జోష్ ఏదీ…!

అక్కడా.. ఇక్కడా అదే కథ కొత్త ప్రభుత్వాలలో కానరాని ఉత్సాహం మంత్రులలోనూ నైరాశ్యం నాయకులు డీలా.. కేడర్‌లో వైరాగ్యం Advertisement కొత్త అంటేనే ఏదో మత్తు , గమ్మత్తు ఉంటాయి. పాత రోతను తోసిరాజని…

అక్కడా.. ఇక్కడా అదే కథ
కొత్త ప్రభుత్వాలలో కానరాని ఉత్సాహం
మంత్రులలోనూ నైరాశ్యం
నాయకులు డీలా.. కేడర్‌లో వైరాగ్యం

కొత్త అంటేనే ఏదో మత్తు , గమ్మత్తు ఉంటాయి. పాత రోతను తోసిరాజని వచ్చేది కాబట్టే దానికి అంత మోజు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో అక్కడా అంటే కేంద్రంలో, ఇక్కడ అంటే ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌ను ఓడగొట్టి మరీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న మూడు కొత్త ప్రభుత్వాల ముచ్చట చూస్తే కొత్త అంటే ఇలాగే ఉంటుందా అనిపించకమానదు. ఏదో అధికారంలోకి వచ్చాం, పాలన చేస్తున్నాం అన్న తీరులోనే సాగుతోంది తప్ప, ఎక్కడా వినూత్న పోకడలు కానీ, సందళ్లు కానీ మచ్చుకైనా కనిపించడంలేదు. ఇది నిజంగా ఈ మధ్యకాలంలో ఓ అరుదైన సందర్బంగానే చెప్పుకోవాలి. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఎకాఎకిన బలమైన కాంగ్రెస్ కూటమిని కూలదోసి అధికారంలోకి వచ్చారంటే అది మామూలు విషయమా.. కానేకాదు.. ఎన్నికల ముందు వరకూ మోడీ నామస్మరణతో దేశం మొత్తం వెర్రెక్కిపోయింది. ఫలితాల అనంతరం మే 26న ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అప్పటివరకూ కనిపించిన ఆనందం మెల్లమెల్లగా ఆవిరైపోయింది. అదే తంతు ఇక్కడా సాగుతోంది. జూన్ 2న అపాయింటెడ్‌డే తోనే తెలంగాణా తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఆయన మంత్రివర్గ సహచరులకు వారం అంటే వారం రోజులు సంతోషం కూడా మిగలలేదు. రైతుల రుణాలపై పరిమితులు పెట్టడంతో తొలి షాక్ అలా తగిలింది. ఆ తరువాత కథ మామూలే. ఇక, అదే నెల న ఆంధ్రా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి కూడా డిటోగానే ఉంది. ఆయన జమానా సైతం నిరాశ నీడలోనే కదులుతోంది. కొత్త సర్కార్, కొత్త పదవులు, కొత్త  ఆశలు ఇలా పల్లకిలో ఊరేగిన మంత్రులు, ఆయా పార్టీల నాయకులు ఇపుడు డీలా పడిపోయారు. ఏదో అధికారంలోకి వచ్చి అపుడే చాలా  ఏళ్లు అయినట్లుగా ఉందని, ప్రజా వ్యతిరేకత సైతం వెంటనే కనిపిస్తోందని ఆయా పార్టీలలో ఉన్న నాయకులే అనడం వర్తమాన పరిస్థితికి అద్దం పడుతోంది.

