బిజెపి పార్టీ వారు ఆరెస్సెస్ తమ మాతృసంస్థ అని చెప్పుకుంటూండడం విని, జనసంఘ్ ఆరెస్సెస్ లోంచి ఉద్భవించిందని అనుకోవడం కద్దు. కానీ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆరెస్సెస్‌కి చెందినవాడు కాదు. మొదట కాంగ్రెసులో, తర్వాత హిందూ మహాసభలో వున్నాడు. గోడ్సే సీరీస్‌లో శ్యామా ప్రసాద్ గురించి కొంత రాశాను. ఆయన ప్రముఖ న్యాయవాది అశుతోష్ ముఖర్జీ కుమారుడు. శ్యామా అంటే నల్లనిది, కాళీమాతకు మరో పేరు. బెంగాలీవాళ్లు అలాటి పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆరెస్సెస్, బిజెపి లిటరేచర్‌లో ఆయన పేరును ఉత్తరాది వాళ్ల పేరులా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని మార్చిపారేశారు. అది తప్పు. శ్యామా ప్రసాద్ కూడా బారిస్టర్. కలకత్తా యూనివర్శిటీకి అతి పిన్న వయస్సులో, 33 వ యేట వైస్ ఛాన్సలర్ అయ్యారు.
హిందూ మహాసభ 1914లో అమృతసర్‌లో ఆవిర్భవించింది. దాని ముఖ్యకార్యాలయం హరిద్వార్‌లో వుండేది. బెనారస్ హిందూ యూనివర్శిటీ స్థాపించిన పండిత మదన మోహన్ మాలవ్యా దానికి నాయకుడు. హిందువుల విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేయడానికై స్థాపించారు. దానితో బాటు ఇస్లాంలోకి మారిన హిందువులను మళ్లీ హిందూమతంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అస్పృశ్యతను నిరసించేవారు కానీ తక్కిన విషయాల్లో సనాతన హిందూ ఆచారాలను పాటించేవారు. బ్రిటిషు వారికి దాసోహం అనలేదు కానీ రాజ్యాంగ పద్ధతుల్లోనే వారితో పోరాడాలని వాదించేవారు. గాంధీ ప్రతిపాదించిన సహాయనిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొనలేదు. ఆర్యసమాజ నాయకుడు లాలా లజపతి రాయ్ కూడా హిందూ మహాసభతో కలిసి పనిచేసేవారు. 1920లకు వచ్చేసరికి కాంగ్రెసు సెక్యులరిజం అంటే మండిపడే వీర సావర్కార్ ప్రభావం హిందూ మహాసభపై పడింది. ముస్లింలను కాంగ్రెసు బుజ్జగిస్తోందని, అందుకని ముస్లిములకు, కాంగ్రెసులకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం వుందని ఆయన సిద్ధాంతం. ముస్లిం ప్రయోజనాలు, హక్కుల కోసమంటూ ముస్లిం లీగు ఏర్పడడంతో పోనుపోను మహాసభ ముస్లింలకు మరింత వ్యతిరేకమైంది. గాంధీ అహింసావిధానాల చేతనే హిందువులు బలహీనపడి దేశవిభజనకు ముందు జరిగిన మతకలహాలలో ముస్లింల చేతిలో చచ్చిపోయారని సావర్కార్ వాదన. గాంధీ హత్య తర్వాత హిందూ మహాసభ అప్రతిష్ఠపాలై, కనుమరుగైంది.
జనసంఘ్ పార్టీ పెట్టేముందు శ్యామా ప్రసాద్ ఆర్య సమాజ్, ఆరెస్సెస్‌లను కదిపి చూశాడు. ఆర్య సమాజ్ స్పందించింది కానీ ఆరెస్సెస్ మెదలకుండా వూరుకుంది. పార్టీ పెడతానని ఆయన ప్రకటించిన తర్వాత అప్పుడు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. ఇక అప్పణ్నుంచి దానికి వెన్నుదన్నుగా నిలిచింది. చాలా సందర్భాల్లో దాని విధానాలను శాసించింది కూడా. ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -యికపై సంఘ్ అని వ్యవహరిద్దాం) 1925లో విజయదశమి నాడు డా|| కేశవ్ బలిరామ్ హెగ్‌డేవార్ చేత స్థాపించబడింది. రాజకీయాల జోలికి పోకుండా కేవలం జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికై వాలంటీర్లను తయారుచేయడమే తమ ధ్యేయం అని చాటుకుంది. వారి దృష్టిలో జాతీయత అంటే హిందూ జీవితవిధానమే. తమపై జరిగే దాడులను ఎదుర్కోవడానికి హిందువులు శారీరకంగా పుష్టిగా వుండాలనే ధ్యేయంతో నిత్యవ్యాయామం, నిత్యసమావేశాలు ఏర్పాటు చేస్తారు వారు. ఆత్మరక్షణ కంటూ చేతిలో కర్రలు పట్టుకుని తిరుగుతారు. సాధారణ ప్రజలు యిలా కర్రలతో తిరిగితే శాంతిభద్రతలకు ఉపద్రవం వస్తుందని భయపడిన రాష్ట్రప్రభుత్వాలు సంఘ్‌ను అనుమానంగా చూసేవారు. పైగా వాళ్లు ముస్లింలతో, కమ్యూనిస్టులతో హింసాత్మక ఘర్షణలకు దిగేవారు. 1932లో మహాకోసల్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు సంఘ్‌లో చేరకూడదని నిషేధం విధించింది. 1938లో బొంబాయి ప్రెసిడెన్సీ కూడా అదే పని చేసింది. 1940లో కేంద్ర ప్రభుత్వం సంఘ్ యూనిఫాంను, వాళ్ల ప్రదర్శనలను నిషేధించింది. ఏం చేసినా మతకలహాలు పెరిగిన కొద్దీ సంఘ్ పలుకుబడి పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే బాధిత హిందువుల కోసం వారు సహాయశిబిరాలు నిర్వహించేవారు. ఆ విధంగా బెనారస్, పంజాబ్, సెంట్రల్ ప్రావిన్స్, బొంబాయి ప్రెసిడెన్సీలకు అది విస్తరించింది. కాంగ్రెసు పార్టీలో చాలా మంది హిందూ మతాభిమానులు వుండేవారు. వారు సంఘ్ పట్ల సానుభూతి చూపేవారు, వారికి సన్నిహితంగా వుండేవారు. సంఘ్ రాజకీయాలకు దూరంగా వుంటానని చెప్పడం చేత హిందూ దురభిమానం కలిగిన కొందరు కాంగ్రెసు నాయకులకు దాని పట్ల అభిమానం వుండేది. పైగా కాంగ్రెసుకు ప్రత్యర్థులైన కమ్యూనిస్టులతో ముఖాముఖీ, బాహాబాహీ తలపడే సత్తా సంఘ్‌కే వుండేది. కానీ సంఘ్ హిందూత్వవాదం సమాజంలో చాలామందికి రుచించేది కాదు.
