ఎమ్బీయస్‌: రేవంత్‌ అంశం ఎంతదూరం వెళుతుంది? – 4

అధికారంలోకి వచ్చాక మోదీ రాజకీయాల్లో ఒక ధోరణి కనబడుతోంది – చాలాకాలంగా పార్టీకి మిత్రులుగా వున్న శివసేన, అకాలీదళ్‌కు ముకుతాడు వేస్తున్నారు. కొంతకాలం దగ్గరగా వుండి, తర్వాత దూరమై, మళ్లీ దగ్గరైన టిడిపితో పైకి…

అధికారంలోకి వచ్చాక మోదీ రాజకీయాల్లో ఒక ధోరణి కనబడుతోంది – చాలాకాలంగా పార్టీకి మిత్రులుగా వున్న శివసేన, అకాలీదళ్‌కు ముకుతాడు వేస్తున్నారు. కొంతకాలం దగ్గరగా వుండి, తర్వాత దూరమై, మళ్లీ దగ్గరైన టిడిపితో పైకి సఖ్యత కనబడుతున్నా వాళ్లకు ఒరగబెట్టినది ఏమీ లేదు. కాంగ్రెసు యిస్తానన్న ప్రత్యేక హోదా యిచ్చినా ఆంధ్రలో టిడిపి ప్రతిష్ట పెరిగేది. ఆ పని కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిథిగా వున్న గవర్నరు ఆంధ్రకు అన్యాయం చేస్తున్నారని టిడిపి వారే చాలా ఉదాహరణలు యిస్తున్నారు. కేంద్రం ఆంధ్రకు ప్రత్యేకంగా యిచ్చిన నిధులేవీ లేవు. రాజధాని నిర్మాణ నిధుల గురించి కాజువల్‌గా చేసిన ప్రకటనలు కూడా లేవు.  ఋణమాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో వున్న రిజర్వ్‌ బ్యాంకు, ప్రభుత్వబ్యాంకులు ఏమీ సహకరించలేదు. ఏడాదిగా బాబు ఏమీ చేయలేదన్న అభిప్రాయం కలిగించడంలో మోదీ పాత్ర కూడా వుంది. 'మిత్రపక్షం కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం, అదే యుపిఏ అయి వుంటే చెరిగేసి వుండేవాళ్లం, ఎన్‌డిఏ కాబట్టి సఖ్యంగా  బతిమాలో బామాలో, యివాళో రేపో మర్నాడో సాధించుకుని వస్తాం' అని టిడిపి నాయకులు చెపుతూ కాలక్షేపం చేయవలసి వస్తోంది. టిడిపిని దుంపనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కెసియార్‌ను మోదీ శత్రువుగా చూడటం లేదు, కవితకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పిస్తారేమోనన్న పుకార్లు పుట్టాయి. వాటికి మూలం తెరాసయే కావచ్చు, కానీ బిజెపి అధికార ప్రతినిథి వాటిని యిప్పటిదాకా ఖండించలేదు. ఇది కూడా టిడిపికి యిబ్బందికరంగానే వుంది. 

పార్టీకి దూరంగా వున్న ప్రాంతీయ పార్టీల పట్ల మోదీ విధానం వేరేలా వుంది. తమిళనాడు, బెంగాల్‌లలో పార్లమెంటు ఎన్నికలలో బిజెపి గతంలో కంటె విజయాలు సాధించినా, స్థానిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు తమ పట్టు చూపించుకున్నాయి. స్థానిక నాయకత్వం బలపడి, రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన పాత్ర పోషించడానికి చాలా టైము పడుతుందని, యీ లోపుగా తననుకున్న బిల్లులు పాస్‌ చేయించుకోవడానికి రాజ్యసభలో బలం చాలదు కాబట్టి వీటిని దగ్గరకు తీయాలని మోదీ అనుకున్నట్టు కనబడుతోంది. అక్రమాస్తుల కేసులో జయలలిత పట్ల చూపిన ఔదార్యం జగద్విదితం. శారదా స్కాము కేసు విస్తరిస్తున్న కొద్దీ, తన మంత్రులు అరెస్టు అవుతున్నకొద్దీ మమతా బెనర్జీ చల్లబడి, మోదీ స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తృణమూల్‌, ఎడిఎంకె మద్దతు కూడగట్టుకోగలిగితే మోదీకి టిడిపి అవసరం బొత్తిగా వుండదు. ఆట్టే మాట్లాడితే యిప్పుడే లేదు. యుపిలో సొంతంగా బలపడుదామని చూస్తున్నారు కానీ లేకపోతే మాయావతిని కూడా సిబిఐ ద్వారా లొంగదీసి దరి చేర్చుకునేవారే!

ఇలాటి పరిస్థితిలో రేవంత్‌ అంశం మోదీ ముందుకు వచ్చింది. దీన్ని మోదీ రాజకీయంగా ఎలా వాడుకుంటారు అన్నదే గమనించాలి. చంద్రబాబు దోషా కాదా అన్న ప్రశ్న పాఠకులలో వుండవచ్చు, నాయకులలో వుండదు. బాబు యిప్పటివరకు మౌనంగా వున్నా, నాయిని స్టేటుమెంటుపై మండిపడుతూ ''నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు'' అన్నారు. ఆయనకు ఉపన్యాసాలు రాసిచ్చేవారెవరో కానీ కొంప ముంచారు. బ్లాక్‌మెయిల్‌ అనే పదం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక తప్పు లేదా ఒక నేరం  చేసి వుండాలి. దాన్ని అవతలివాడు పసిగట్టి, డబ్బు కోసమో మరో ప్రయోజనం కోసమో నిన్ను బెదిరించాలి. అలా బ్లాక్‌మెయిల్‌ చేయడం కూడా నేరమే. అది వేరే విషయం. కానీ బ్లాక్‌మెయిల్‌ చేయబడుతున్నాను అని ఎవరైనా అంటే దాని అర్థం వాళ్లు బహిరంగంగా చెప్పుకోలేని తప్పో, నేరమో చేసి వుంటారని! ఈ పొరపాటును బాబు దృష్టికి ఎవరైనా తెస్తే ఆయన వెంటనే 'నేనలా అనలేదు. మీడియా సృష్టి, యిది కూడా తెరాస కుట్రలో భాగం' అనవచ్చు. ఆయన మాట నమ్మే వీరభక్తులూ వుండవచ్చు. ఎందుకంటే పదేళ్లగా ఆయన అధికారానికి దూరంగా వున్నారు. ఈ పదేళ్లలో ప్రాజ్ఞత కలిగిన యువ ఓటర్లకు బాబు హయాంలో గతంలో జరిగిన అవినీతి గురించి అవగాహన లేదు. ఎవరైనా వ్యాసం రాసినా, అది వారి మనసుకు హత్తుకోదు. మనం హైస్కూలు, కాలేజీ టైములో విన్న పాటలే మనకు నచ్చుతాయి. అంతకు ముందు పాటలన్నీ బోరు కొడతాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజైందో కచ్చితంగా చెప్పలేం. గతమంతా అలుక్కుపోయి కనబడుతుంది. పక్షపాతంగా వ్యవహరించే మీడియా దాన్ని మరింత అలికేస్తుంది. 

పాతికేళ్లకు అటూయిటూ వున్న తెలుగు ఓటర్లందరికీ అవినీతి అంటే కాంగ్రెసు మాత్రమే గుర్తుకు వస్తుంది – రాష్ట్రంలోను, కేంద్రంలోను అదే పాలిస్తూ వచ్చింది కాబట్టి. అందుకే 2014 ఎన్నికల ప్రచారంలో బాబు తను నిప్పులాటి వాణ్నని చెప్పుకుంటే నమ్మి ఓట్లేశారు. అంత నిప్పులాటి వాళ్లయితే యితర పార్టీలతో సమానంగా ఓటర్లకు వీళ్లు డబ్బులెలా పంచిపెట్టారన్న ప్రశ్న వాళ్ల మెదడులో మెదలకుండా మీడియా వూదరగొట్టేసింది. రేవంత్‌ విషయంలో యింత ఘోరంగా పట్టుబడి పోయినా బాబు అతి ధైర్యంగా నీతి గురించి ఉపన్యాసాలిస్తూ, కెసియార్‌పై కేసు పెట్టు అంటూ నాయినిని ఛాలెంజ్‌ చేస్తూ నెగ్గుకొచ్చేస్తున్నారంటే యీ మద్దతే కారణం. ఇప్పుడు కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఆ ఆడియో తనది కాదని, తన వాయిస్‌ను రాష్ట్రంలో ప్రతి మిమిక్రీ ఆర్టిస్టు అనుకరించగలడని ఆయన వాదిస్తారు. కేసు రిజిస్టరై  యీయన్ని సీటు నుంచి తప్పుకోమని కోర్టులు అనడానికి చాలా టైము పడుతుంది. కోర్టులో ఆ ప్రమాదం జరగకుండా చూడడానికి బాబు ఎప్పణ్నుంచో ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. ఆయన వలన ఉపకారం పొందినవారు అన్ని చోట్లా వున్నారు. నాట్‌ బిఫోర్‌ మీ అంటూ కేసును త్రో బాల్‌లా తోసేస్తూ జాప్యం చేసేయగలరు. 

కానీ యీ మచ్చ తొలగించుకోకపోతే బాబు అథారిటీ పార్టీలో, ప్రభుత్వంలో బలహీనపడుతుంది. అవినీతి నిర్మూలన గురించి అధికారులకు ఉపన్యాసం దంచుతూ వుంటే ముసిముసి నవ్వులు వినబడవచ్చు. కేసు తేలాక రాజధాని సంగతి చూదాం అని సింగపూరు వాళ్లు కబురంపితే, పెట్టుబడులు రావడం ఆలస్యమైతే బాబు యిమేజికి భంగం. అక్కడేదో జరుగుతున్నట్లు చూపకపోతే ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము అవుతాయి. ఇప్పటికే అక్కడ కొయ్యగుఱ్ఱం టైపు యాక్టివిటీ నడుస్తోంది. రోజూ పేపర్లో ఏదో వార్త వస్తుంది, జరుగుతున్నదేమీ కనబడదు. ఈ పరిస్థితుల్లో 'నా పై మచ్చ తొలగించుకుని అగ్నిపునీతుడనై మళ్లీ అధికారం చేపడతా' అని స్టేటుమెంటు యిచ్చి పక్కకు తప్పుకుని, దిగువ కోర్టులోనైనా ఏదో ఒక సాంకేతిక కారణంతో కేసు ఎడ్మిట్‌ కాకపోతే 'అదిగో నేను నిర్దోషినని కోర్టు చెప్పింది' అంటూ మళ్లీ అధికారం చేపట్టవచ్చు. ఇలా జరిగే సావకాశం తక్కువ అని అనేకమంది పాఠకులు భావిస్తున్నారు. తక్కువే, కానీ అలా చేయకపోతే యీ మచ్చతో ఎక్కువకాలం సాగదీయడం బాబుకి, రాష్ట్రానికి హాని కలగిస్తుంది. 

ఈ మచ్చ తొలగించుకోవాలంటే మోదీ సహకరించాలి. జయలలిత కేసులో అయితే ప్రత్యర్థి కరుణానిధికి, మోదీకి ఎన్నడూ సఖ్యత లేదు. ఇక్కడ బాబును అన్యాయంగా యిరికించారు అని చూపించాలంటే కెసియార్‌ను బద్నామ్‌ చేయాలి. కెసియార్‌ పట్ల మోదీ అంత తీవ్రంగా వ్యవహరిస్తారా అన్నది అనుమానం. పబ్లిక్‌ మనీకి సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ నాయకుణ్ని బయటపడేయడంలో కష్టం లేదు. కానీ యిక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు తలపడ్డారు. ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టు తయారైంది. చివరకు ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని నియంత్రిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బిజెపికి ఎప్పణ్నుంచో క్యాడర్‌ వుంది. తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది కూడా. అయినా ఎన్నికలలో లాభం పొందలేకపోయింది. ఆంధ్రలో బిజెపి మొదటి నుంచి బలహీనమే. టిడిపి పొత్తుతో సీట్లు గెలుచుకుంటోంది. స్వతంత్రంగా ఎదగాలి అని అమిత్‌ షా హెచ్చరించి వెళ్లారు. ఏ కారణం చేతనైనా బాబుకు అవినీతి మచ్చ అంటితే లాభపడేది బిజెపియే. 

జగన్‌ అంటే మూర్తీభవించిన అవినీతి అన్న యిమేజి బలంగా ప్రజల్లోకి వెళ్లడం చేతనే 2014 ఎన్నికలలో వైకాపా ఓడిపోయింది. రాజధాని నిర్మాణం అంటే లక్షల కోట్లతో కూడిన సంగతి, జగన్‌ వంటివాడు సిఎంగా వుంటే చాలా భాగం స్వాహా అయిపోతుంది. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు రాజధానిలో తిష్ట వేసి స్థలాలు కబ్జా చేసేస్తారు. ఈ అవినీతి చూసి పెట్టుబడిదారులు యిటు తొంగి చూడరు. జగన్‌కు బదులు పరిపాలనాదకక్షుడిగా పేరుబడిన బాబును ఎన్నుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మధ్యతరగతి ప్రజలు ప్రగాఢంగా నమ్మి టిడిపికి ఓట్లేశారు. ఇప్పుడు బాబు కూడా అదే కోవకు చెందినవాడని ఏ మాత్రం శంక కలిగినా టిడిపి పట్ల విముఖత పెరుగుతుంది. దాన్ని బిజెపి ఎన్‌క్యాష్‌ చేసుకోగలుగుతుంది. వైకాపా ప్రతిపక్షంగా కూడా చాలా నీరసంగా వుంది. జగన్‌ ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా పని చేయడం లేదు. అప్పుడప్పుడు ఏవో దీక్షలు చేస్తూ, ఎన్నికల సమయంలోనే ఉధృతంగా కాన్వాస్‌ చేసుకుంటే చాలనే ఆలోచనలో వున్నట్టు కనబడుతోంది. కాంగ్రెసు కోలుకోవడానికి యింకా నాలుగైదేళ్లు పట్టవచ్చు. బిజెపిలో నాయకులు వచ్చి చేరారు కానీ వాళ్లకు పనేమీ లేదు. బాబును యిరకాటంలో పెట్టి రాజకీయశూన్యం సృష్టించగలిగితే దాన్ని పూరించడానికి వీళ్లందరూ ముందుకు దూసుకుని వస్తారు. ఈ అవకాశాన్ని మోదీ వదులుకుంటారా? వదులుకుంటే మాత్రం టిడిపి నుంచి పెద్ద మూల్యమే రాబడతారు. కథ ముందుముందు ఎలా నడుస్తుందో కానీ ప్రస్తుతానికి ఆసక్తికరంగానే వుంది. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Archives