‘నదుల’ అనుసంధానం

తాగునీటి సమస్యకు దేశంలోని నాయకులందరూ వల్లించే మంత్రం ఒకటుంది – నదుల అనుసంధానం! కొన్ని నదుల్లో సీజన్లో నీరు ఎక్కువై వరదలు వస్తాయి, మరి కొన్ని ఎండిపోతూంటాయి, వీటన్నిటినీ కాలువల ద్వారా కలిపేస్తే ఆ…

తాగునీటి సమస్యకు దేశంలోని నాయకులందరూ వల్లించే మంత్రం ఒకటుంది – నదుల అనుసంధానం! కొన్ని నదుల్లో సీజన్లో నీరు ఎక్కువై వరదలు వస్తాయి, మరి కొన్ని ఎండిపోతూంటాయి, వీటన్నిటినీ కాలువల ద్వారా కలిపేస్తే ఆ నీరు సమానంగా పంచబడి, వరదలు, కరువుల బాధ లేకుండా సముద్రంలోకి వెళ్లి వృథా కాకుండా ఆ నీరు మనకు ఉపయోగపడుతుంది. 40 ఏళ్లగా అందరూ దీని గురించి మాట్లాడుతూనే వున్నా అవి కార్యరూపం ధరించలేదు. వాజపేయి ప్రభుత్వం హిమాలయాల్లో వున్న 14 నదులను, మైదాన ప్రాంతాల్లో వున్న 16 నదులను 30 కాలువల ద్వారా కలపాలని కలలు కంది. సాంకేతికంగా అది చాలా కష్టమైన పని కావటం చేత అది సాధ్యం కాలేదు. ‘కష్టమైనా చేసి చూపిస్తాం, దేశంలోనే మొట్టమొదటిసారిగా నర్మదా నదిని, క్షిప్రా నదిని అనుసంధానం చేసి కరువుతో బాధపడే మాళ్వా ప్రాంతానికి నర్మదా జలాలను అందిస్తాం’ అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిన బూనారు. 432 కోట్ల రూ.ల బజెట్‌తో నర్మదా క్షిప్రా లింక్ ప్రాజెక్టు (ఎన్‌కెఎల్‌పి)కు ఎల్‌కె ఆద్వాణీ చేత 2012 నవంబరులో శంకుస్థాపన చేయించారు. 3000 గ్రామాల, 70 పట్టణాల దాహార్తిని తీర్చడంతో బాటు 17 లక్షల హెక్టార్ల పొలాలకు సాగునీరు సమకూరుస్తుందని చెప్పారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిందంటూ ఉజ్జయినిలో ఆడ్వాణీచేతనే దానికి ప్రారంభోత్సవం చేయించేశారు. నిజానికి పనులు పూర్తి కానే లేదు. సివిల్ వర్క్‌స్ నడుస్తూనే వున్నాయి. మరి ఈ తొందర ఎందుకంటే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చేలోపున ఏదో అద్భుతం జరిగిపోయిందని ప్రచారం జరిగిపోవాలి.  మాళవా ప్రాంతంలో 50 అసెంబ్లీ సీట్లున్నాయి మరి! ఎన్నికలు జరిగిపోయిన తర్వాత అక్కడి ప్రజలు జరిగిన తంతు చూసి నోరు నొక్కుకున్నారు. నదుల అనుసంధానం అంటే కాలువల ద్వారా కలుపుతారని, భూమ్యాకర్షణ శక్తి వలన నీరు ఒక నది నుండి మరో నదిలోకి ప్రవహిస్తుందని ఎవరైనా అనుకుంటారు. నర్మద నుండి క్షిప్రాకు 49 కి.మీ.ల దూరం వుంది. పైగా క్షిప్రా నదీ ప్రాంతం 349 మీటర్ల ఎత్తున వుంది. ఏదో ఇంజనీరింగ్ అద్భుతంతో దీన్ని సాధిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ ఫైనల్‌గా జరిగినది వేరు. పైపుల్లో నీరు తెచ్చేసి, ఇదే అనుసంధానం అనేశారు. ఇప్పుడు దానికి బోల్డు కరంటు ఖర్చవుతోంది.

నర్మదా నదీ జలాలను నిలువ చేయడానికి 1వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ శిశ్లియా చెఱువు తవ్వించింది. తర్వాత ఆ నదిపై ఓంకారేశ్వర్ డ్యామ్ కట్టారు. డ్యామ్ కుడి వైపు కాలువలో ప్రవహించే నీరు భూమిలో తవ్విన 10 కి.మీ. పొడవున్న కాలువ ద్వారా పల్లానికి దానంతట అదే ప్రవహిస్తూ చెరువులో వచ్చిపడుతుంది. ఈ ఎన్‌కెఎల్‌పి ప్రాజెక్టులో భాగంగా ఆ చెరువును లోతు చేశారు. గట్టి బందోబస్తు చేశారు. ఇప్పుడు 5 క్యూమెక్కుల నీరు ఆ చెరువుకి వస్తుంది. ఇక్కణ్నుంచి 1. మీటర్ల వ్యాసం వున్న పైపుల ద్వారా  ఉజ్జయినికి నీరు ఎత్తిపోస్తున్నారు. 34 మీటర్ల ఎత్తు వుంది కాబట్టి నాలుగు అంచెల్లో ఎత్తిపోస్తున్నారు. ఇలా ఎత్తిపోయడానికి రోజుకి రూ. 11 లక్షల ఖరీదైన విద్యుత్ కావాలి. నిర్వహణ ఖర్చులు కూడా కలుపుకుంటే రోజుకి రూ. 15 లక్షల ఖర్చు. అంటే వెయ్యి లీటర్లకు రూ. 70 ఖర్చు అన్నమాట. ఇంతా చేసి వీళ్లు ఇచ్చే నీళ్లు ఎన్ని? 362 ఎంఎల్‌డి (మిలియన్ లీటర్స్ పెర్ డే) మాత్రమే. ఇండోర్‌కు నర్మదా నుండి రోజూ 325 ఎంఎల్‌డి వస్తుంది, భోపాల్‌కు 350 కావాలి. ఇంత ఖర్చుతో నీళ్లు అందించడం దండగమారి వ్యవహారం అనుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా శిశ్లియా చెరువు కింద వ్యవసాయం చేసుకునే రైతులు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వచ్చాక వారికి నీరు ఇవ్వడం మానేశారు. 

ప్రకటనల ఆర్భాటానికీ, వాస్తవ పరిస్థితికి ఇంత వ్యత్యాసం వుంటుంది. మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ రోజూ ప్రకటనలే. వాస్తవంలోకి వచ్చిన తర్వాతనే వాటి నిగ్గు తేలుతుంది. 

 – ఎమ్బీయస్ ప్రసాద్

[email protected]