ప్రస్తుతం పెద్ద హీరోలంతా పాన్-ఇండియా జపం చేస్తున్నారు. చివరికి మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా ''పాన్-ఇండియా'' పేరిట సినిమాలు ప్రకటిస్తున్న రోజులివి. మరి భారీగా క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ నుంచి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు రాబోతోంది. దానికి సమాధానమే హరహర వీరమల్లు.
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో పాన్ ఇండియా సినిమా అవుతుందంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా కథ అలాంటిదంటున్నారు. మూవీలో పవన్ కల్యాణ్ 17వ శతాబ్దానికి చెందిన వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడు.
దీంతో పాటు సినిమాలో మొఘల్ పాలన, ఔరంగజేబు అరాచకాలు, సిక్కుల పోరాటం లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వీరమల్లు సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొస్తాయని చెబుతున్నారు.
దీనికితోడు ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ లాంటి బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. అలా పవన్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ అవుతుందంటున్నారు. అందుకు తగ్గట్టే సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం.
వకీల్ సాబ్ సినిమా పూర్తిచేశాడు పవన్. ప్రస్తుతం ఏకే (అయ్యప్పనుమ్ కోషియమ్) రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు పాన్ ఇండియన్ అప్పీల్ లేదు. ఎందుకంటే రెండూ రీమేక్స్ కాబట్టి. సో.. వీరమల్లు సినిమా మాత్రమే పవన్ కు పాన్ ఇండియా హీరో గుర్తింపు తెస్తుందని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. శివరాత్రికి ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారు.