జానపద సినిమాల మార్కెట్ అవకాశాల గురించి, వాటికున్న మాస్ అపీల్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు వాటివల్ల పరిశ్రమకు జరిగిన మేలు గురించి చెపుతాను. ఇంతకుముందే చెప్పినట్టు జానపద సినిమాలు తక్కువ బజెట్‌లో తయారవుతాయి. అగ్రశ్రేణి తారల అవసరం లేదు. తారల కాల్‌షీట్లు కూడా మరీ అక్కరలేదు. హాస్యనటుడు, హాస్యనటి, జంతువులు, కెమెరామన్ చేసే ట్రిక్ షాట్లు – వీటితో సినిమాలో చాలా భాగం నడిచిపోతుంది. అందువల్ల మార్కెట్ వున్న నటీనటులను తక్కువ పారితోషికానికే ఒప్పించవచ్చు. అంతేకాకుండా ఎంత నాసిరకం జానపద సినిమా ఐనా బి,సి సెంటర్లలో ఖచ్చితంగా 2,3 వారాలాడుతుంది. పైగా ఇతర భాషల్లో డబ్బింగుకు అవకాశం వుంది.
డబ్బింగు రైట్స్ అమ్ముకోవడం ద్వారా కాస్త ఆర్జించవచ్చు. ఈ కారణాల వల్ల జానపద సినిమా ఫెయిలయినా పెట్టుబడిలో 60, 70 శాతం చులాగ్గా వెనక్కి రాబట్టుకోవచ్చు. అందుకని కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతలు జానపద సినిమాలను నిర్మించడానికే మొగ్గు చూపేవారు. ఇటువంటి సినిమాలలో కొత్తవారికి అవకాశాలు బాగా దొరికేవి. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు సాంఘిక సినిమా అంటే సంగీతదర్శకుడు రాజేశ్వరరావో, పెండ్యాలో వుండాలి. దర్శకుడు ఏ కమలాకర కామేశ్వరరావో వుండాలి. పక్కన హీరోయిన్ సావిత్రో, అంజలో వుండాలి. ఇలా మొత్తమంతా భారీగానే వెళ్లిపోతుంది వ్యవహారం.
భారీ జానపదాలు తీసినపుడు యీ హంగులు కావాలి. కానీ మామూలు జానపదాలు ప్లాను చేసినప్పుడు ఇవేమీ అక్కరలేదు. టాలెంటు వున్నా అవకాశం దొరకనివారు అనేకమంది వుంటారు. వాళ్లకు యివి వేదికలయ్యాయి. రాజన్-నాగేంద్ర గొప్ప సంగీత దర్శకులే కావచ్చు, కానీ తెలుగులో వాళ్లకు డిమాండ్ లేదు. విఠలాచార్య వాళ్ల చేత తన జానపదాలకు చేయించుకునేవారు. అలాగే సత్యం, కోదండపాణి, విజయా కృష్ణమూర్తి.. యిలా బోల్డుమందికి అవకాశాలు వచ్చాయి. దర్శకులు కూడా అంతే! కన్నడ సినిమాల ద్వారా ఎన్నో జాతీయ ఎవార్డులు తెచ్చుకున్న పుట్టణ్న తొలి దశ గుర్తుకు తెచ్చుకోండి. తెలుగులో ఆయన 'పక్కలో బల్లెం' అనే జానపద సినిమాకు ఛాన్సు దొరికింది. అలా ఎస్టాబ్లిష్ అయ్యాకనే తర్వాత తర్వాత గొప్ప సినిమాలు తీసి పేరు తెచ్చుకున్నాడు. పెద్ద డైరక్టర్లకు అసిస్టెంట్లుగా పనిచేసిన సమర్థులకు డైరక్టరుగా ఫస్ట్ ఛాన్సు కావాలంటే జానపద సినిమాలలోనే దొరికేది.
