మొత్తానికి చిరంజీవి 150వ సినిమా ఖరారయినట్టే. అభిమానుల్ని ఉర్రూతలూగించి, పూరిని ఊరించి, ఉస్సురనిపించి…సినిమా తరహాలోనే ట్విస్టులతో సాగిన 150వ సినిమా ఎపిసోడ్ చివరికి ఓ రూపానికి వచ్చింది.
తమిళ హీరో విజయ్ కి సూపర్‌హిట్‌గా నిలిచిన కత్తి సినిమా రీమేక్‌కే చిరు ఓటేశాడు. దీనికి దర్శకుడిగా వినాయక్‌కే అవకాశం ఇచ్చాడు. కత్తి మాతృకకు దర్శకుడైన మురుగదాస్ స్క్రీన్‌ప్లే అందివ్వనున్న ఈ సినిమా అటు పొలిటికల్, ఇటు సినీకెరీర్… రెండిటికీ తగిన రెండు వైపులా పదునున్న కత్తిలా ఉపకరిస్తుందని చిరంజీవి భావించడమే ఈ నిర్ణయానికి కారణమైంది.
వయసు రీత్యా చూసినా, ఆయన వారసుల సక్సెస్ ప్రకారం చూసినా ప్రస్తుతం చిరంజీవి ఉన్న పరిస్థితిలో ఆయనకు సినీ కెరీర్‌కన్నా పొలిటికల్ కెరీర్ చాలా ముఖ్యం. ఎందుకంటే… 150 వ సినిమా హిట్టయినా చిరంజీవికి సినీ కెరీర్ పెద్ద ఆశాజనకంగా ఉంటుందని ఆశించలేం. అయితే ఈ సినిమా విజయం తప్పనిసరిగా ఆయన పొలిటికల్ కెరీర్‌కు ప్లస్సవుతుందనేది నిజం.
సినీ రంగంలో అప్రధాన పాత్రలు పోషించడం కన్నా మిగిలిన జీవితాన్ని పొలిటికల్‌గా తీర్చిదిద్దుకుంటే ముఖ్యమంత్రి కాకపోయినా, కేంద్రమంత్రో, మరింకేదైనా మంచి పదవే లభించవచ్చు. వీటన్నింటనీ బేరీజు వేసుకుని ఆయన 150వ సినిమా విషయంలో ఇంత ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
కత్తి సినిమా ఆల్రెడీ తమిళ ప్రజల్ని మెప్పించిన కధే కాబట్టి, ఒక రకంగా సేఫ్‌గేమ్ అనొచ్చు. అంతేకాకుండా ఈ సినిమా కధ కూడా సామాజిక సమస్యల నేపధ్యంలోనే సాగుతుంది. రైతు ఆత్మహత్యలు, భూసేకరణ వంటి అంశాలను స్పర్శిస్తూ నడుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండూ హాట్ టాపిక్స్ అనేవి తెలిసిందే.
పైగా తనకు ఠాగూర్ లాంటి సోషల్ మెసేజ్ మూవీతో హిట్ ఇచ్చిన వినాయక్, స్టాలిన్ లా మరో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇచ్చిన మురుగదాస్‌లను డైరెక్షన్, స్క్రీన్‌ప్లేలకు ఎంచుకోవడం… చూస్తుంటే కత్తి లాంటి నిర్ణయం తీసుకున్నాడు చిరంజీవి అనకుండా ఉండలేం.