మోడీ మోజు తగ్గిందా…

మోడీ ఏదో చేస్తాడని, ఈ దేశాన్ని అమాంతం మార్చేస్తాడని, రాత్రికి రాత్రే పేదరికం మూటా ముల్లె సర్దుకుని పారిపోతుందని దేశంలోని జనం ఏవేవో కలలు కన్నారు. మోడీ వస్తే  అంతా మంచి జరిగిపోతుందని మేధావులూ భావించారు. మోడీ వంటి బలమైన నాయకుడు ఉంటే ఈ దేశానికి ఎదురే లేదని నిపుణులూ తలచారు. కానీ, ఆయన అధికారం చేపట్టి రెండున్నర నెలలు కావస్తోంది. ఇప్పటికైతే ఎటువంటి అద్భుతమూ చోటుచేసుకోలేదు. యూపీఏ సర్కార్‌కు నకలుగా సాధారణ బడ్జెట్‌ను మోడీ సహచరుడు, ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. దానికి జనం నుంచి, పార్టీ నుంచి ప్రశంసలు పెద్దగా దక్కలేదు కానీ, మాజీ ఆర్ధికమంత్రి పి చిదంబరం మాత్రం మా దారిలోనే వెళ్తున్నారంటూ కితాబు ఇచ్చారు. అది చాలు, యూపీఏ నుంచి మోడీని ఏ రకంగానూ వేరు చేసి చూడలేమనడానికి. అలాగే, రైల్వే బడ్జెట్ కూడా ఉంది. పెట్టాలి కనుక పెట్టామనిపించారు. పైగా, ఎన్నడూ లేని విధంగా పదమూడు వేల కోట్ల ఛార్జీల మోత మోగించారు. విదేశాంగ విధానం చూసినా పెదవి విరవాల్సిన పరిస్థితే ఉంది. మోడీ గద్దెనెక్కాక చూసుకుంటే పాకిస్ధాన్ వీరంగం ఏ మాత్రం తగ్గలేదు సరికదా పూర్వంలాగానే సరిహద్దుల వద్ద సైనికుల కాల్పులు, ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. యూపీఏ సర్కార్ మాదిరిగానే అమెరికాకు దగ్గర కావడం జరుగుతోంది. ధరలు తగ్గిస్తామన్న హామీ ఆచరణలో సాధ్యపడలేదు. 

ఆగస్టు 15న మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మరి, పాత హామీలు ఏ మేరకు నిలబెట్టుకున్నదీ ఆయన ప్రసంగంలోనే చూడాలి. పాలనాపరంగా పరిస్థితి ఇలా ఉండడానికి కారణం దేశం ఆర్ధికంగా ఇబ్బందులలో ఉండడమే. ఈ పరిస్థితులో మోడీ స్ధానంలో ఎవరూ ఉన్నా చేసేది ఏమీ లేదన్నది ఆర్ధిక నిపుణుల మాటగానూ ఉంది. అందువల్లనే మోడీ సర్కార్ నెట్టుకువస్తోందన్న భావన సర్వత్రా కలుగుతోంది. అయితే, మోడీపై విపరీతమైన ఆశలు పెట్టుకున్న జనంలో మాత్రం ఆయన ఏమీ చేయలేదన్న అసంతృప్తి తీవ్రమవుతోంది.  ఇలా ఆకాంక్షలు ఆకాశాన్ని తాకబట్టే మోడీ సర్కార్ ఏ చిన్న మంచి పని చేసినా కూడా అది ఎవరి దృష్టికీ రాకుండా పోతోంది. ఇక, బీజేపీలోనూ ఓ విధమైన అసంతృప్తి ఉంది. సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్‌జోషీ వంటి వారు తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందన్న సంతోషంతో లేరు. 

తమను పక్కన పెట్టారన్న ఆవేదనతో వారూ, వారి అనుచరులూ ఉన్నారు. అదే విధంగా, వాజ్‌పేయి సర్కార్‌లో పనిచేసిన రాజ్‌నాధ్‌సింగ్, వెంకయ్యనాయుడు, అనంతకుమార్ వంటి సీనియర్లు మోడీ సర్కార్‌లో పూర్తి స్వేచ్ఛతో పనిచేయలేకపోతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. నాడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వతంత్య్రంగా నే ఉండేది. ఇపుడలా కాదు. మోడీ నీడలో పనిచేయాల్సిరావడం కేంద్ర మంత్రులకు ఇబ్బందికరంగా ఉంది. పైగా, పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ కనుసన్నలలోనే ఉండడం బీజేపీలో వినూత్న పరిణామం. దీంతో, మంత్రులే కాదు, నాయకులు కూడా బయటకు ఎవరూ పెదవి విప్పకపోయినా ఏదో ఆశించి ఏదో అయ్యామన్న బాధతో మాత్రం కనిపిస్తున్నారు. మోడీ విషయంలో ఇంకా వేచి చూడాలన్న ధోరణిలో ఇటు ప్రతిపక్షం ఉండడం, వారికి కూడా సరైన బలం లేకపోవడం, జనంలో కూడా మోడీ ఏదో చేస్తాడన్న ఆశ చావకపోవడం వంటివే కొత్త సర్కార్‌కు శ్రీరామరక్షగా ఉంటున్నాయి. ఇవి ఒకవేళ తారుమారైతే పరిస్థితి ఏంటన్నది చూడాల్సిఉంది.

కేసీఆర్ దూకుడుకు బ్రేకులు

బంగారు తెలంగాణా తెస్తాం, మనం మనమే పాలించుకుందాం, పేదలు లేని రాజ్యం అంటూ ఊదరగొట్టిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఉద్యమకారుడు కేసీఆర్ తెలంగాణా తొలి ముఖ్యమంత్రి అయ్యాక దూకుడుకు బాగానే బ్రేకులు పడ్డాయని చెప్పకతప్పదు. పరిస్థితులు అటువంటివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్ ఉండేది, ఇపుడు సీమాంధ్ర వేరుగా ఉండడం వల్ల తక్షణ ప్రమాదం విద్యుత్‌తోనే. ఈ సంగతి కేసీఆర్‌కు కూడా ముందే తెలుసు. ఇపుడు ఆచరణలో దానిని ఎదుర్కోవడం ఆయనకు ఇబ్బందికరంగానే ఉంది. అలాగే, రైతులకు ఇచ్చిన హామీలు ఇపుడు మెడకు చుట్టుకుంటున్నాయి. పంట రుణాలు మాఫీ అని ఎన్నికల వేళ చెప్పిన కేసీఆర్ దానిని కేవలం 201314 సంవత్సరానికే, అదీ కూడా లక్ష రూపాయలేక పరిమితం చేయడంతోనే తెలంగాణా రైతాంగం నిప్పులు కురిపించింది. అధికారంలోకి వచ్చి వారం రోజులు కాకముందే రైతన్న ఆగ్రహం చూడాల్సివచ్చింది. ఆ తరువాత నాలిక కరచుకున్నా ఫలితం లేకపోయింది. ఇక, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజు చేసే అంశం కూడా వివాదస్పదమైంది. తెంగాణా ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండి ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్ధిలోకమై ఇపుడు కేసీఆర్ సర్కార్‌కు ఎదురై పోరాడుతోంది. నిరుద్యోగుల సంగతేంటని ప్రశ్నిస్తోంది. అలాగే, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎంసెట్ వంటివి కూడా కేసీఆర్ సర్కార్‌కు ఊపిరి ఆడనీయడంలేదు. మధ్యలో పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో కలిపేయడం కూడా తలనెప్పిగా మారింది. ఇలా ఆయన రెండు నెలల పాలనలో మెరుపులు మాట దేముడెరుగు.. అపుడే చాన్నాళ్లయిందా అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇవి చాలవన్నట్లుగా హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్రలో పాతికమంది విద్యార్ధులు మరణించడం, ఇటీవల మెదక్ జిల్లాలో రైలు ఢీ కొని ఇరవై మంది వరకూ చిన్నారులు దారుణంగా చనిపోవడం వంటి విషాదకర ఘటనలూ చోటుచేసుకున్నాయి. 

రుణమాఫీ ఉచ్చులో బాబు

టీడీపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తాం, ప్రతీ ఇంటికో ఉద్యోగం ఇస్తాం, రైతుల రుణాలన్నీ తొలి సంతకంతో మాఫీ చేస్తామని అనేక సభలలో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు బాగానే ఇరుక్కున్నారు. మిగతా వాటి సంగతెలా ఉన్నా రైతు రుణ మాఫీ ఉచ్చులో బాబే పడిపోయారు. ఏదో విధంగా తప్పించుకుందామనుకున్నా రిజర్వు బ్యాంకు ఒప్పుకోవడంలేదు. రీ షెడ్యూలు అన్న మాటేక అడ్డు చెపుతోంది. పరిమితంగానైనా రుణాలు మాఫీ చేయాలన్నా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రిజర్వు బ్యాంకు కనికరించకపోతే రైతుల వద్దనే కాదు, యావత్తు ప్రజానీకం వద్ద పరువు పోతుంది. ఏడేళ్ల కాలపరిమితి అంటూ రీ షెడ్యూలు రుణాలు చెల్లించడానికి బాబు చేసిన ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు ససేమిరా అంది. మూడేళ్ల కాలపరిమితికి కూడా ప్రస్తుతం అవకాశం కనిపించడంలేదు. పది రోజుల క్రితం మంత్రివర్గ సమావేశంలో లక్షన్నర వరకూ ప్రతీ రైతుకు రుణ మాఫీ చేస్తామని తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇంతవరకూ ఉత్తర్వు విడుదల కాలేదంటేనే సర్కార్ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రైతుల రుణాలపైనే కాదు, రాజధాని ఎక్కడ అన్న దానిపైనా ఓ స్పష్టత లేదు. ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడానికే సమయం మొత్తం సరిపోతోంది. ఏదో ఆదుకుంటారనుకుంటే కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. 

ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా కేంద్రానికి కూడా ఆర్ధిక సమస్యలు ఉన్నాయని తేల్చేశారు. టీడీపీ హామీలతో తమకు సంబంధం లేదని అన్నారు. ఈ పరిణామాలతో టీడీపీలో ఎటువంటి జోష్ కనిపించడంలేదు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చామన్న సంబరం మంత్రులలోనూ లేదు. పైగా, ఎందుకు అధికారంలో ఉన్నామన్న వైరాగ్యం కొందరిలో కలగడం విచిత్రం. ఇక, నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భయపెడుతోంది. పదవుల పందేరం  ఉంటే ఉండవచ్చు కానీ, అది ఇపుడు కాదని సర్కార్ పెద్దలు అంటున్నారు. ఒకవేళ జరిగినా అతి తక్కువగానే ఆ పందేరం ఉంటుందన్న సంకేతం కూడా నాయకులకు, కేడర్‌కు అందడంతో వారంతా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఒక్కటే అన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రతిపక్షంలో అయితే బాధ్యత లేకుండా విమర్శలైనా చేసేవాళ్లం, ఇపుడు అది కూడా లేకుండా పోయింది. రాళ్లన్నీ మాకే తగులుతున్నాయని వాపోతున్నారు. 

నిజానికి ప్రజాస్వామ్యంలో అయిదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారడం సహజం. ప్రజలు కూడా పాతవారితో విసిగి కొత్తవారు ఏం చేస్తారో అని ఆశపడి ఓటు వేస్తారు. అయితే, వారి ఆశలను నూరింతలు చేయడమే ఇపుడు కొత్త పాలకుల పాలిట శాపంగా మారింది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఏ రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా కష్టమే కానీ, కనీసం కొంతవరకైనా ఆశలు పెడితే బాగుండేదని, ఇపుడు హామీలు లెక్కలేనన్ని ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చాక కాదంటే జనం ఎలా ఊరుకుంటారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అటు బాబు, కేసీఆర్‌లకు ఇచ్చిన హామీలే ప్రతిబంధకాలుగా మారగా, మీడియా మాయాజాలం మోడీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చిందని, దాంతో, మోడీ ఇమేజ్ ఆకాశమే హద్దుగా పెరిగిందని, ఇపుడు ఆయన పరిపాలన గత పాలకుల కంటే బాగానే ఉన్నట్లుగా కూడా అనిపించకపోవడానికి ఇదే కారణమని కూడా అంటున్నారు. ఏది ఏమైనా చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లుగా మన నాయకుల తీరే వారి ఇప్పటి పరిస్థితికి కారణమన్న మాటను మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.