సంఘ్ అంటే ఉదారవాదులకు వ్యతిరేకత దేనికి? భారతదేశమంతా ఒకటే జాతి, ఒకటే ప్రజలు, ఒకటే సంస్కృతి అని సంఘ్ చెప్తుంది. కానీ మన దేశచరిత్ర చూస్తే భిన్న సంస్కృతుల మేళవింపు అని బోధపడుతుంది. బహుళత్వమే మన దేశపు బలం. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రమే మనందరినీ కలిపి వుంచుతోంది. కానీ సంఘ్ సిద్ధాంతం ప్రకారం దేశమంతటికీ ఒకటే సంస్కృతి. అది హిందూ సంస్కృతి. ఇతర మతస్తులందరూ పరాయివాళ్లే. వాళ్లు మనదేశంలో వుండాలంటే మెజారిటీ మతస్తులైన హిందువులు చెప్పినట్లు నడుచుకోవాలి. వాళ్లలాగే జీవించాలి. ప్రత్యేకమైన ఉనికిని చాటుకోకూడదు. ఇది మధ్యయుగాల నాటి ఆలోచనా ధోరణి. ఆధునిక సమాజానికి నప్పదు. వీటిని నాగరిక సమాజం ఫాసిస్టు పోకడగా గుర్తిస్తుంది. ఇటలీలో ముస్సోలినీ, జర్మనీలో హిట్లర్ యిటువంటి వాదనలే చేసి మెజారిటీ ప్రజలను ఆకట్టుకుని మైనారిటీలను నిర్మూలించారు. ఇలాటి వ్యవస్థలలో చేరిన కార్యకర్తలకు కొన్ని సిద్ధాంతాలు నూరిపోసి, వారిలో స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని హరించివేస్తారు. క్రమశిక్షణ పేరిట ప్రశ్నించే లక్షణాన్ని అణచివేస్తారు. అధినాయకుడు చెప్పిన ఆదేశాలను తుచ తప్పకుండా పాలించడమే తప్ప యిదెందుకు అని అడిగే సందర్భమే తలెత్తదు. ఇలాటి పరిస్థితి వలననే ముస్సోలినీ, హిట్లర్ ఎన్నో అమానుష చర్యలకు తెగబడినా వారి అనుచరులు వారించలేదు, ప్రశ్నించలేదు. అందుకే వారు నియంతలుగా మారి దేశాన్ని భ్రష్టుపట్టించారు. మన దేశానికి వస్తే కమ్యూనిస్టులలోను, సంఘీయులలోను తమ సిద్ధాంతాల పట్ల యిలాటి గుడ్డి ఆరాధనే కనబడుతుంది. ప్రతీ విషయాన్ని తమ దృక్కోణంలోనే చూస్తారు. తాము నమ్మినదానికి విపర్యంగా ఏదైనా వాస్తవం కనబడినా, ఎదుటివాళ్లు ఎంత తర్కబద్ధంగా వాదించినా వినరు. భావజాలం అనే పదం యిటువంటి వర్గాలకు సరిగ్గా అతుకుతుంది. జాలం అంటే వల అని కూడా అర్థం కదా. డాగ్మా అనే యీ వలలో పడితే కళ్లకు గంతలు కట్టుకున్నట్లే. వీరు తమ భావాలతో అంగీకరించనివారిని శత్రువులుగా చూస్తారు. వాళ్ల అభిప్రాయం వారిది అని వూరుకోరు. అవతలివారిని తమ పంథాకు మారుద్దామని తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ రెజిమెంటేషనే ఆ సంస్థలకు బలమూ, బలహీనతా. సాధారణ ప్రజలకు యింతటి మూఢనమ్మకం వుండదు కాబట్టి, కాస్తో కూస్తో కామన్‌సెన్స్ ఉపయోగిస్తారు కాబట్టి వీళ్లను కాస్త విడిగానే చూస్తారు. (సశేషం) ఫోటోలు జ్యోతి బసు, అజయ్ ముఖర్జీ సంప్రదింపులు, చారు మజుందార్, హెగ్డే వార్ , ( రంగుల ఫోటో )
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)