అలాగే రచయితలకు కూడా. వీటూరి అనే మాటల, పాటల రచయిత వుండేవారు. ఆత్రేయగారికి సహాయకునిగా వుండేవారు. ఆయనకు వ్యక్తిగతంగా ఛాన్సు రావడం అంటే జానపద సినిమాల్లోనే! ఎన్నో జానపద సినిమాలకు ఆయన రచయిత. టాలెంటు లేదని కాదు, పెద్ద సినిమాలకు ఆయన్ని పిలవరంతే! దానికి కావలసిన మార్కెట్ ఇమేజి లేదాయనకు. జానపదాలకయితే ఓకే! ఇలా నడుస్తాయి వ్యవహారాలు! సంగీతాభిమానుల అదృష్టం ఏమిటంటే జానపదాల్లో రమారమి 10 పాటలుండేవి. పద్యాలు, భక్తి గీతాలు వుండేవి. జానపద ఫక్కీ పాట, తత్త్వాలు, ఓ జావళీ – యిలా వెరైటీ పాటలుండేవి. సాంఘికాల్లో వుండేవి 6,7 పాటలు. అవీ ప్రేమగీతాలు, మహా అయితే ఓ జోలపాట లేదా నేపథ్యగీతం. జానపద సినిమాల పుణ్యమాని మనకు ఎంతో సంగీత సంపద పోగుపడింది. అందునా వైవిధ్యం వున్న గీతసంపద.
ఇక నటీనటుల విషయానికి వస్తే చెప్పనే అక్కరలేదు. కాంతారావు, రాజనాల, సత్యనారాయణ, గుమ్మడి, జమున, కృష్ణకుమారి.. వీళ్లందరికీ తొలి సినిమాలు జానపదాలే! కొన్ని తయారయ్యాయి, కొన్ని ఆగిపోయాయి. నటీమణుల విషయంలో ఇంకో అంశం కూడా వుంది. గతకాలపు సాంఘిక సినిమాలలో సౌందర్య ప్రదర్శనకు అవకాశం తక్కువ. ఒంపుసొంపులు ప్రదర్శించినా, ఒయ్యారాలు పోయినా ఎబ్బెట్టుగా వుండేది. అదే జానపదమైతే తక్కువ బట్టలు వేసుకుని కులుకులు కులకవచ్చు. ప్రేక్షకులను రెచ్చగొట్టి దాసోహ మనిపించవచ్చు. రాజుల కాలంలో దుస్తులు ఎలా వుండేవో తెలియదు కాబట్టి అక్కడ యిటువంటివి చెల్లుతాయి. అందువల్ల చెలికత్తెల వేషాలు వేసినవాళ్లు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, హీరోయిన్లయ్యారు. వాణిశ్రీ, గీతాంజలి, మీనాకుమారి – వీళ్లందరికీ గుర్తింపు వచ్చింది ఇలాటి పాత్రల వల్లనే! కృష్ణకుమారి, రాజశ్రీ జానపద సినిమాల వల్లనే హీరోయిన్లుగా ఎదగగలిగారు.
హాస్యనటులకు మంచిస్కోప్ యిచ్చేవి కూడా జానపద సినిమాలే! మామూలు సినిమాలలో కంటె జానపద సినిమాలో హాస్యనటుల పోర్షన్ ఎక్కువ వుంటుంది. ఎలుగుబంటితో ఆటలాడడం, భూతాలతో సరసమాడడం, రాణిగారి చెలికత్తెతో పాట పాడడం ఇలా నటించడానికి స్కోప్ వుంటుంది. పిల్లలను ఆకట్టుకోవడానికి ఈ హాస్యగాణ్ని అతి పీలగా, సన్నగా, పిరికి వాడిగా – అంటే అన్నివిధాలా హీరోగారికి వ్యతిరేకంగా వుండేవాణ్ని పెట్టుకుంటారు. అతడు భయపడిపోతున్నట్టు తెగ యాక్షన్ చేసేస్తాడు. సర్కస్‌లో బఫూన్‌కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో జానపద సినిమాలో హాస్యనటుడికి అంత వుంటుంది. అనేకమంది హాస్యనటులు జానపదాల ద్వారానే పైకి వచ్చారు. బాలకృష్ణ, మోదుకూరి సత్యం, సారథి – వీళ్లంతా జానపదాలమీదనే ఆధారపడ్డారు. విలన్‌ల సంగతి తీసుకున్నా అంతే! సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి వీళ్లందరికీ పేరు వచ్చినది జానపదాల్లోనే కదా! 'అగ్గిబరాటా'లో అనుకుంటా – రాజనాలను విలన్‌గా పెట్టుకుందామనుకున్నారు ముందులో. డైరక్టరు విఠలాచార్యగారు రాజనాలను భరించేటంత మార్కెట్ వాల్యూ సినిమాకు వుంటుందో లేదో అంటూ రాజనాల బదులు తమిళ సినిమాల్లో చిన్న విలన్ వేషాలు వేసే ఎస్.వి.రామదాసును విలన్‌గా పెట్టారు. అదే సాంఘిక సినిమా అయితే ఆ సాహసం చేయలేకపోయేవారు. రామదాసు తర్వాత తర్వాత తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలే తెచ్చుకున్నారు.
