సినిమా రివ్యూ: ఆంధ్రాపోరి

రివ్యూ: ఆంధ్రాపోరి రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: ఆకాష్‌ పూరి, ఉల్క గుప్తా, అరవింద్‌ కృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఈశ్వరిరావు, శ్రీముఖి, ఉత్తేజ్‌  తదితరులు సంగీతం: డా॥ జె కూర్పు: శ్రీకర్‌…

రివ్యూ: ఆంధ్రాపోరి
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: ఆకాష్‌ పూరి, ఉల్క గుప్తా, అరవింద్‌ కృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఈశ్వరిరావు, శ్రీముఖి, ఉత్తేజ్‌  తదితరులు
సంగీతం: డా॥ జె
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ వనమాలి
నిర్మాత: రమేష్‌ ప్రసాద్‌
రచన, దర్శకత్వం: రాజ్‌ మదిరాజు
విడుదల తేదీ: జూన్‌ 5, 2015

మరాఠీలో ఘన విజయం సాధించిన చిత్రానికి రీమేక్‌ అని, ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రమని, పూరి జగన్నాథ్‌ తనయుడు హీరోగా నటించిన సినిమా అని ‘ఆంధ్రాపోరి’లో ఏదో ప్రత్యేకత ఉంటుందని వెళితే రెండున్నర గంటల పాటు ఒక నాసిరకం ప్రేమకథ పెట్టే టార్చర్‌ భరించాల్సిందే. సాధారణంగా టీనేజ్‌ ప్రేమకథలు పెద్ద వాళ్లకి గత స్మృతులు గుర్తు చేయడం, టీనేజర్లకి వారి స్వీయానుభావాలు కళ్ల ముందుంచడం చేస్తుంటాయి. 

ఒక టీనేజ్‌ ప్రేమకథలో ఉండాల్సిన ఇన్నొసెన్స్‌, క్యూట్‌నెస్‌ ‘ఆంధ్రాపోరి’లో అస్సల్లేదు. ప్రేమ కథలో కొత్త మలుపులు ఉండక్కర్లేదు కానీ కనీసం ఆ ప్రేమజంటతో అయినా ప్రేమలో పడాలి, లేదా వారిని సింపతైజ్‌ చేయాలి. ఆంధ్రాపోరి లీడ్‌ క్యారెక్టర్లని తీర్చి దిద్దిన తీరుకి వారిని ప్రేమించడం అస్సలు జరగదు. ఇందులో వారి ప్రేమ డెవలప్‌ అయ్యే తీరుకీ, వారి మధ్య జరిగే దానికీ ఆ జంట ఏమైపోయినా ప్రేక్షకులకి అస్సలు పట్టదు. మరాఠీ సినిమా కథనం మార్చకుండా ఫాలో అయ్యారో లేక మార్పులు ఏమైనా చేసారో తెలీదు కానీ ‘టైమ్‌పాస్‌’ పేరుతో మరాఠీలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ కనీసం టైమ్‌పాస్‌గా కూడా పనికి రాదు. 

టీనేజ్‌ ప్రేమకథల సక్సెస్‌కి కారణమయ్యే రిలేటబుల్‌ క్యారెక్టర్స్‌, సిట్యువేషన్స్‌ ఇందులో లేవు. చదువు అబ్బక, టెన్త్‌ పాస్‌ కాలేక… సినిమా థియేటర్‌ రిక్షాకి అనౌన్సర్‌గా పని చేసే పిల్లాడితో ఎవరు రిలేట్‌ చేసుకుంటారు చెప్పండి? దేనికీ కొరగాని కుర్రాడితో ప్రేమలో పడిన అమ్మాయితో ఎవరైనా ఎందుకు ట్రావల్‌ చేస్తారని! నిరుపేద కుర్రాడు, మధ్య తరగతి అమ్మాయి మధ్య టీనేజ్‌లోనే పుట్టే ప్రేమ, దానికి ఎదురయ్యే ఇబ్బందులే ఈ చిత్ర కథ. ఎక్సయిట్‌మెంట్‌ కలిగించే ఒక్క సన్నివేశం కూడా లేకుండా, ఇంట్రెస్ట్‌ పుట్టించే ఒక్క సందర్భం అయినా క్రియేట్‌ చేయకుండా ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లేతో నీరసంగా సాగే ఈ ప్రేమకథని చివరి వరకు చూడడం ఎంతటి ఓర్పుమంతులనైనా పరీక్షిస్తుంది. 

