‘పంచాయతీ’ ముగిసింది.. తత్వం బోధపడింది

భవిష్యత్తు తెలుసుకున్నోళ్లు ముందే వైసీపీకి జై కొట్టారు, మిగతా ఎమ్మెల్యేలు మాత్రం బాబు భ్రమల్లో బతికేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడా భ్రమలు తొలిగిపోయాయి. టీడీపీపై దింపుడు…

భవిష్యత్తు తెలుసుకున్నోళ్లు ముందే వైసీపీకి జై కొట్టారు, మిగతా ఎమ్మెల్యేలు మాత్రం బాబు భ్రమల్లో బతికేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడా భ్రమలు తొలిగిపోయాయి. టీడీపీపై దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నవారికి కూడా 20 నెలల్లోనే ఓ మోస్తరుగా క్లారిటీ ఇచ్చేశారు జగన్. 

పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వారికి జ్ఞానోదయం కలిగించాయి. దాదాపు 80శాతం పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరేసింది. చివరికి కాపాడుతుందనుకున్న అమరావతి ప్రాంతంలో కూడా ఎక్కువ పంచాయతీలు వైసీపీకే దక్కాయి. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పం కూడా జగన్ కి దాసోహం అందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత, ఇక ఎప్పటికీ టీడీపీ అధికారంలోకి రాబోదు అనే విషయం రోజురోజుకీ స్పష్టమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్ కి మద్దతు తెలిపారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా ఈ గట్టుకి వచ్చేశారు.

175 మందిలో జగన్ కి అపోజిషన్ కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయితే వీరిలో కూడా ఇప్పుడు చాలామంది జగన్ వైపే చూస్తున్నారని సమాచారం.

“పంచాయతీ ఎన్నికలతో వైసీపీపై ఉన్న వ్యతిరేకత బయటపడుతుంది, టీడీపీ బలం పుంజుకుంటుంది” అంటూ చంద్రబాబు తన ఎమ్మెల్యేలను, నాయకుల్ని, కార్యకర్తల్ని భ్రమల్లోనే పెట్టేశారు. తీరా ఫలితాలు చూస్తే వారికి భ్రమలన్నీ తొలగిపోయి, జ్ఞానోదయం అయినట్టు తెలుస్తోంది. ఇంకా చంద్రబాబుని నమ్ముకోని సైకిల్ తొక్కుతూ కూర్చుంటే లాభం లేదని గ్రహించారు వీళ్లంతా. దీంతో ఇప్పుడు మరోసారి వైసీపీ వైపు చూసే టీడీపీ బ్యాచ్ పెరిగింది.

గంటా శ్రీనివాసరావు గోడమీద పిల్లిలా ఉన్నా కూడా విశాఖలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లని కూడా అనుమానించాల్సిన సందర్భం ఇది. కరణం బలరాం వంటి నమ్మినబంటే బాబుని వదిలేశారంటే.. మిగతావారికి భ్రమలు తొలగిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.

రేపల్లె, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంచాయతీ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని గతంలోనే ఫిక్స్ అయ్యారు. ఫలితాలు దారుణంగా వచ్చే సరికి మరో ఆలోచన లేకుండా జగన్ కి జై కొట్టాలనుకుంటున్నారని తెలుస్తోంది.

త్వరలోనే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు. ఈ లాంఛనం కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోపే పూర్తవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతవడం ఖాయం. 

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి