలుగు వాళ్లేక వర్తిస్తుందా? లేదా, ఎదిగేవాడి మీద బురదచల్లి, కాళ్లు పట్టుకుని వెనక్కు లాగితే జీవితం ధన్యత చెందినట్లే భావించే వైఖరి బహుశా మన నేతల్లోనే ఉంటుందేమో.  ముందే అనుకున్నట్లు ఇది ఇవాళ కొత్త కాదు. గతంలో వైఎస్ జగన్.. ఢిల్లీ పార్టీ అధిష్ఠానం పెత్తనాన్ని సవాలు చేస్తూ తలెగరేసి నిలబడ్డప్పుడు.. ఆయన మీద బురద చల్లడానికి అందరూ ఎగబడ్డారు. 

కాంగ్రెసు వందిమాగధుల్లో ఒకడిగా కాకుండా.. స్వతంత్రమైన వ్యక్తిగా, ఒక పార్టీగా జగన్ ఆవిర్భవిస్తే.. తమ తమ భవిష్యత్తుకు ప్రమాదం అనుకున్న అన్ని పార్టీల నేతలూ ఒక్కటయ్యారు. తిమ్మిని బమ్మిని చేసి, గోరంతలు కొండంతలు చేసి.. లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కాజేశారంటూ.. అదే పనిగా కోళ్లయి కూశారు. జగన్ అవినీతి నిజానిజాల సంగతి తరువాత.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీరు ఎలుగెత్తి చేసిన నినాదాలు.. ప్రపంచం దృష్టిలో ‘తెలుగోడు అంటేనే అవినీతి పరుడా’ అనే సందేహాలు రేకెత్తే పరిస్థితిని సృష్టించాయి. జగన్‌ను దెబ్బతీయడం టార్గెట్ అనుకున్నారే తప్ప.. తెలుగుజాతి పరువు పోతున్నదనే సంగతిని ఎవ్వరూ పట్టించుకోలేదు. 

ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. కుదిరితే చంద్రబాబును జైలు పాల్జేయాలన్నంత దూకుడుగా కేసీఆర్ ప్రయత్నాలు, తన ఏసీబీ కేసీఆర్‌ను పట్టుకునే మార్గం దొరకదా అనే అన్వేషణలో ఉన్నట్లుగా చంద్రబాబు చెలరేగిపోతున్నారు గానీ.. వీరిద్దరి పరస్పర నిందారోపణల వల్ల తెలుగుజాతి పరువు  ప్రతిష్ఠలు అనేవి.. భ్రష్టు పట్టిపోతున్నాయి. 

తెలుగోడంటే.. జనం నవ్వుతున్నారు..

కేవలం ఢిల్లీ కాదు. మన తెలుగు ఊళ్లలోనే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు.. ఈ రాజకీయ కీచులాటలను చూసి గేలిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం పదవుల కోసం ఇంత దిగజారి ప్రవర్తించేవారు మీ పాలకులా అనే ప్రశ్న అలాంటి గేలి నవ్వుల్లో కనిపిస్తోంది. 

ఈ దుస్థితి ఎందుకు వచ్చింది. మనం ఎలాంటి పాలకుల్ని ఎన్నుకున్నాం. ఎలాంటి పాలకులు మనకు ఈ పరిస్థితిని కల్పించారు.  నిందలు వేస్తున్న వారు, భరిస్తున్న వారు, పక్క వాయిద్యాలు వేస్తున్న వారు.. ఈ బృందాలలో ఎవరైనా సత్యసంధులు, సచ్ఛీల పరాయణులు నిజంగా ఉన్నారా? అనే సంగతులు వివేకవంతులైన ప్రజలకు తెలుసు. మరి ఇలాంటి పరువునష్టం పనుల నుంచి తెలుగుజాతికి విముక్తి మార్గం చూపడం ఎలాగో కూడా ప్రజలకు కచ్చితంగా తెలిసి వస్తుంది. 

 సురేష్