తెలుగు సినీ రచయితల సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులకు స్క్రీన్‌ప్లే తరగతులు అప్పుడప్పుడూ నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా సినిమా రంగం మీదమోజు ఉండే యువతరం చాలా మందే ఉంటారు గనుక.. వారిలో తాము సినిమాకు సరిపడా కథ ఇచ్చేయగలం అని అనుకునే వారు కూడా చాలా మందే ఉంటారు గనుక.. ఈ సినీ రచయితల సంఘం పరిపుష్టంగానే ఉంటుంది. పైగా ఇలాంటి శిక్షణ తరగతుల్ని నిర్వహించినప్పుడు.. సభ్యుల్లో చాలామంది ఎగబడి క్లాసులకు వస్తుంటారు. ఆ రకంగా కూడా సంఘానికి ఓమోస్తరు వ్యాపకమూ మరియు ఆదాయమూ సమకూరుతూ ఉంటుంది. అయితే ఇలాంటి స్క్రీన్‌ప్లే శిక్షణ తరగతులు సభ్యులకు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయంలో మాత్రం సభ్యుల్లో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.
నిజానికి గతంలో కూడా ఇలాంటి స్క్రీన్‌ప్లే రైటింగ్ వర్క్‌షాపులను పలుమార్లు నిర్వహించారు. ఆసక్తి గల వారు మాత్రమే నిర్ణీత రుసుము చెల్లించి హాజరు కావొచ్చు. సంఘంలో సభ్యులు కాకపోయినా కూడా.. రుసుము చెల్లిస్తే అనుమతిస్తుంటారు. అయితే ఇదివరకటి క్లాసులకు హాజరైన వారు మాత్రం.. ఇవిపెద్ద ఉపయోగకరంగా ఉండడం లేదని.. సినిమా స్క్రీన్‌ప్లే గురించి కనీస అవగాహన కూడా కలిగించవని, శాస్త్రీయంగా నేర్పడం అనేది అస్సలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రచయితల సంఘంలో ఉండే కార్యవర్గం, మరియు అందుబాటులో ఉండే ప్రముఖులను బట్టి.. ఈ శిక్షణను పరుచూరి గోపాలకృష్ణ (అధ్యక్షుడు) ఆకెళ్ల (ప్రధాన కార్యదర్శి), విజయేంద్ర ప్రసాద్, కెఎల్ ప్రసాద్ తదితరులు క్లాసులు తీసుకుంటారని చెబుతుంటారు. కానీ వీరిలో క్లాసులు తీసుకోవడానికి వచ్చే వారి సంఖ్య తక్కువ.. అన్ని క్లాసులనూ పరుచూరి గోపాలకృష్ణే నిర్వహించేస్తారు.
నిజానికి డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్ నేపథ్యంనుంచి రచయితగా మారినవారు గనుక.. ఆయన క్లాసులు తీసుకోవడం నల్లేరుపై నడకలా ఉండాలి. ఆయన చెబితే.. స్క్రీన్‌ప్లే రైటింగ్ అనేది విన్నవారికి కరతలామలకం అయిపోయేలా ఉండాలి. పైగా ఆయన తెలుగు యూనివర్సిటీలో కూడా శిక్షణలు నిర్వహిస్తున్న అనుభవజ్ఞులు. అలామాత్రం జరగడం లేదు. రచయితల సంఘం వారు గతంలో పలు స్క్రీన్‌ప్లే రైటింగ్ వర్క్‌షాపులు పెట్టేశారు గనుక.. ఇప్పుడు 'అడ్వాన్స్డ్' అనే పదం తగిలించి మరో స్క్రీన్‌ప్లే రైటింగ్ వర్క్‌షాప్ పెడుతున్నారు. ఎక్కువ ఫీజు వసూలు చేయడం తప్ప.. ఇందులో కొత్తదనం ఏమీ లేదని సభ్యులు అంటున్నారు. పరుచూరి గోపాలకృష్ణ ఒక్కరే ఎక్కువ క్లాసులు తీసుకునేట్లయితే ఈ క్లాసులకు వెళ్లడం కూడా దండగ అనే విమర్శ కూడా వినిపిస్తోంది.