పూరి జగన్నాథ్‌లాంటి కాంటెంపరరీ ఆలోచనలున్న దర్శకుడు ఈ స్టోరీని ఎలా యాక్సెప్ట్‌ చేసారో, చాలా అరుదుగా మాత్రమే సినిమాలు నిర్మిస్తోన్న ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రం నిర్మించడానికి ఎందుకు ముందుకొచ్చిందో అర్థం కాదు. ప్రేమకథా చిత్రాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సన్నివేశమైనా మనసుని తాకుతుంది. కానీ ఆంధ్రాపోరిలో అలాంటి ఒక్క టచింగ్‌ సీన్‌ లేదు. టీనేజ్‌ పిల్లకి సంగీతం పాఠాలు నేర్పించే యువతి… ప్రేమించిన కుర్రాడిని మనసులో తలచుకుంటే స్వరాలు బాగా వస్తాయని బోధిస్తుంది. ఆ వయసు పిల్లలో లేని పోని ఆలోచనలు రేకెత్తిస్తుంది. తీరా తాను ఓ అబ్బాయిని ప్రేమించానంటూ అతడిని పరిచయం చేస్తే… ఇతడినా నువ్వు ప్రేమించేది అంటూ దులిపేసి అతడిని వెళ్లగొడుతుంది. అంటే ఆ పిల్లాడు బాగా చదువుకుంటూ, కాస్త డబ్బు ఉన్న వాడైతే పర్వాలేదు కానీ చదువు లేక ఏదో పని చేసుకునే వాడైతే ప్రేమించడానికి పనికి రాడనుకోవాలా? 

ఆకాష్‌ పూరి నటించగలడు. క్లయిమాక్స్‌ సీన్‌లో అతని ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి తొందర పడకుండా హీరో కావడానికి తగిన వయసు వచ్చే వరకు వేచి చూస్తే మంచిది. ఉల్క గుప్తా ఏమాత్రం ఆకట్టుకోలేదు. కనీసం సరిగా లిప్‌ సింక్‌ ఇవ్వడం కూడా చేతకాలేదు. ఈశ్వరిరావు నటన సహజంగా ఉంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ పాత్రని కామెడీగా తీర్చిదిద్దాలని చూసారు కానీ అది పండలేదు. అరవింద్‌ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేసారు. 

డా॥ జె సంగీతం కూడా సాదాసీదాగా ఉంది. ప్రేమకథకి తప్పనిసరిగా కావాల్సిన హిట్‌ సౌండ్‌ ట్రాక్‌నివ్వడంలో అతను విఫలమయ్యాడు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ‘రుషి’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్‌ మదిరాజు ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు. కమర్షియల్‌ సినిమాల్లో కంటే ప్రేమకథా చిత్రాల్లోనే దర్శకుడి ప్రతిభ బాగా తెలుస్తుంది. లవ్‌ సీన్స్‌ పక్కన పెట్టి కనీసం డ్రామా సీన్స్‌ని కూడా పండిరచలేకపోయాడు. అంత హంగామా చేసిన కూలింగ్‌ టవర్‌ సీన్‌ కూడా తేలిపోయింది తప్ప ఎక్సయిట్‌ చేయలేదు. టీనేజ్‌ ప్రేమకథల్లో ఎక్కువసార్లు ఫిజికల్‌ ఎట్రాక్షన్‌ని హైలైట్‌ చేసి క్యాష్‌ చేసుకోవాలని చూస్తుంటారు. అలాంటి చీప్‌ ట్రిక్స్‌ జోలికి పోకుండా క్లీన్‌ లవ్‌స్టోరీగా దీనిని మలిచినందుకు మాత్రం మేకర్స్‌ అభినందనీయులు. ఆ ఒక్క ప్లస్‌ పాయింట్‌ తప్పిస్తే ఆంధ్రాపోరి బాగా డిజప్పాయింట్‌ చేయడమే కాకుండా థియేటర్లో ఉన్నంత సేపు సినిమాకి వెళ్లినందుకు రిగ్రెట్‌ అయ్యేట్టు చేస్తుంది. 

బోటమ్‌ లైన్‌: బోరింగ్‌ లవ్‌ స్టోరీ!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri