చిరంజీవి వ‌ల్ల న‌ష్టపోయానంటున్న పూరి…

ప్రతిష్టాత్మక‌మైన సినిమా అనీ, చిరంజీవి 150 చిత్రం అంటూ విప‌రీత‌మైన హ‌డావిడి, దానికి పూరి జ‌గ‌న్నాధ్‌కు ద‌ర్శకుడిగా  ఛాన్సిస్తున్నట్టు ప్రక‌ట‌న‌… ఆన‌క పూరి చెప్పిన క‌ధలో స‌గం న‌చ్చలేదంటూ సింపుల్‌గా తేల్చేయ‌డం… పైగా త‌ను…

ప్రతిష్టాత్మక‌మైన సినిమా అనీ, చిరంజీవి 150 చిత్రం అంటూ విప‌రీత‌మైన హ‌డావిడి, దానికి పూరి జ‌గ‌న్నాధ్‌కు ద‌ర్శకుడిగా  ఛాన్సిస్తున్నట్టు ప్రక‌ట‌న‌… ఆన‌క పూరి చెప్పిన క‌ధలో స‌గం న‌చ్చలేదంటూ సింపుల్‌గా తేల్చేయ‌డం… పైగా త‌ను రాసిన క‌ధ న‌చ్చలేద‌ని త‌నతో కాకుండా మీడియాతో చెప్పడం… వీట‌న్నింటితో ఎక్కడ కాలాలో అక్కడ‌ కాలిన‌ట్టుంది. 

మెగాస్టార్ అయితే ఏంటి… తానెందుకు త‌గ్గాల‌నుకున్నాడో ఏమో… తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో మాట్లాడుతూ చిరంజీవితో త‌న సినిమా, అది అట‌కెక్కడం అనే విష‌యంలో కాస్త ఘాటుగానే స్పందించాడు పూరి. టెంప‌ర్ త‌ర్వాత తాను ఎంతో బిజీగా ఉన్న‌ప్పుడే త‌న‌ను చిరంజీవి పిలిచి 150వ సినిమాకు చేయ‌మ‌ని అడిగారని పూరి అంటున్నాడు. అంటే తానేదో ఈ అవ‌కాశాన్నివెనుక‌ప‌డి, వెంప‌ర్లాడి తెచ్చుకోలేద‌ని చెప్పక‌నే చెప్పాడు. 

అలాగే తానెంతో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి అడిగార‌నే గౌర‌వంతో ఒప్పుకున్నాన‌ని చెప్పాడు.  దీని కోసం తాను అప్పటికే క‌మిటై చేద్దామ‌నుకున్న 2 సినిమాలు క్యాన్సిల్ చేసేసుకున్నాన‌ని, వారికి రూ.2కోట్లు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాన‌ని చెప్పాడు. అంటే ప‌రోక్షంగా తాను చిరంజీవి సినిమా కోసం చేసిన త్యాగంతో పాటు అది పోవ‌డం వ‌ల్ల న‌ష్ట పోయాన‌ని కూడా పూరి స్పష్టం చేశాడు. 

తాను  రాసిన క‌ధ నాగ‌బాబుకు అద్భుతంగా న‌చ్చింద‌ని, ఫ‌స్టాఫ్ న‌చ్చింద‌న్న చిరంజీవి సెకండాఫ్ విని క‌రెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే త‌ర్వాత చెబుతా అన్నార‌ని కాని అలా చేయ‌కుండా మీడియాతో మాట్లాడార‌ని అంటూ చిరంజీవిని త‌ప్పు ప‌ట్టాడు పూరి. అంతేకాదు అన్నీ ఆలోచించి చిరంజీవి కోసం 100శాతం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌ధ రెడీ చేశాన‌ని అది త‌న‌కు అద్భుతంగా ఉందంటూ… త‌న క‌ధకు తాను క‌మిటై ఉన్నట్టు చెప్పక‌నే చెప్పాడు. 

పూరి-చిరంజీవి ఎపిసోడ్‌లో పూరి చెప్పిన దానికి చిరంజీవి నుంచి ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో ఇప్పటికైతే తేల‌లేదు కాని ఓ ర‌కంగా చూస్తే పూరి చేసింది కూడా త‌ప్పే అనాలి. ఎందుకంటే… చిరంజీవి అవ‌కాశం ఇచ్చాడు క‌దాని మ‌రో రెండు సినిమాల‌కు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయడం అనేది క‌రక్టన‌లేం. అలా చేయ‌డం కూడా మాట త‌ప్పిన‌ట్టే క‌దా మ‌రి… 

ఎంత పెద్ద హీరో అయినా ఇత‌రుల క‌ష్టానికి, స‌మ‌యానికి విలువ ఇవ్వక‌పోతే అది తప్పేన‌నేది నిర్వివాదం. త‌ను సినిమా అవ‌కాశం ఇవ్వడ‌మే గొప్ప అన్నట్టుగా ఏ స్థాయి హీరో ప్రవ‌ర్తించినా అది స‌రైంది కాదు. … పెద్ద హీరో సినిమా అన‌గానే  ప‌రిగెత్తే ద‌ర్శకులు అంద‌రికీ  పూరి అనుభ‌వం ఒక ఉదాహ‌రణ అవుతుందో లేక‌… ఎంతైనా హీరో హీరోయే అనుకుంటూ స్టార్స్ కోసం వెంప‌ర్లాడుతూనే ఉంటారో…