పరుచూరి గోపాలకృష్ణ ఎంత సీనియర్ అయినప్పటికీ.. ఆయన క్లాసులు స్రీన్‌ప్లే రైటింగ్‌ను నేర్పేలా ఉండవని, తాను రాసిన సూపర్ హిట్ సినిమాల గురించి డబ్బా కొట్టుకోవడంలాగా మాత్రమే ఉంటాయని కొందరు విమర్శిస్తున్నారు. కథను, స్క్రీన్‌ప్లేలాగా మార్చుకోవడం ఎలా.. ఎన్ని రకాల స్క్రీన్‌ప్లేలు ఉంటాయి.. ఎలాంటి కథలకు ఎలాంటి స్క్రీన్‌ప్లే సూటవుతుంది? ఎందుకు సూటవుతుంది. వంటి సశాస్త్రీయమైన విషయాల ప్రస్తావన కూడా లేకుండా.. తాను రాసిన సినిమాలో ఏడో రీలులో విజిల్స్ మరియు చప్పట్లు మారుమోగిపోయేలా… తాము ఎలా రాశామో.. తామురాసిన డైలాగుకు పడిన విజిల్స్ విని అన్నగారు (నందమూరి తారక రామారావు గారు) ఎలా డంగైపోయారో మాత్రమే గోపాలకృష్ణ కొన్ని గంటలపాటూ వివరిస్తుంటారని ఇదివరకు క్లాసులకు హాజరైన సభ్యులు చెబుతున్నారు. ఆయన పెద్ద రచయిత గనుక, తన స్వానుభవాల్లో కూడా పాఠాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఆయన స్వానుభవాలు, ఆత్మస్తుతి, స్వోత్కర్షను వినడానికి.. రెండేసివేల రూపాయలు చెల్లించి వెళ్లవలసిన అవసరం లేదనేది కొందరి వాదన. కార్యక్రమం షెడ్యూలులో మాత్రం అనేకమంది లెక్చరర్లు వస్తారని చెబుతారని ఉంటుంది. కానీ సమయానికి వారెవ్వరూ అందుబాటులోకి లేనందున పరుచూరి గోపాలకృష్ణ క్లాసులు తీసేసుకుంటూ ఉంటారు. ఆయన ఎన్టీర్‌తో ఉదయం 4 గంటలకు కథాచర్చల్లో పాల్గొన్న వైనం దగ్గరినుంచి.. చిరంజీవి దిగ్భ్రమకు గురై తనను కౌగిలించుకున్న వరకూ అనుభవాలను మాత్రం ఏకరవు పెడుతుంటారు.
అంతే తప్ప.. మూడురోజుల వర్క్‌షాప్ జరిగితే.. సభ్యులకు ఒక అసైన్మెంట్ ఇచ్చి.. వారు ఎలా రాశారో పరిశీలించి.. ఎలాంటి తప్పులు చేస్తున్నారో గమనించి, వాటిని దిద్దుకుని సరైన స్క్రీన్‌ప్లే రాయడం ఎలాగో.. వారికి ఒక పద్ధతి ప్రకారం నేర్పే ప్రయత్నం మాత్రం ఈ వర్క్‌షాపుల్లో జరగదు. నిజానికి ఈ రోజుల్లో చిన్న పిల్లలకు నిర్వహించే వర్క్‌షాపుల్లో కూడా అసైన్మెంట్లు ఇచ్చి.. ప్రాక్టికల్‌గా వారికి తెలిసేలా నేర్పుతుంటారు. కానీ రచయితల సంఘం నిర్వహించే.. స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లు 'ఉపన్యాసాలు- భోజనాలు' అన్న తీరుగా ముగిసిపోతుంటాయి. రచయితల సంఘానికి నిజంగా తమ సభ్యుల నైపుణ్యాలను మెరుగుపరచాలనే ఆసక్తి శ్రద్ధ ఉంటే గనుక.. వారికి సరైన రీతిలో స్క్రీన్‌ప్లే రైటింగ్‌పై అవగాహన కలిగేలాగా.. అసైన్మెంట్లు వాటిని సరిదిద్దడం తో కూడిన శిక్షణ నిర్వహించాలని, అలాంటి శాస్త్రీయ శిక్షణ ఇచ్చేట్లయితే ఫీజులు ఇంకాస్త ఎక్కువ వసూలు చేసినా.. సభ్యులకు చిరాకు లేని ప్రయోజనం కలుగుతుందని పలువురు సూచిస్తున్నారు.