ఇదీ లో-బజెట్ జానపదాలు కళాకారులకు, సంగీతప్రియులకు చేసిన మేలు. తక్కువలో ఎక్కువ ఆనందాన్ని యిచ్చిన సినిమాలవి. టీవీవాళ్లు మధ్యాహ్నం వేసే సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ జానపద చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తారు. ఎందుకంటే వాటికుండే వ్యూయర్‌షిప్ వాటికి పదిలంగా వుంది. కథ నచ్చకపోయినా హాయిగా సెటింగ్స్ చూడవచ్చు. రాజమందిరాలలో వుండే స్తంభాలు, శిల్పాలు, గోడలమీద గీసిన లతలూ, ఆ సింహాసనాలూ, ఆ డ్రెస్సులూ యివన్నీ ఆహ్లాదకరంగా వుంటాయి. ఇప్పటి సాంఘిక సినిమాల్లో చూపించే అగ్లీ డిస్‌ప్లే ఆఫ్ వెల్త్ కన్నా అవే నాకు మనసుకు హాయి గొలుపుతాయి. సంగీతం సంగతి సరేసరి!
జానపద సినిమాల్లో ఉత్తమజాతి సినిమాలంటే రాజనీతి ప్రధానమైన జానపద సినిమాలని నా అభిప్రాయం. వీటిల్లో మాయామంత్రం వుండదు. రాజకీయం వుంటుంది. కుట్రలూ, కూహకాలూ వుంటాయి. అసలదేమిటో నాకెప్పుడూ పొలిటికల్ ఇంట్రెగ్యూ నచ్చుతుంది. హిస్టరీలోనైనా, పాలిటిక్స్‌లోనైనా పదవికోసం సాగే రాజకీయ చదరంగం నన్ను ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లలుగా వున్నప్పుడు మాయలూ, మంత్రాలూ, భక్తీ సినిమా చూసినా కాస్త పెద్దయ్యేసరికి మెదడుకు మేత వేసే సినిమాలు నచ్చుతాయి. అలా అని సాంఘికాలు అనేసరికి వాటిలో మెలోడ్రామా, ప్రేమలూ, అపార్థాలూ, త్యాగాలూ వుంటాయి. శ్రుతి మించితే అవి బోరు. అందునా అటువంటి చాలా సినిమాల్లో కథ ఒకేలా వుంటుంది. ఇద్దరు హీరోయిన్లలోనూ హీరో ఎవర్ని చేసుకుంటాడాన్న సస్పెన్స్ కాస్సేపటికి మొహం మొత్తి ఎవర్ని చేసుకుంటే ఏంలే? అనుకునే దశకు వచ్చేస్తాం.
రాజనీతి ప్రధానమైన జానపదాల వల్ల మన మెదడుకు మేత దొరుకుతుంది. దేవుడు వచ్చి సమస్యలు పరిష్కరించడని తెలుసు కాబట్టి, కథలో ముడి ఎలా విడుతుందాన్న ఉత్సుకతతో సినిమా చూస్తాం. అందునా ఈ జానపద సినిమాలు కొన్నిటిని ప్రపంచ ప్రఖ్యాత నవలలమీద ఆధారపడి తీశారు. ప్రిన్స్ అండ్ పాపర్ ను రాజూ పేదా అనీ, త్రీ మస్కిటీర్స్‌ను 'ముగ్గురు మరాటీలు' అని, 'కార్సికన్ బ్రదర్స్'ను అపూర్వ సహోదరులు అనీ, అగ్గి-పిడుగు అనీ, 'ద మాన్ ఇన్ ద ఐరన్ మాస్క్‌ను' ను తమిళంలో ఉత్తమ పుత్రన్ అనీ – దాన్ని తెలుగులో డబ్ చేశారు – యిలా… వీటివల్ల కథలో మంచి వైవిధ్యం వస్తుంది. సాంఘికాల్లాగ ఎంతసేపూ అత్తా కోడళ్ల గొడవలు చూడక్కరలేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)